పైన ఉల్లిగడ్డ బస్తాలు...కింద నకిలీ పత్తి విత్తనాలు

  • రూ.16.50 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం
  • ఇద్దరిని అరెస్ట్​ చేసిన రామగుండం టాస్క్​ఫోర్స్​పోలీసులు 

గోదావరిఖని, వెలుగు :  రామగుండం పోలీస్​కమిషనరేట్​టాస్క్​ఫోర్స్​ పోలీసులు మంగళవారం నకిలీ బీటీ–-3 రకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్​ చేసి రూ.16.50 లక్షల విలువైన 5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, రూ.1.80 లక్షల నగదు, మూడు సెల్​ఫోన్లు, ఓ వెహికిల్​స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ ​ఎం.శ్రీనివాస్​ వివరాలు వెల్లడించారు. 

కర్నాటక నుంచి విత్తనాలను కొని మహారాష్ట్ర నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత (బీటీ3) నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో సీపీ టాస్క్ ఫోర్స్ ఇన్​స్పెక్టర్​సంజయ్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. మంచిర్యాల జోన్ లోని చెన్నూర్ పీఎస్ ​పరిధిలోని బతుకమ్మ వాగు వద్ద ఓ వ్యాన్​ను ఆపి తనిఖీ చేయగా అందులో పైన ఉల్లిగడ్డ బస్తాలుండగా కింద 5.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను గుర్తించారు. వీటి విలువ రూ.16.50 లక్షలుగా తేల్చారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూరుకు చెందిన డ్రైవర్​ సొల్లు పెద్దయ్య, క్లీనర్ ​హరి కుమార్​ను విచారించగా గుంటూరుకు చెందిన సుబ్బారావు వద్ద విత్తనాలను కొని రైతులకు ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకెళుతున్నట్టు అంగీకరించారు. 

విత్తనాలు పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ ఫోర్స్ అధికారులకు, సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు. మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి. రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు టౌన్ ఇన్​స్పెక్టర్​రవీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్​స్పెక్టర్​ సంజయ్, చెన్నూర్​ ఏవో గ్లాడ్సన్ పాల్గొన్నారు.