రోడ్లు, బ్రిడ్జిల రిపేర్లకు రూ.465 కోట్లు కావాలె!

  • వర్షాలు, వరదల నష్టం అంచనాను ప్రభుత్వానికి నివేదించిన అధికారులు
  • తాత్కాలిక రిపేర్లకు రూ.13 కోట్లు అవసరం 
  • పంట నష్టం రూ. 4 కోట్లకు పైనే

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలో వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టాన్ని అంచనా వేసిన అధికారులు నిధులు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా జిల్లాలో పంచాయతీ, ఆర్అండ్​బీ పరిధిలోని రోడ్లు, వంతెనలు దెబ్బతినగా వీటి శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిని కోట్లలో నష్టం వాటిల్లింది.

దీంతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ రాజ్ ఆర్అండ్​బీ రోడ్లుకొట్టుకపోవడం, గుంతలు పడటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ప్రతిపాదనలు సిద్ధం

జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల శాశ్వత రిపేర్ల కోసం దాదాపు రూ.465 కోట్లు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 
తాత్కాలిక రిపేర్లకే రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్లు అవసరం ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లాలో 130 కిలోమీటర్ల ఆర్అండ్​బీ రోడ్లు, 26 కల్వర్లులు, 54 లోలెవల్ వంతెనలు వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.90 లక్షలు అవసరమని అధికారులు నివేదిక రూపొందించారు.

దీంతో పాటు శాశ్వత పనులు చేపట్టేందుకు రూ.121 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అదే విధంగా పంచాయతీ రాజ్ శాఖ ఆధీనంలోని రోడ్లు, కల్వర్టులు మొత్తం 240 చోట్ల దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక పనుల కోసం రూ.12.5 కోట్లు కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

శాశ్వాతంగా వీటి పనులు చేపట్టేందుకు  రూ. 344 కోట్లు అవసరం ఉంటాయని ప్రభుత్వానికి నివేదక అందజేశారు. కలెక్టర్ రాజర్షి షా సైతం ఇటీవల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు విడుదల కాకపోవడంతో ఎటువంటి రిపేర్లు చేపట్టడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

పంటలకు రూ. 6 కోట్ల నష్టం

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు, వరదలతో పంట నష్టం తీవ్రంగా జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు పంట సర్వే చేస్తుండగా గురువారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 2 వేల ఎకరాల వరకు నష్టం జరిగినట్లు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా పత్తి పంట ఉండగా ఆ తర్వాత, సోయ, కంది పంటలు దెబ్బతిన్నాయి. ఎకరానికి దాదాపు రూ.20 వేలు చొప్పున నష్టపోయామని రైతులు చెబుతున్నారు.

వారి పెట్టుబడి ఖర్చులే రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే పంటనష్టపోయిన రైతులను ఆదుకుంటా మని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. పంట నష్టం వివరాలు తుది రిపోర్టు వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేయనున్నట్లు చెబుతున్నారు.

జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వలేదు. ప్రతిసారి పంటనష్టం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించి చేతులు దులుపుకునేవారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం

జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల రిపేర్ల కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. రూ.12.5 కోట్లు విడుదల చేయాలని కోరాం. శాశ్వత పరిష్కారానికి సైతం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
- శివరాం, పంచాయతీ రాజ్, ఈఈ