రతన్ టాటా పట్టిందల్లా పసిడే

ఆయన పట్టిందల్లా బంగారమే... కాదు కాదు! ఆయన ఏది పట్టుకున్నా దాన్ని బంగారంలా తీర్చిదిద్దుతాడు. అందుకే రతన్​ టాటా వ్యాపార జీవితంలో సాధించిన సక్సెస్​ల ముందు చిన్న చిన్న వైఫల్యాలు కనిపించవు. టాటా గ్రూప్‌‌ ప్రపంచ స్థాయికి ఎదగడంలో ఆయన చేసిన కృషి చెప్పలేనిది. సంస్థ విలువను 4 బిలియన్‌‌ డాలర్ల నుంచి 96 బిలియన్‌‌ డాలర్లకు పెంచారు. 

రతన్​ టాటా దూరదృష్టి వల్ల టాటా గ్రూప్​ అనేక రంగాల్లో విజయం సాధించింది.  రెండు దశాబ్దాలకు పైగా భారతీయ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ టైంలో ముందుండి కంపెనీని నడిపించారు. ఇండియాలోని మార్కెట్ల మీద రతన్ టాటా ప్రభావం​ చాలా ఉంది. టాటా సన్స్ ఛైర్మన్‌‌‌‌గా ఉన్నప్పుడు టాటా గ్రూప్‌‌‌‌ను గ్లోబల్ పవర్‌‌‌‌హౌస్‌‌‌‌గా మార్చాడు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. టెట్లీ, జాగ్వర్ ల్యాండ్ రోవర్, కోరస్ లాంటి ఇంటర్నేషనల్​ కంపెనీలను కొనే స్థాయికి ఎదిగింది. టాటా నానో లాంటి వినూత్న ఉత్పత్తులను ఇండియాకు అందించింది.  

టాటా గ్రూప్​లోకి ఎంట్రీ

రతన్ టాటా పదిహేడేండ్ల వయసులో యునైటెడ్ స్టేట్స్‌‌‌‌కు వెళ్లిపోయారు. అక్కడే చదువుకున్నారు. నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఇండియాకు వచ్చారు. తర్వాత ‘టాటా ఇండస్ట్రీ’లో చేరారు. రతన్​టాటా చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అన్న విషయం తెలిసి జహంగీర్ రతన్‌‌‌‌జీ దాదాభాయ్ (జేఆర్డీ) టాటా రతన్​ను తన  దగ్గరకు పిలిపించుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఏడాది కాలం పనిచేశారు. రతన్ టాటాకు ‘సెంట్రల్ మిల్, నెల్కో’ లాంటి నష్టాల్లో ఉన్న కంపెనీలను గాడినపెట్టే బాధ్యతలను అప్పగించారు జేఆర్డీ. రతన్ టాటా నేతృత్వంలో మూడేళ్లలోనే నెల్కో లాభాల్లోకి వచ్చేసింది. దాంతో ఆయన టాలెంట్​ని గమనించిన జేఆర్డీ 1981లో రతన్‌‌‌‌ను టాటా ఇండస్ట్రీస్‌‌‌‌కు చీఫ్‌‌‌‌గా చేశారు.

రతన్​ టాటాలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవారు. ఆయన లీడర్​షిప్​ పొటెన్షియల్​ ఆయన చేసే ప్రతి పనిలో కనిపించేది. ఆస్ట్రేలియాలో టాటా గ్రూప్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహించిన్నప్పుడు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​)ని రూపొందిస్తున్నప్పుడు చాలావరకు అన్ని పనులు ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. మొత్తంగా టాటా సామ్రాజ్యాన్ని బలోపేతం చేసేందుకు చాలా కష్టపడ్డారు. 

వారసుడిగా..

