పట్టభద్రుల ఓటుకూ రేటు రూ.500 నుంచి రూ.1000

  •     కొన్ని చోట్ల రూ.2 వేలు కూడా...
  •     వ్యక్తిగతంగా కలిసి పంపిణీ చేసిన పార్టీల లీడర్లు  
  •     అందుబాటులో లేనివారికి ఆన్​లైన్​ ట్రాన్స్​ఫర్​ 
  •     తమకు ఇవ్వలేదని అడిగి తీసుకున్న గ్యాడ్యుయేట్స్​
  •     ఆది, సోమవారాల్లో కొనసాగిన తతంగం

యాదాద్రి, వెలుగు : సాధారణ ఎన్నికల మాదిరిగానే పట్టభద్రుల ఓటర్లకూ ప్రధాన పార్టీలు రేటు ఫిక్స్​ చేసి పంచాయి. రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు పంపిణీ చేయడంతో గ్యాడ్యుయేట్స్​ కూడా మొహమాట పడకుండా తీసుకున్నారు. కొన్నిచోట్ల డిమాండ్ ​మేరకు రూ.2 వేల వరకూ ఇచ్చినట్టు సమాచారం. నల్గొండ– -వరంగల్–​-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్​, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేండ్లలోపే అయినా.. పట్టుదలకు పోయాయి.

రాష్ట్రంలో అధికారం కోల్పోయి పట్టు కోల్పోతుందన్న దశలో  ఎలాగైనా పరువు దక్కించుకోవాలని బీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్..​ యువత తమ వెంటే ఉన్నారని చెప్పుకుంటున్న బీజేపీ ఆ మాట నిజం చేసే దిశగా పంపిణీకి సర్వశక్తులు ఒడ్డాయి.   

ముందు బీఆర్ఎస్..తర్వాత కాంగ్రెస్​..​

సోమవారం పోలింగ్​ఉన్నప్పటికీ ఆదివారం ఉదయం వరకూ మూడు ప్రధాన పార్టీల లీడర్లు డబ్బుల పంపిణీ గురించి ఆలోచించలేదు. కానీ, ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా బీఆర్ఎస్​ పోల్​మేనేజ్​మెంట్​ప్రారంభించిందన్న లీకులు బయటకు వచ్చాయి. ఆ పార్టీ లీడర్లు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓటుకు రూ. 500 చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్​ లీడర్లు కూడా అప్రమత్తమయ్యారు.

అప్పటికప్పుడు ఫోన్ల ద్వారా చర్చలు జరుపుకుని తాము ఇవ్వకుంటే నష్టం జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చారు. వెంటనే తమ పార్టీ  క్యాడర్​ను రంగంలోకి దింపారు. రెండు ప్రధాన పార్టీలు పోల్​ మేనేజ్​మెంట్​కు సిద్ధపడడంతో బీజేపీ కూడా రంగంలోకి దిగింది. మిగతా పార్టీల స్థాయిలో కాకుండా రూ. 200 నుంచి రూ. 300 వరకూ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు  తెలిసింది.  

ఓటుకో లెక్క  

ఆదివారం రాత్రి నుంచి ఆయా రాజకీయ పార్టీల లీడర్లు లిస్టులను చేతిలో పట్టుకుని ఓటర్లను పర్సనల్​గా కలవడం ప్రారంభించారు. ఓటరును బట్టి అమౌంట్​ఇచ్చారు. ఓటు ఖచ్చితంగా వేస్తారని భావించిన వారికి రూ.1000 చొప్పున అందజేశారు. దగ్గరివాడైతే అంతకుమించి రూ.2 వేల వరకు పంపిణీ చేశారు. కలిసిన ప్రతి ఓటరుకు మాత్రం 
రూ. 500 చొప్పున ఇచ్చారు. ఓటు పడే అవకాశం లేదన్న అభిప్రాయం కలిగితే రూ. 200 చొప్పున అందజేశారు. తెలిసిన ఓటరు అందుబాటులో లేనట్టయితే ఫోన్​ చేసి అమౌంట్​'పే' చేశారు. బీజేపీ మాత్రం ఓటర్లకు రూ. 200 నుంచి రూ. 300 మించి ఇవ్వలేదు. 

పోల్​చిట్టీతో రూ.500  

ఆదివారం రాత్రి సమయంలో దొరకని వారికి సోమ వారం ఉదయం కూడా డబ్బులు పంపిణీ చేశారు. చివరకు పోలింగ్​ బూత్​కు కొద్ది దూరంలో రాజకీయ పార్టీల లీడర్లు టెంట్లు వేసుకుని పోల్​చిట్టీతో పాటు రూ.500 ఇవ్వడం కనిపించింది. కొందరు ఓటర్లు మూడు పార్టీల టెంట్ల వద్దకు వెళ్లి పోల్​చిట్టీతో పాటు రూ.500 తీసుకున్నారు. మరికొందరైతే తమకు ఇవ్వలేదంటూ డిమాండ్​చేసి మరీ వసూలు చేశారు. బహిరంగంగానే డబ్బులు పంచుతున్నట్టు ప్రచారం జరిగినా పోలీసులు ఆ వైపుకు మాత్రం వెళ్లలేదు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు  పోలింగ్ స్లిప్పులు చూసుకుంటూ ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఇచ్చారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం దగ్గరున్న స్వీట్ షాప్ వెనుక ఓ పార్టీ లీడర్లు డబ్బులు పంపిణీ చేయడంతో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు సి విజిల్ యాప్​ల ఫిర్యాదు చేశారు. ఖమ్మం బైపాస్ రోడ్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో ఓటర్లకు డబ్బులు పంచుతున్న విషయం తెలుసుకొని భారీగా జనం అక్కడికి చేరుకోగా..

ఆ పార్టీ నేతలు గేటుకు తాళం వేసి పారిపోయారు. కొత్తగూడెంలోని రామకృష్ణ హైస్కూల్ సమీపంలోని ఒక గల్లీలో ఓటర్లకు డబ్బులు పంచడం మీడియా కెమెరాలకు చిక్కింది. కొన్నిచోట్ల ఓటర్లకు పంచాల్సిన డబ్బులు నేతలే కొట్టేశారని కార్యకర్తలు ఆరోపించారు. ఒక పార్టీ నేతలు ఆదివారం రాత్రే ఓటర్ లిస్ట్ ప్రకారం డబ్బులు పంపిణీ చేయగా.. మరో పార్టీ నేతలు మాత్రం సోమవారం ఉదయం నుంచి ఓటర్లకు డబ్బులు పంచారు.  

సూర్యాపేటలో కౌంటర్లు పెట్టి..

సూర్యాపేట జిల్లాలో ప్రధాన పార్టీలు ఓటర్లకు బహిరంగంగా రూ.500 చొప్పున పంపిణీ చేశాయి.  పార్టీల కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల సమీపంలోనే తమ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ డబ్బులు పంచారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ సమీపంలో ఏర్పాటుచేసిన  పోలింగ్​ కేంద్రాలకు సమీపంలోనే  టెంట్లు వేసుకొని, కౌంటర్లు పెట్టి మరీ పోలింగ్ స్లిప్పులు తీసుకుంటూ పైసలు ఇచ్చారు.   

వరంగల్​ లోని ఆర్ట్స్​అండ్​ సైన్స్​ కాలేజీ వద్ద.. 

గ్రేటర్ వరంగల్ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేశారు. సమాచారం తెలుసుకున్న సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి అక్కడికి చేరుకుని ఓ కార్యకర్త వద్ద రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.