రాఖీ పండుగకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా .....

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి  లేదా రక్షా బంధన్ పేర్లతో పిలుస్తారు. రాఖీ లేదా రక్షా పండుగను మన దేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశానికే పరిమితమైన ఈ సంప్రదాయం తర్వాత దేశమంతటా వ్యాపించింది. ఆ రోజు( ఆగస్లు 19)  అన్న లేదా తమ్ముడు.... అన్నదమ్ముల వరసయ్యే వాళ్లందరికీ అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. . .

రాఖీ పౌర్ణమికి ఎన్ని పేర్లో..

శ్రావణ పౌర్ణమికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లు ఉన్నాయి. మన దగ్గర రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోనూ రక్షాబంధన్ గా పిలిచే ఈ పండుగను సావనీ సలోవా అని కూడా అంటారు. దక్షిణాదిలో నారికేళ పౌర్ణమి, అవనీ అవిత్తమ అనే పేర్లతో.... గుజరాత్​లో పవిత్రోపనా  అనే పేరుతో పిలుస్తారు. మహారాష్ట్రలో దీన్ని సరాళి పూర్ణిమగా జరుపుకుంటారు. మహారాష్ట్ర కోస్తా తీరంలో కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవుని ఆరాధ్యదైవంగా కొలుస్తారు. రాఖీ పండుగ సందర్భంగా వీళ్లు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరి వరుణదేవుని పూజిస్తారు. సంపదలకు ప్రతీక అయిన సింధూరాన్ని ఒకరి నుదుటి పై మరొకరు వద్దుతారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఘూలాద్ పూర్ణిమ పేరుతో రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు.

బంధం నిలిపే  రాఖీ బంధన్

రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్ష అంటే రక్షించడం. బంధన్ అంటే కట్టడం. ఒక ఇంటి ఆడపడుచు తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగూ విజయం వైపే సాగాలని, తన సోదరుడు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ.. నుదుట కుంకుమ పెట్టి, సన్నటి దారం, ఒక తోరణంతో తయారు చేసిన రాఖీని వాళ్ల చేతికి కడుతుంది. తర్వాత నోటిని తీపి చేసి హారతి పడుతుంది. అప్పుడు. సోదరుడు తన సోదరికి ఏకష్టమొచ్చినా. కాపాడతానని వాగ్దానం చేస్తారు. ఆపైన తనకు తోచిన కానుకలను అందిస్తాడు. ఈ పండుగకు కులమతాల పట్టింపు లేదు. పేదాగొప్పా తేడా అసలే ఉండదు.

భర్తకూ కట్టేవాళ్లు..

పురాణాల్లో దేవుళ్లు, రాక్షసుల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉండేది. ఓసారి దేవతల రాజు ఇంద్రుడు యుద్ధంలో. ఓడిపోతాడు దాంతో ఇంక రాక్షసులతో యుద్ధంలో గెలవలేనని అనుకుని... ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొని. అమరావతిలో తలదాచుకుంటాడు.  ఇంద్రుడి నిస్సహాయతను గమనించిన ఆయన భార్య శచీ దేవి. తన భర్తకు తిరిగి ఎలాగైనా శక్తినివ్వాలని ఆలోచిస్తుంటుంది.. ఇంతలో రాక్షసరాజు అమరావతిని కూడా ఆక్రమించుకోబోతున్నాడని.. అమరావతి మీదకి యుద్ధానికి రాబోతున్నాడని సమాచారం వస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిము అవడంతోపార్వతీ పరమేశ్వరులును... లక్ష్మీనారాయణులను  శచీ దేవి పూజిస్తుంది . తర్వాత పూజించిన రక్షను ఇంద్రుడి చేతికి కడుతుంది. అప్పుడు తన శక్తిని తిరిగి తెచ్చుకున్న ఇంద్రుడు రాక్షసరాజును ఓడించి తిరిగి మూడులోకాలను గెలుచుకుంటారు. అప్పుడు శచీదేవి ప్రారంభించిన రక్షాబంధనోత్సవ తోరణం. తర్వాత కాలంలో రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారంగా వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పండుగను అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే  కాదు. భార్యాభర్తలు కూడా జరుపుకోవచ్చని పండితులు అంటున్నారు.

రాఖీ పౌర్ణమి అంటే... ఏముంది! ఇంట్లో ఉన్న అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టడమే కదా" అనుకుంటారు పెళ్లికాని అమ్మాయిలు. కానీ ఆ పండుగ విలువ అమ్మాయిలకైనా... అబ్బాయిలకైనా పెళ్లయ్యాక తెలుస్తుంది. చిన్నప్పట్నించి ఒక్కటిగా పెరిగిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు... పెళ్లిళ్లు కాగానే రెండు వేరువేరు కుటుంబాలుగా మారతారు. అలాంటప్పుడు తమ ప్రేమను వ్యక్తపరచడానికి, బంధాన్ని పెంచుకోవడానికి... ఏడాదంతా ఈ రాఖీ పౌర్ణమి కోసం ఎదురు చూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా ఆ రోజు మాత్రం ఒకచోట కలిసి మనసులోని సంతోషం, బాధను పంచుకుంటారు. ఈ పండుగకు అంత ప్రత్యేకత ఉంది.