సీఎం పర్యటనను సక్సెస్‌‌ చేయాలి : విప్​ ఆది శ్రీనివాస్‌‌ 

వేములవాడ, వెలుగు : ఈ నెల 20న సీఎం రేవంత్​ రెడ్డి వేములవాడ పర్యటనను సక్సెస్‌‌ చేయాలని ప్రభుత్వ విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్‌‌లో రాజన్న జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

గత సభలను మరిపించేలా వేములవాడ సభను విజయవంతం చేసేందుకు ప్రతికార్యకర్త కృషి చేయాలన్నారు. సమావేశంలో లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌ నాగుల సత్యనారాయణ గౌడ్​, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

సభా ఏర్పాట్లను పరిశీలించిన విప్​, కలెక్టర్​

సీఎం రేవంత్‌‌రెడ్డి ఈనెల 20న వేములవాడకు రానున్నారు. ఈమేరకు పట్టణంలో  ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 9.15 గంటలకు మొదలై, మధ్యాహ్నం 1.40 గంటల వరకు పర్యటన కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత రాజన్న దర్శనం అనంతరం ఆలయంలోని పలు అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ చేయనున్నారు. అక్కడి నుంచి వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో సభా ప్రాంగణం వద్ద పలు వర్చవల్‌‌ విధానంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. సోమవారం ప్రభుత్వ విప్‌‌, స్థానిక ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్‌‌, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై  అడిషనల్‌‌ కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్‌‌ అధికారులను ఆదేశించారు.