జేఆర్డీ టాటాకు 75 ఏళ్లు వచ్చినప్పుడు ఆయన వారసుడు ఎవరు? అని విపరీతంగా చర్చ జరిగింది. నాని పాల్ఖీవాలా, రుసీ మోదీ, షారుఖ్ సబ్వాలా, హెచ్‌‌‌‌ఎన్ సేథ్నాల్లో ఒకరు ఆయన వారసులు అవుతారని అందరూ అనుకున్నారు. రతన్ టాటా కూడా పాల్ఖీవాలా, రూసీ మోదీల్లో ఎవరో ఒకరు అవుతారు అనుకున్నారు. కానీ.. ఆయనకు 86 ఏండ్ల వయసు వచ్చాక 1991లో జేఆర్డీ టాటా ఛైర్మన్ పదవి నుంచి దిగిపోయి  కంపెనీ వారసత్వ బాధ్యతలు రతన్ టాటాకు అప్పగించారు. అలా రతన్ ‘టాటా సన్స్’ ఛైర్మన్‌‌‌‌ అయ్యాడు. ఆ తర్వాత అతని నాయకత్వం టాటా గ్రూప్​ని చాలా మార్చేసింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆరోజుల్లో కూడా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని టాటా గ్రూప్​ని నిలబెట్టాడు. ఆర్థిక సంస్కరణలకు అనుగుణంగా కంపెనీని పునర్నిర్మాణం చేశాడు. గ్రూప్​ గ్లోబలైజేషన్​కు పునాదులు వేశాడు. వ్యాపారంలో ఎదిగేందుకు ఎన్నో సాహసాలు చేశారు. ఛైర్మన్​ కాకముందునుంచే రతన్ టాటా హై–టెక్నాలజీ బిజినెస్​లను ప్రోత్సహించడం ద్వారా కంపెనీని పునర్నిర్మించాడు. ఆయన1983లో టాటా గ్రూప్ స్ట్రాటజిక్​ ప్లాన్​ని తయారుచేశారు.  

టాటా ఇండికా

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్యాసింజర్ కారు ఇది. ఈ ఐకానిక్ ఇండికా కారు రతన్​ టాటా లీడర్​షిప్​లోనే వచ్చింది. 1998లో టాటా గ్రూప్​ ఈ కారు తయారీతో ప్యాసింజర్ వెహికల్స్​ విభాగంలోకి ప్రవేశించింది. టాటా మోటార్స్ డెవలప్​ చేసిన కాంపాక్ట్ హ్యాచ్‌‌‌‌బ్యాక్ ఇది. సాధారణంగా మన దగ్గర తక్కువ ధరలో దొరికే ఎక్కువ మైలేజీ ఇచ్చే వెహికల్స్​కి డిమాండ్​ ఉంటుంది. ఆ డిమాండ్​ని తీర్చడానికే ఈ కారుని తీసుకొచ్చారు.

ఇది విశాలమైన ఇంటీరియర్, 20 కేఎంపీఎల్​ కెపాసిటీ.. 1.4-లీటర్ డీజిల్ ఇంజన్‌‌‌‌తో వచ్చింది. తర్వాత 1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్​ని తీసుకొచ్చారు. ఈ కారు దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. 2008లో దీంట్లో కొన్ని మార్పులు చేసి ఇండికా విస్టా అనే వేరియెంట్​ని​ తీసుకొచ్చింది కంపెనీ. టాటా మోటార్స్ 2020లో ఇండికా తయారీని ఆపేసింది. అయితే.. 2016లో తీసుకొచ్చిన టాటా టియాగో దాని స్థానాన్ని భర్తీ చేసింది. 

