పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి.

  • ఉమ్మడి జిల్లాలో పోలీసు అమర వీరుల దినోత్సవం 
  • నివాళలర్పించిన కలెక్టర్లు, పోలీసు అధికారులు

మంచిర్యాల   వెలుగు : పోలీస్​ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి త్యాగాలను స్మరించుకోవాలని రామగుండం పోలీస్​ కమిషనర్​ ఎం.శ్రీనివాస్​ అన్నారు. పోలీస్​ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్​ కుమార్​ దీపక్​, పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీ డాక్టర్​ చేతనతో కలిసి పోలీస్​ అమరువీరుల స్థూపం వద్ద  నివాళులర్పించారు. అలాగే పోలీసు అమరుల కుటుంబాలను పరామర్శించి వారికి జ్ఞాపికలను అందజేశారు.   ఈ కార్యక్రమంలో అడిషనల్​ డీసీపీ సి.రాజు, ఏసీపీలు, సిఐలు, పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు. 

ఆదిలాబాద్ :   పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  సాయుధ పోలీసులు అమరవీరులకు  గౌరవ వందనాన్ని సమర్పించి,  మౌనం  పాటించారు.  జిల్లా జడ్జి ప్రభాకర్ రావు,   ఎస్పీ గౌస్​ఆలం, రెండో బెటాలియన్ కమాండెంట్ నితికా పంత్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ ,  ఇతర శాఖల , పోలీసు ఉన్నతాధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్చాలతో స్థూపం వద్ద నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా  దేశ వ్యాప్తంగా అమలరులైన 214 మంది పోలీసులను  స్మరించుకున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  అనంతరం అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా పోలీసు   అధికారులు   స్థానిక కలెక్టర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ సురేందర్ రావు,డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, డి సురేందర్ రెడ్డి, పాల్గొన్నారు.
 
కోల్​బెల్ట్​ :
  అమరవీరుల త్యాగాలు మరువలేనివని , వారి పోరాటపటిమను కొనసాగించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​ అన్నారు. సోమవారం మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో  ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు.    పోలీసు అమరవీరుల స్థూపం వద్ద బెల్లంపల్లి డివిజన్ సీఐలు, ఎస్సైలు,  పోలీసులు సిబ్బందితో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోమవారం  మందమర్రి పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు ను  బెల్లంపల్లి ఏఈసీపీ రవికుమార్ ప్రారంభించారు.  

ఆసిఫాబాద్ : ప్రజల   భద్రతా కోసం పోలీసులు పాటుపడడం వల్లే  ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవితం గడపుతున్నామని  కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.  సోమవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి గెస్ట్ గా ఎస్పీ డీవీ శ్రీనివాస రావుతో కలిసి గాహాజరయ్యారు.  పోలీసుల  గౌరవ వందనం  స్వీకరించి,  అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో  కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి,  నివాళులు అర్పించారు.