మూడు నెలల్లో రాజీవ్ లింకు కెనాల్ పూర్తి చేశాం : భట్టి విక్రమార్క

  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • వైరాలో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన  
  • అభివృద్ధి చేసి పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటానని వెల్లడి 

ఖమ్మం/ వైరా, వెలుగు : తమ ప్రజా ప్రభుత్వం మూడు నెలల్లోనే రూ.75  కోట్లు ఖర్చు చేసి రాజీవ్ లింకు కెనాల్ ద్వారా ఈనెల 15 నుంచి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తుందని  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తక్కువ సమయంలోనే కెనాల్ ను పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15న వైరాకు రానున్నారని వెల్లడించారు.

శుక్రవారం వైరా నియోజకవర్గంలో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తాను పుట్టిన సొంతూరు స్నానాల లక్ష్మీపురంతో పాటు, వైరా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.

సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పేరిట రూ.8వేల కోట్లు ఖర్చుపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, 10 ఏండ్లలో ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రూ.2లక్షల రైతు రుణమాఫీని వైరా వేదికగా 15న అమలు చేయనున్నట్లు చెప్పారు. వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు

ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు నాయుడు సత్యం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జైపాల్ పాల్గొన్నారు. 

ఎక్కడెక్కడ... ఏ పనులకు శంకుస్థాపన..

  •     వైరాలో అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.26.87 కోట్లతో మంచినీటి సరఫరా పథకానికి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 
  •     మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పబ్లిక్ హెల్త్ డీఈ నవీన్ మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన డిజైన్ మ్యాప్ ను డిప్యూటీ సీఎం కు చూపించి వివరించారు. 
  •     ప్రభుత్వ జూనియర్ కళాశాలను భట్టి సందర్శించారు. శిథిలమైన భవనాలను పరిశీలించారు. 200 మంది వరకు విద్యార్థులున్న ఈ కళాశాలలో ల్యాబ్స్, సరిపోను క్లాస్ రూమ్స్ లేకపోవడంతో పాటు శిథిలమైన తరగతి గదుల్లో విద్యాబోధనకు ఇబ్బందిగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి నివేదించారు. కళాశాలలో నూతన తరగతి గదులు, ల్యాబ్స్ నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పంపాలని డీఐఈవో రవిబాబును  భట్టి ఆదేశించారు. 
  •     రూ.33 కోట్లతో వైరా రివర్ కెనాల్ ఆధునికీకరణతో పాటు  రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. 
  •     వైరా పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. 
  •     భట్టి తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం వెళ్లారు. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులను చెల్లించుకున్నారు. శివాలయం సమీపంలో రూ.65 లక్షలతో స్నానాల ఘాట్, రూ.4 కోట్ల 20 లక్షలతో చెక్ డ్యామ్ నిర్మాణం, రూ.7 కోట్ల 70 లక్షలతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, రూ.3.20 కోట్లతో దేవాలయం ప్రహరీ, కల్యాణ వేదిక, అభిషేక మండపం, ఐదు గదుల సత్రం, జీ ప్లస్ వన్ డార్మెటరీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించిన అనంతరం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 
  •     నాగపూర్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర అండర్ పాస్ నిర్మాణాల గురించి నేషనల్ హైవే అధికారులతో సమీక్షించారు. అన్నిచోట్ల రైతులకు సౌకర్యంగా ఉండేలా అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని సూచించారు.