వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డ్‎లు, ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: వచ్చే నెల (అక్టోబర్)లో అర్హులకు కొత్త రేషన్ కార్డ్‎లు, ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న నాలుగు ఫ్లైఓవర్‎లకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా వరద బాధిత కుటుంబాలకు 30 టన్నుల బియ్యం పంపుతోన్న వాహనాన్ని జెండా ఊపి  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. భవిష్యత్‎లో మరిన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. మిర్యాలగూడలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. ప్రమాదాలు నివారించడానికి మేం అధికారంలోకి రాగానే నాలుగు కొత్త ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

 ప్రమాదకరంగా ఉన్న సర్కిల్‎లలో ప్లైఓవర్‎లు త్వరిత గతిన పూర్తి చేసి ప్రమాదాలను అరికడతామని అన్నారు. యాదాద్రి ధర్మల్ ప్లాంట్‎ను ఆరు, ఏడు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఎస్ఎల్‎బీసీ సొరంగ మార్గాన్ని మాజీ సీఎం కేసీఆర్పట్టించుకోలేదని.. దానిని కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.  ఓడిపోయిన మిర్యాలగూడ ఎమ్మెల్యే మళ్ళీ సర్పంచ్‎గా కూడా గెలవలేడని ఈ సందర్భంగా మంత్రి ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు జరగాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్‎ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.