బాబోయ్ వర్షాలు పడుతున్నాయి.. పంటల సాగుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి ప్రతికూల, వాతావరణ పరిస్థితుల్లో వర్షాధార పంటలైన వరి,  మొక్కజొన్న, జొన్న, కంది, పత్తి, వేరుశనగ, సోయా చిక్కుడు కూరగాయల పంటల్లో కొన్ని జాగ్రత్తలు పాటించినైట్లెతే పంటలు నష్టపోకుండా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. .  .

 వర్షపు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల మొక్కల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోయే ఆస్కారం ఉంది. అంతేకాక చీడపీడలు, తెగుళ్లు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకోసం రైతాంగం తగిన జాగ్రత్తలు పాటించాలి.. లేదంటే పంటలకు తెగుళ్లు సోకి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు.

వరి:  వరి పంట వేసే నారుమడిలో ఎక్కువరోజులు నీరు నిల్వ ఉండకూడును.  వరి రకాల నారు...  నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాల్లో 50రోజుల వయస్సు ఉన్నముదురు నారు నాటాల్సివస్తే  ఆకు చివరలను తుంచివేసి కుదురుకు 5 నుంచి 6 మొక్కల చొప్పున నాటువేయాలి. ఇప్పటివరకు నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగం చేసుకొని పొలాలను దమ్ముచేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వల్ల సమయం,పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు.
నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక (120- నుంచి 125 రోజుల) వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.25 రోజుల వయస్సు ఉన్న మధ్యకాలిక, 21 రోజుల వయస్సు ఉన్న స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి.

వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15-నుంచి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయటం వల్ల గాలి వెలుతురూ బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు.అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లి కోడును నివారించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది.

పత్తి: ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకొని వర్షాధార పత్తి పంటలో మొదటి దఫా,  రెండవ దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20, 40 రోజుల దశలో అందించాలి. అధిక వర్షాల వల్ల పత్తిలో వడలు తెగులు ఆశించే వీలుంటుంది. దీని నివారణకు వడలు తెగులు సోకిన మొక్కల మొదళ్ళు తడిచేలా లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. అలాగే పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన మల్టీ- కె (13:0:45) లేదా 10 గ్రా. యూరియా చొప్పున లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు  పంటపై పిచికారి చేయాలి.

మొక్కజొన్న: అధిక వర్షాల వల్ల  మొక్కజొన్న పంట పసుపు రంగుకు మారుతుంది.  కావున నీటిని మురుగు కాలువల ద్వారా బయటికి తీసివేయాలి. ఇలా చేస్తే మొక్కజొన్న పంటను   దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకోవచ్చు. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు.  కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. ముందుగా వేసుకున్న వర్షాధార మొక్కజొన్న పంటలో ఆఖరి అంతర కృషి తరువాత గోడ్డుచాలు వేసుకున్నట్లయితే తేమ సంరక్షింపబడి పంటకు ఎక్కువ కాలం తేమ లభిస్తుంది. రెండవ దఫా 1/3 వంతు పైపాటు నత్రజని పైరు మోకాలి ఎత్తు దశలో నేలలో తేమ ఉన్నప్పుడు అందించాలి.

కంది:  అధిక వర్షాల వల్ల కంది పంటలో ఇనుప ధాతు లోపం వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు పొలంనుంచి మురుగు నీటిని తీసివేసి 2-5గ్రా. అన్నభేదితో పాటు 1గ్రా. నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు వర్షం తగ్గిన తర్వాత పిచికారి చేయాలి.

సోయాచిక్కుడు: వర్షాలు వచ్చే  వాతావరణ పరిస్థితులు ఉన్నా.. అధికంగా వర్షాలు పడుతున్నా.. మోతాదుకు మించి పొలంలో నీరు ఉన్నా... కంది  పంటలో వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ  తెగులును  గమనిస్తే నివారణకు 3 గ్రా.చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి.  అధిక వర్షాల వల్ల పంటలో అంతరకృషి చేయడం వీలుకాని చోట 250 మి.లీ. ఇమాజితాపిర్ 10% SL లేదా 40గ్రా. ఇమాజితాపిర్ + ఇమాజమాక్స్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి గడ్డి, వేడల్పాకు కలుపు జాతి మొక్కలను నివారించాలి.

వేరుశనగ: అధిక వర్షాల వల్ల వేరుశనగ పంటలో ఇనుప ధాతు లోపం వస్తుంది. దీని  నివారణకు పొలంనుంచి మురుగు నీటిని తీసివేసి 2- 5గ్రా. అన్నభేదితో పాటు 1గ్రా. నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు వర్షం తగ్గిన తర్వాత పిచికారి చేయాలి.

కూరగాయలు: అధిక వర్షాల వల్ల కూరగాయ నారుమడుల్లో నారుకుళ్ళు తెగులు రావడానికి అనుకూలం. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రా. చొప్పున కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. ముంపునకు గురైయ్యే ప్రాంతాల్లో ప్రతీ 25 మీటర్లకు ఊట కాలువలు ఏర్పాటు చేసుకొని తోటలో నీరు నిలువకుండా మురుగు నీటి కాలువల ద్వారా నీటిని తీసివేయాలి.