టెట్లీ టీ 

రతన్ టాటా 2000 సంవత్సరంలో టెట్లీ టీని 430 మిలియన్​ అమెరికన్​ డాలర్లకు కొన్నారు. ​ అంతర్జాతీయ విస్తరణ వైపు అడుగులు వేస్తున్న టాటా గ్రూప్​కు ఇదే ముఖ్యమైన అడుగు. అప్పట్లో టాటా టీ చాలా పెద్ద కంపెనీగా ఉన్నప్పటికీ గ్లోబల్​ మార్కెట్​లో దాని ప్రత్యేకతను చాటుకోలేకపోయింది. యూనిలీవర్ లాంటి పెద్ద బ్రాండ్స్​తో పోలిస్తే టాటా పనితీరు చెప్పుకోదగినట్టు ఉండేది కాదు. అలాంటి టైంలో టాటా టీ కంటే మూడు రెట్లు పెద్దదైన టెట్లీని కొనడం సాహసోపేతమైన నిర్ణయమే. కానీ.. రతన్​ టాటా వేసిన ఈ ఒక్క అడుగు గ్లోబల్​ బేవరేజెస్​ మార్కెట్​లో టాటా ఉనికిని విస్తరించడమే కాకుండా తరువాత దశాబ్దంలో అంతర్జాతీయ కొనుగోళ్లకు దారులు వేసింది. 

జాగ్వర్, ల్యాండ్ రోవర్ 

టాటా ఇండికా కారుని లాంచ్​ చేసిన మొదటి ఏడాది పెద్దగా లాభాలు రాలేదు. రతన్​ టాటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్​ వల్ల కంపెనీకి నష్టాలు రాకూడదు అనుకున్నాడు.  అందుకే టాటా మోటార్స్‌‌‌‌ను యుఎస్ ఆటో దిగ్గజం ఫోర్డ్‌‌‌‌కు అమ్మాలి అని నిర్ణయించుకున్నాడు.1999లో కంపెనీ అధికారులు అమెరికా నుంచి ముంబయి వచ్చి టాటా గ్రూప్‌‌‌‌తో చర్చలు జరిపారు. తర్వాత డెట్రాయిట్‌‌‌‌లో కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్‌‌‌‌ను రతన్ టాటా కలిశారు. అక్కడ మూడు గంటలకు పైగా  మీటింగ్​ జరిగింది. ఆ మీటింగ్​లో బిల్ ఫోర్డ్ రతన్​టాటాని అవమానించినట్టు మాట్లాడాడు. ‘‘ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్ గురించి ఏమీ తెలియకుండా వ్యాపారం ఎందుకు ప్రారంభించారు’’ అని ప్రశ్నించాడు. అంతేకాదు.. అక్కడి అధికారులు కూడా టాటా మోటార్స్​ని కొని ఒక ఇండియన్​ కంపెనీకి మేలు చేస్తున్నట్టు మాట్లాడారు. దాంతో వెంటనే రతన్ టాటా అక్కడి నుంచి వచ్చేశారు. టాటా మోటార్స్​ని అమ్మకూడదని డిసైడ్​ అయ్యారు.

ఇండికాని సక్సెస్​ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. సీన్​ కట్​ చేస్తే.. 2004 నాటికి కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. 2007లో ఏకంగా1.42 లక్షల అమ్మకాలు జరిగాయి. ఆ మరుసటి ఏడాది 2008లో మాంద్యం రావడంతో ఫోర్డ్ దివాలా తీసింది. అప్పటికి టాటా మోటార్స్ లాభాల్లో ఉంది. అందుకే ఫోర్డ్ పోర్ట్‌‌‌‌ఫోలియోలో రెండు ఐకానిక్ బ్రాండ్స్​ జాగ్వర్​, ల్యాండ్​రోవర్​ని కొని రతన్​ టాటానే ఫోర్డ్​కి మేలు చేశారు. 2.3 బిలియన్ల అమెరికన్​ డాలర్లకు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఫోర్డ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ టాటాకు థ్యాంక్స్​ చెప్పారు. 

కోరస్ స్టీల్ 

 టాటా స్టీల్ యూకే బేస్డ్​ ఉక్కు ఉత్పత్తిదారు కోరస్‌‌‌‌ను 2007లో12.9 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటివరకు ఏ ఇండియన్​ కంపెనీ ఇంత ఖర్చు చేసి విదేశీ కంపెనీని కొనుగోలు చేయలేదు. టాటా స్టీల్‌‌‌‌ ప్రపంచంలోని టాప్​ 10 పెద్ద ఉక్కు ప్రొడ్యూసర్లలో ఒకటిగా ఎదగడంలో రతన్ టాటాది ముఖ్యపాత్ర. అయితే.. ఈ కొనుగోలు మాత్రం టాటా స్టీల్​కు నష్టాలను కూడా తెచ్చిపెట్టింది.  

