మూసీ ప్రక్షాళనకు గత ప్రభుత్వం వెయ్యి కోట్లు లోన్

  • అధికారం పోగానే ఇప్పుడు వద్దని గగ్గోలు పెడుతున్నరు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • పదేండ్ల విధ్వంసాన్ని సెట్ చేస్తున్నాం
  • అర్బన్ ఇన్ ఫ్రా సమిట్​లో  పాల్గొన్న మంత్రి

హైదరాబాద్, వెలుగు : మూసీని ప్రక్షాళన చేస్తామని జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకుందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ​రెడ్డి తెలిపారు. అధికారం పోగానే ఇప్పుడు మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని ఆయన ఫైర్​అయ్యారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రాజకీయాలు తగదని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.  

రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే రాజకీయాలతో ప్రజలకే నష్టం జరుగుతుందన్నారు. శుక్రవారం అసోచాం ఆధ్వర్యంలో హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరిగిన “అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2024” కు మంత్రి కోమటిరెడ్డి  వెంకట్​రెడ్డి అటెండ్ అయి మాట్లాడారు. స్థిరమైన మౌలిక వసతుల నిర్మాణం, రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. గత పదేండ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్బన్ కల్చర్ కు అనుగుణంగా రాష్ట్రంలో కూడా పట్టణీకరణ జరగవలసిన ఆవశ్యకత ఉందని మంత్రి తెలిపారు. అందుకోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు, అభివృద్ధికి బలమైన పునాదులు వేయడంతో పాటు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నదని ఆయన వివరించారు. 

హైదరాబాద్ దశను మారుస్తున్నం

హైదరాబాద్ దశ దిశను మార్చేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అందులో భాగంగానే రోడ్లు, ఆర్ఓబీలు, ఆర్ యూబీలు, కొత్త లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. అర్బన్ ఏరియాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ సవాల్​తో కూడుకున్నదని, అందు కోసం ఎస్టీపీలను నిర్మించి మెరుగైన మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలో దాదాపు 40% జనాభా నివసిస్తున్నదని.. ఇది 2028 నాటికి 50% దాటే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్​లో పట్టణ విస్తరణ, వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 

దేశంలో అపరిమితమైన ఫ్లోర్ స్పేస్ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. అందుకు అనుగుణంగా అగ్ని మాపక వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫీషీయంట్, ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) వంటి ప్రణాళికలతో 19 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నారని తెలిపారు. 

హైదరాబాద్​ను ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన సిటీగా మార్చడానికి ప్రణాళికలతో ముందుకెళ్తు న్నామని తెలిపారు. యువతను స్కిల్డ్ మ్యాన్ పవర్​గా మార్చేందుకు స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సుల్ జనరల్ (చీఫ్ పొలిటికల్ & ఎకానమిక్ సెక్షన్), హైదరాబాద్ ఫ్రాంక్ పి టల్లూటో, ఫోనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేశ్ చుక్కపల్లి, అలార్డ్ వర్సిటీ వీసీ పూనమ్ కశ్యప్, రాంబాబు బూరుగు తదితరులు పాల్గొన్నారు.