జైనథ్ మండలంలో కనుల పండువగా లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం

 ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్ మండల కేంద్రంలోని చారిత్రక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండగా.. వేడుకగా చేపట్టే రథోత్సవంలో భాగంగా నారాయణుడి ఉత్సవ విగ్రహాలను భక్తి సంకీర్తనలు, కోలాటాలతో ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. 

మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, ఆదిలాబాద్ పట్టణం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తిలకించారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రూకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.