లక్షకే కారు

టాటా నానో కారు మార్కెట్​లోకి వచ్చినప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది. కానీ.. అది పెద్దగా సక్సెస్​ కాలేకపోయింది. అయితే.. రతన్​ టాటా ఈ కారుని మార్కెట్​లోకి తీసుకురావడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే.. ఒకసారి రతన్‌‌‌‌టాటా ముంబయిలో తన కారులో వెళ్తున్నారు. అప్పుడు ఒక స్కూటర్ మీద ఇద్దరు దంపతులు, వాళ్ల ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ కూర్చుని వెళ్తున్నారు. పైగా.. అప్పుడు వర్షం మొదలైంది. ఆ వర్షంలో కూడా ఆగకుండా వెళ్లారు. అదంతా చూసిన రతన్​ టాటా పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక కారుని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే టాటా నానో. అయితే.. మొదట్లో ఆయన లక్ష రూపాయలకే కారుని తయారుచేయాలి అనుకున్న ఆలోచనను చెప్పినప్పుడు ఎంతోమంది నవ్వుకున్నారు.

‘లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు?’ అని వెటకారం చేశారు. కానీ రతన్​ టాటా వెనక్కి తగ్గకుండా ఆ ప్రాజెక్ట్​ మీద పనిచేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ‘నానో’ను మార్కెట్​లోకి తీసుకొచ్చారు. అయితే.. ఆయన దాని ధరను ప్రకటించినప్పటికీ.. కారు మార్కెట్​లోకి వచ్చిన టైంకి ముడి సరుకు ధరలు పెరిగి ప్రొడక్షన్​ కాస్ట్​ పెరిగింది. అయినా.. ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలకే అమ్మాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్​ ఫెయిల్​ కావడంతో నానో కార్ల తయారీ నిలిపివేశారు. నానో కారుని తీసుకొచ్చే ప్రయత్నంలో రతన్​ టాటా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని సింగూర్‌‌‌‌లో నానో కారుని తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ.. అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో ప్లాంట్​ని మళ్లీ గుజరాత్​కి మార్చారు. 

టీసీఎస్​

రతన్ టాటా హయాంలోనే 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​) ఐపీవోకి వచ్చింది. ఇది ప్రైవేట్-రంగ సంస్థ అయినప్పటికీ ఇండియాలోని మొదటి 1 బిలియన్ డాలర్ల ఐపీవోగా గుర్తింపు దక్కించుకుంది. అప్పటికే ఇది 32 దేశాల్లో తన ఉనికిని చాటింది. ఆ తర్వాత మరో 300 ఆఫీస్​లు, 200 డెలివరీ సెంటర్లతో 55 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం టీసీఎస్​ విలువ 183.36 బిలియన్లు. ఇది భారతదేశపు అతిపెద్ద, అత్యంత విజయవంతమైన కంపెనీల్లో  ఒకటి. 

సినిమా నిర్మాతగా.. 

రతన్ టాటా సినిమా ప్రేమికుడు కూడా. ఆయన 2004లో వచ్చిన బాలీవుడ్​ సినిమా ‘ఏత్‌‌‌‌బార్’​కు సహనిర్మాత. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కిన ఈ సినిమాని విక్రమ్ భట్ డైరెక్ట్​ చేశాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహాం, బిపాసా బసు నటించారు. రతన్ టాటా ఈ సినిమాని జతిన్ కుమార్‌‌‌‌తో కలిసి ప్రొడ్యూస్​ చేశారు. ఇది 1996లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఫియర్’ ఆధారంగా తెరకెక్కింది. దీన్ని టాటా బీఎస్​ఎస్​ బ్యానర్‌‌‌‌పై నిర్మించారు. కానీ.. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా కోసం 9.50 కోట్లు ఖర్చు చేస్తే.. 7.96 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఇదే రతన్ టాటా నిర్మించిన ఏకైక సినిమా. దీని తర్వాత ఆయన మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు. 

