రతన్​ జీ..ఇక సెలవు..ముంబైలో ముగిసిన టాటా అంత్యక్రియలు

  • అధికారిక లాంఛనాలతో నిర్వహించిన మహారాష్ట్ర ప్రభుత్వం
  • హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం షిండే  
  • తరలివచ్చిన వేలాది మంది జనం, వివిధ రంగాల ప్రముఖులు

ముంబై : భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86)కు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలను గురువారం ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. పార్సీ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ, విద్యుత్ దహనవాటికలో దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్ షా హాజరై రతన్ టాటాకు నివాళులర్పించారు.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరై నివాళులు అర్పించారు. రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా, ఇతర కుటుంబ సభ్యులు, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తో పాటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులు అంత్యక్రియలకు హాజరయ్యారు. రతన్ టాటా మృతితో మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. 

ఎన్సీపీఏ నుంచి అంతిమయాత్ర.. 

రతన్ టాటా పార్థివదేహాన్ని గురువారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి నుంచి కొలాబాలోని ఆయన ఇంటికి తరలించారు. అనంతరం ఉదయం సౌత్ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)కు తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచారు. రతన్ టాటాను చివరిసారి చూసేందుకు జనం అక్కడికి పోటెత్తారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు క్యూ కట్టారు.

పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు మొదలు సాధారణ జనం వరకు వేలాది మంది టాటాకు వీడ్కోలు చెప్పేందుకు తరలివచ్చారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎన్సీపీఏ నుంచి వర్లీలోని శ్మశానవాటిక వరకు 10 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది.  దారివెంట వేలాది మంది జనం వీడ్కోలు పలికారు. 

తరలివచ్చిన ప్రముఖులు..  

రతన్ టాటాకు నివాళులు అర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. ఇంటి దగ్గర కొందరు, ఎన్సీపీఏ వద్ద మరికొందరు, వర్లీ శ్మశానవాటికలో ఇంకొందరు ప్రముఖులు రతన్ టాటా పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ప్రతిపక్ష నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఎన్ సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ లీడర్ సుశీల్ కుమార్ షిండే, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, యాక్టర్ అమీర్ ఖాన్ తదితరులు నివాళులు అర్పించారు.   కాగా, రతన్ టాటాకు  భారతరత్న అవార్డు ప్రకటించాలని  కేంద్రాన్ని కోరుతూ గురువారం మహారాష్ట్ర కేబినెట్  తీర్మానాన్ని ఆమోదించింది.  

పెంపుడు శునకం ‘గోవా’ నివాళి

రతన్‌‌ టాటాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. గురువారం నిర్వహించిన ఆయన అంత్యక్రియల్లో టాటా పెంపుడు శునకం ‘గోవా’ కూడా నివాళులర్పించింది. రతన్‌‌ టాటాకు ఎంతో ఇష్టమైన ఈ కుక్కను ఆయన పార్థివదేహం వద్దకు తీసుకెళ్లారు. కాగా, ఈ కుక్కకు గోవా అని పేరు పెట్టడం వెనుక ఓ స్టోరీ ఉంది. ఒకసారి రతన్‌‌ టాటా గోవాకు వెళ్లినప్పుడు వీధిలో తిరిగే కుక్కకు ఆయన ఫుడ్ పెట్టారు.

ఆ తర్వాత ఆయన వెనకాలే ఆ కుక్క ఫాలో అయింది. దీంతో ఈ కుక్కను దత్తత తీసుకొని, గోవా నుంచి ముంబైకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ వీధి కుక్కకు ‘గోవా’అని పేరు పెట్టారు. ముంబైలోని బాంబే హౌస్‌‌ వద్ద నుంచి తీసుకొచ్చిన ఇతర వీధి కుక్కలతోపాటు గోవాను సిబ్బంది జాగ్రత్తగా చూసుకుంటున్నారు.  

దేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పారిశ్రామికవేత్త రతన్  టాటాజీ మరణంతో దేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. తన సంస్థలను వృద్ధిచేసి దేశాన్ని కూడా టాటాజీ ప్రగతి పథంలో నడిపారు. జాతి నిర్మాణానికి పాటుపడ్డారు. నీతి నియమాలకు కట్టుబడి జీవించారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. రతన్ జీ సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివి. ఆయన మృతికి నా ప్రగాఢ నివాళులు.

మెరుగైన సమాజం కోసం నిబద్ధతతో పనిచేశారు :  మోదీ

రతన్  టాటాజీ విజన్  ఉన్న బిజినెస్  లీడర్  మాత్రమే కాదు. ఆయన ఓ అసాధారణ మనిషి. ఎంతో దయగలవారు. దేశంలోని అత్యంత పాత కంపెనీల్లో ఒకటైన టాటా గ్రూప్ కు సుస్థిర నాయకత్వాన్ని అందిస్తూ ఆ సంస్థలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. దేశ నిర్మాణంలోనూ ఆయనది ప్రత్యేక పాత్ర. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఉంటూనే   దాతృత్వంతో ఎంతో మందికి చేరువయ్యారు.  మెరుగైన సమాజం కోసం నిబద్ధతతో పనిచేశారు.

నిజాలు నిర్భయంగా మాట్లాడారు : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

భారతీయ పారిశ్రామిక రంగంలో రతన్ టాటాజీ ఒక స్టాల్ వార్ట్. అధికారంలో ఉన్నవారికి ఆయన నిర్భయంగా నిజాలు చెప్పారు. బిజినెస్  టైకూన్  కన్నా అంతకుమించిన గొప్ప వ్యక్తి.  ఆయన మరణ వార్త విని  షాక్  అయ్యాను.  టాటాజీ ఆత్మకు శాంతి చేకూరాలి.