రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా?

  • ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి వైపే మొగ్గు చూపే చాన్స్​
  • జెన్​కో ప్లాంట్​ మూసేసిన నేపథ్యంలో తమకే ఇవ్వాలంటున్న 26 సంఘాల లీడర్లు 
  • జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ రిజ్వీకి వినతిపత్రం 
  • సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలో1971లో విద్యుత్​ఉత్పత్తి ప్రారంభించి 52 ఏండ్లు సేవలందించిన జెన్​కోకు చెందిన బి -థర్మల్ ​పవర్ ​ప్లాంట్​ను సర్కార్​ఇటీవల మూసేసింది. దాని స్థానంలో 800 మెగావాట్ల సూపర్ ​క్రిటికల్ ​పవర్ ​ప్లాంట్​ను నెలకొల్పాలనే డిమాండ్​పెరిగిన నేపథ్యంలో తెలంగాణ  సర్కార్ ​కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే జెన్​కోతో కాకుండా బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్​ ఉత్పత్తి రంగంలో దూసుకుపోతున్న సింగరేణి ఆధ్వర్యంలోనే ఆ పవర్​ప్లాంట్​ను నెలకొల్పడానికే సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో జెన్​కో కు చెందిన 26 ఉద్యోగ సంఘాల లీడర్లు తమ సంస్థ ఆధ్వర్యంలోనే పవర్​ప్లాంట్​ నెలకొల్పాలని డిమాండ్​ చేస్తున్నారు.  

2013లోనే కొత్త ప్లాంట్​ ఏర్పాటుకు నిర్ణయం

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సహజ వనరులైన బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండింటితో పాటు రైల్వే కనెక్టివిటీ, మానవ వనరుల లభ్యత కూడా ఉంది. ఈ నేపథ్యంలో పాత బి థర్మల్​విద్యుత్​ప్లాంట్​ను మూసివేసి దాని స్థానంలో  కొత్తగా 660 మెగావాట్లతో రెండు యూనిట్లు (1320 మెగావాట్లు) కలిగిన ప్లాంట్​ను నెలకొల్పాలనే నిర్ణయం 2013లోనే చేశారు. కానీ ఆ టైంలో తెలంగాణ ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో ఆనాటి ప్రభుత్వం సైలెంట్ ​అయింది. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్​ రామగుండంలో జెన్​కో ప్లాంట్​ విస్తరిస్తామని హామీ ఇచ్చినా అధికారంలో ఉన్న పదేండ్లూ పట్టించుకోలేదు.  

కాంగ్రెస్​ప్రభుత్వంలో కదలిక

ఏడు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. దీంతో రామగుండం బి- థర్మల్​ ప్లాంట్​ఆవరణలో కొత్తగా 800 మెగావాట్ల సూపర్ ​క్రిటికల్ ​ప్లాంట్​నెలకొల్పాలని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​పట్టుబట్టడంతో సుముఖత వ్యక్తం చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్త ప్లాంట్​కు అవసరమైన భూమి, దాని చుట్టుపక్కల భూముల వివరాలతో కూడిన నివేదికను రామగుండం రెవెన్యూ ఆఫీసర్లు ప్రభుత్వానికి సమర్పించారు. ఇక్కడ 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 550 ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉండడమే కాకుండా సింగరేణి నుంచి బొగ్గు , ఎల్లంపల్లి నుంచి నీరు తీసుకునే అవకాశం ఉంటుంది. 

నిర్వహణ బాధ్యతలు సింగరేణికా? జెన్​కో కా?

రామగుండంలోని పాత బి- థర్మల్​పవర్​ ప్లాంట్​స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల పవర్ ​ప్లాంట్ ​నెలకొల్పడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వం ప్రస్తుతం కోట్ల రూపాయలు పెట్టి ప్లాంట్​ నెలకొల్పే అవకాశం లేదు. జెన్​కోతో పోలిస్తే సింగరేణి ప్లాంట్లలో విద్యుత్​ ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండంతో సర్కారు అటువైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బొగ్గు, విద్యుత్​ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తూ వ్యాపార విస్తరణతో ముందుకు దూసుకుపోతున్న సింగరేణి  అయితేనే బెటరని ప్రభుత్వం ఆలోచిస్తున్న్టు సమాచారం.