ట్రస్ట్స్​ చైర్మన్​గా.. 

టాటా గ్రూప్​ని1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఇది స్టీల్, ఆటోమొబైల్స్, ఐటీ, టెలికమ్యూనికేషన్స్‌‌‌‌తో సహా ఎన్నో  రంగాల్లో తన మార్క్​ని క్రియేట్​ చేసింది. 30కి పైగా కంపెనీలు 100 కంటే ఎక్కువ దేశాల్లో  పనిచేస్తున్నాయి. అన్ని టాటా సంస్థలకు ‘టాటా సన్స్’ హోల్డింగ్, ఇన్వెస్టింగ్​ సంస్థగా ఉంది. టాటా సన్స్​లో 66 శాతం షేర్లు టాటా ఫ్యామిలీకి చెందిన టాటా ట్రస్ట్స్​​ ఆధీనంలో ఉన్నాయి. టాటా ట్రస్ట్స్​కి వచ్చే ఆదాయం నుంచి పెద్ద మొత్తాన్ని విద్య, ఆరోగ్య సంరక్షణ, కళలు, సంస్కృతి, జీవనోపాధి కల్పన లాంటి వాటి కోసం వాడుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్​కు నాయకత్వం వహించిన రతన్​ టాటా 2012లో టాటా సన్స్​ ఛైర్మన్‌‌‌‌ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచి టాటా ట్రస్ట్స్​కి ఛైర్మన్​గా ఉన్నారు. అయినప్పటికీ కంపెనీ బాగోగులు చూసుకున్నారు. గ్రూప్‌‌‌‌తో అతని అనుబంధం కొనసాగింది. 

వాస్తవానికి టాటా గ్రూప్​లో టాటా ట్రస్ట్స్‌‌‌‌ ఛైర్మన్‌‌‌‌ పదవే పవర్​ఫుల్​. ప్రస్తుతం చంద్రశేఖరన్‌‌‌‌ టాటాసన్స్‌‌‌‌కు ఛైర్మన్‌‌‌‌గా ఉన్నారు. ఆయన గతంలో టీసీఎస్‌‌‌‌లో పనిచేశారు. ఒకప్పుడు టాటా ట్రస్ట్స్, టాటా సన్స్​కి ఒకే ఛైర్మన్​ ఉండేవాడు. కానీ.. రతన్‌‌‌‌ టాటా రెండింటికీ ఇద్దరు ఛైర్మన్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. 

ట్రస్ట్స్‌‌‌‌ ఛైర్మన్‌‌‌‌గా నోయల్‌‌‌‌ 

రతన్​ టాటా చనిపోయిన తర్వాత టాటా ట్రస్ట్స్‌‌‌‌ ఛైర్మన్‌‌‌‌గా నోయల్‌‌‌‌ టాటా నియామకం జరిగింది. రతన్​ టాటా వారసుడిగా నోయల్‌‌‌‌ టాటాను ఎంపిక చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. రతన్‌‌‌‌ టాటా సవతి తల్లి సిమోన్‌‌‌‌ టాటా కొడుకు నోయల్​. ఆయన ఇప్పటికే టాటా గ్రూపులోని కొన్ని కంపెనీల్లో పనిచేశాడు. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్‌‌‌‌ కంపెనీలకు ఛైర్మన్‌‌‌‌గా ఉన్నాడు. టాటా సన్స్‌‌‌‌లో టాటా ట్రస్ట్స్‌‌‌‌కే ఎక్కువ వాటా ఉండడంతో టస్ట్ర్స్‌‌‌‌ ఛైర్మన్​కు గ్రూపు కంపెనీల విషయంలో ఏ కీలక నిర్ణయమైనా అతనే తీసుకుంటారు. 