కానీ, ఈ ప్రతిపాదనను జెన్​కోలోని యూనియన్లు అంగీకరించట్లేదు.  సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ​నెలకొల్పితే తమ ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని 26 ఎంప్లాయీస్​యూనియన్లకు చెందిన ప్రతినిధులు ఇటీవల జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ రిజ్వీకి వినతిపత్రం ఇచ్చారు. ప్లాంట్ ​నిర్వహణ బాధ్యతలను సింగరేణికి అప్పగిస్తే ఉద్యమం తప్పదని జేఏసీ లీడర్లు హెచ్చరిస్తున్నారు. ఈ  క్రమంలో రామగుండం విద్యుత్​ ప్లాంట్​ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఎవరికి అప్పగిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.  

కాలం చెల్లడంతో ప్లాంట్​ మూసివేత

ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి 1965 జులై 19న రామగుండంలో 62.5 మెగావాట్ల బి-థర్మల్​ పవర్ ​ప్లాంట్ ​నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆమెరికా టెక్నాలజీతో నెలకొల్పిన ఈ ప్లాంట్​లో 1971 అక్టోబర్​లో విద్యుత్ ​ఉత్పత్తి ప్రారంభించగా, జీవిత కాలం 25 ఏండ్లుగా నిర్ణయించారు. దీని ప్రకారం1996లోనే ఈ ప్లాంట్​ మూసివేయాల్సి ఉన్నా బాయిలర్స్, టర్బైన్, మిల్స్, టాన్స్​ఫార్మర్​ ఇతర యంత్రాలన్నీ మంచిగా పనిచేయడంతో ప్లాంట్​ గడువు ముగిసినా చాలా కాలం పాటు నడిపించారు.

నిర్ణయించిన దానికన్నా ఎక్కువ సంవత్సరాలు విద్యుత్​ ఉత్పత్తి చేస్తుండడంతో రోజూ సాంకేతిక సమస్యలు తలెత్తేవి. అంతేగాకుండా యంత్రాల విడిభాగాలు చెడిపోతే దొరక్కపోవడంతో విద్యుత్ ​ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది. యంత్రాలు తిరిగి పనిచేసేలా చెయ్యడానికి అయ్యే ఖర్చు ఎక్కువ కావడంతో ఆదాయం కన్నా వ్యయమే అధికమవుతున్నదని ప్రభుత్వం భావించింది. అలాగే పవర్ ​పర్చేజ్ ​అగ్రిమెంట్ ​(పీపీఏ) గడువు కూడా ముగియడంతో 2024 జూన్​ 4 నుంచి విద్యుత్ ​ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు.

సింగరేణికి ఇస్తే...మేం సిద్ధం 

రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్​ప్లాంట్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగిస్తే తప్పకుండా స్వీకరిస్తాం. ఇప్పటికే సింగరేణి ద్వారా జైపూర్​లో 1600 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ రన్​ చేస్తున్నాం. త్వరలో ఇక్కడే మరో 800 మెగావాట్ల యూనిట్​ ప్రారంభిస్తాం. విద్యుత్ ​ఉత్పత్తిలో అనుభవం దృష్ట్యా రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల  ప్లాంట్​ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహిస్తాం.  

- ఎన్.బలరామ్​, సింగరేణి సీఎండీ

ప్లాంట్​ ఏర్పాటే ముఖ్యం...

రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ ఏర్పాటు కావడమే మాకు కావాల్సింది. ఇందుకోసం మంత్రి శ్రీధర్​బాబుతో పాటు పార్లమెంట్​ పరిధిలోని మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల సహకారంతో గట్టి ప్రయత్నం చేస్తున్నా. ప్లాంట్​ఏర్పాటు విషయం సింగరేణి ఆధ్వర్యంలోనా, లేక జెన్​కో ఆధ్వర్యంలోనా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. ప్లాంట్​ఏర్పడితే చాలా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు రామగుండం పట్టణానికి పూర్వ వైభవం ఏర్పడుతుంది. 

-ఎంఎస్​ రాజ్​ఠాకూర్,రామగుండం ఎమ్మెల్యే