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 

2023–24 ఆర్థిక సంవత్సరానికి టాటా గ్రూప్ మొత్తం ఆదాయం 13.86 లక్షల కోట్ల రూపాయలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద కంట్రిబ్యూటర్లలో ఇది ప్రధానమైనది. కోట్ల మంది ఇండియన్లు రోజులో ఒక్కసారైనా టాటా ప్రొడక్ట్స్​ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాడుతున్నారు. టాటా కంపెనీల వల్ల దాదాపు పది లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. టీ పౌడర్​ నుంచి ఉప్పు, పప్పుల వరకు.. స్టీల్​ నుంచి లగ్జరీ కార్ల వరకు ఎన్నో ప్రొడక్ట్స్​ని తయారుచేస్తోంది కంపెనీ. 

రతన్ టాటా చనిపోవడం టాటా గ్రూప్​కే కాదు ఎంతోమంది భారతీయులకు తీరని లోటు. షాప్ ఫ్లోర్ నుండి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బిజినెస్​ గ్రూప్​కి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన రతన్​ టాటా ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. 

ఉద్యోగుల్ని తీసేస్తే ఎలా?

కొవిడ్​ ప్యాండెమిక్​ అప్పుడు ఆ పరిస్థితిని సాకుగా చూపి చాలావరకు కంపెనీలు ఉద్యోగులను తీసేశాయి. దాని గురించి అప్పట్లో ఆయన ఒక వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఉద్యోగాలు తీయడం అనేది కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని చేయడంలేదు. నిజానికి ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తే కంపెనీల సమస్యలు తీరతాయా? ఉద్యోగులను తొలగించకుండా సరిగా ఆలోచించి అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటే ఈ కష్టం నుంచి బయటపడొచ్చు’’ అన్నారు. కొవిడ్​తో పోరాడేందుకు ఆయన 500 కోట్ల రూపాయల ఫండ్స్​ ఇచ్చారు.

పైలట్​​

రతన్​ టాటా సమర్థవంతమైన​ పైలట్​. ఆయనకు పైలట్​ లైసెన్స్​ ఉంది. 2007లో జరిగిన ఇండియన్​ ఎయిర్​ రేస్​లో ఫైటింగ్​ ఫాల్కన్​ అని పిలిచే ఎఫ్​–16ను నడిపారు. దాన్ని నడిపిన తొలి భారతీయుడు ఆయన. బోయింగ్​ ఎఫ్​–18 సూపర్​ హోర్నెట్​ ఫైటర్​ జెట్​ ఆయనకున్న ఫ్లయిట్స్​లో ఒకటి. ప్రపంచంలో బెస్ట్ సెల్లింగ్​ ఫైటర్​ జెట్​ ఇది. సూపర్​ హోర్నెట్​ను ఇప్పుడు బోయింగ్ డెవలప్​ చేస్తోంది.

కెరీర్​లో కంపెనీలు, సంస్థలు

టాటా కంపెనీల్లో టాటా మోటార్స్​, టాటా స్టీల్​, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్​, టాటా గ్లోబల్​ బెవరేజెస్, టాటా కెమికల్స్​​ అన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయి. టాటా కంపెనీకి ఛైర్మన్​గా ఉన్న రతన్​ టాటా టాటా డొకొమొ, టాటా హౌసింగ్​ డెవలప్​మెంట్​ కంపెనీ, టాటా టెలీ సర్వీసెస్​ వంటి సంస్థల వ్యవస్థాపకులు కూడా. వీటితో పాటు ఇండియన్​ హోటల్స్​, టాటా టెలీ సర్వీసెస్​ వంటి  హాస్పిటాలిటీ, టెలికమ్యూనికేషన్​ సర్వీసెస్​ కూడా ఉన్నాయి. ఇండియాలో, విదేశాల్లో ఉన్న ఎన్నో కంపెనీలు, సంస్థల్లో రతన్​ అసోసియేట్​ అయ్యారు.