మానవ తప్పిదాల వల్లనే వర్షాలు, వరదలు

ఈ సారి వరదలు,  వర్షాలు మానవ తప్పిదాలను బయటపెడుతూ బహిర్గతం చేస్తున్నాయి. గత ఏడాది ఎంతో హంగామాతో  కొత్త పార్లమెంట్ భవనంలో  సింగోల్ స్థాపన కూడా చేశారు. పీఎం నరేంద్ర మోదీ ఒక్కరే అక్కడ కెమెరాలో  రాజు వెడలె అన్నట్లు కనిపించారు. వేలకోట్లు ఖర్చుచేసి నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో  ప్రస్తుతం పై కప్పు ఉరిసి నీళ్లతో నిండిపోయింది. ఒకవైపు నిర్మించిన ఎయిర్​పోర్టులు,  బ్రిడ్జిలు, భవనాలు నాణ్యతాలోపంతో కూలిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలోనే ఒక కోచింగ్ సెంటర్ లో  ముగ్గురు సివిల్స్​కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వర్షం నీటిలో  మునిగి ప్రాణాలు కోల్పోయారు. కులుమనాలిలో  మళ్ళీ వరదలు, డిజాస్టర్ లు జరుగుతున్నాయి.  ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ గురువారం వయనాడ్ వెళ్లి సందర్శించి, బాధితులను పరామర్శించారు. వారి దుఃఖం తమ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చావుకు మించిన దుఃఖం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  

మనిషి స్వార్థం, అవినీతి ఈ నేలను ఆక్రమణలకు గురిచేస్తున్నది.  తాను బతకడం కోసం ప్రకృతిపై దాడికి పాల్పడుతున్నాడు.  పర్యావరణ పరిరక్షణ నిబంధనలను పాటించడం లేదు. అడవిని, చెట్లను విచ్చలవిడిగా నరికి వేస్తుండటంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. మురికి కాలువలను సైతం ఆక్రమణదారులు వదిలిపెట్టడం లేదు.  ఆక్రమణకు నదులు, వాగులు వంకలనే పట్టింపు లేదు. నది ఒడ్డున బంగళాలు, ఇండ్లు నిర్మించుకుంటున్నారు. నదిని నిర్బంధించి గోడలు కడితే నదీప్రవాహం ఆగుతుందా? భారీ వర్షాలప్పుడు రోడ్ల మీదికి, ఇండ్ల మీదికి నీళ్లు వచ్చేస్తున్నాయి.  మనిషి తన అవసరాలకోసం పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తుండటంతో  వరదలు వస్తున్నాయి.  

 ప్రకృతితో శత్రుత్వం అవసరమా? 

ప్రకృతికి ఎదురీదడం మానవ మనుగడకే ప్రమాదం. దేశంలో గత పది ఏండ్లలో ఎన్నడూ లేనివిధంగా వరదల బీభత్సం అటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్,  కోల్​కతా లాంటి పెద్ద  నగరాలను కూడా వదలలేదు. అక్రమ కట్టడాలు  సిటీలకు ఒక శాపంగా మారాయి.----వరదల కారణంగా  కేరళలోని వయనాడ్​లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో 300 మందికి పైగానే మరణించారని అంటున్నారు.  ఒకసారి దేశంలోని పరిస్థితిని పరిశీలిస్తే గరిష్టంగా కొండచరియలు విరిగిపడే రాష్ట్రాలు మన దేశంలో 11 వరకు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, అస్సాం, మిజోరం, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లోని  పలు జిల్లాల్లో  కొండచరియలు విరిగిపడుతుంటాయి. భారతదేశంలో కొండచరియలు విరిగిపడడం వల్ల ప్రతి ఏడాది కనీసం వంద చదరపు కిలోమీటర్లలో  ఒక మరణం నమోదు అవుతున్నది. 1998 నుంచి 2022 వరకు మొత్తం దేశవ్యాప్తంగా147 జిల్లాల్లో 80,000 దాకా సంఘటనలు జరిగాయి. ఇందులో గత 25 ఏండ్లలో మిజోరంలో 12,385 సంఘటనలు జరుగగా, ఉత్తరాఖండ్ లో 11,219 సంఘటనలు జరిగాయి.
 
విధ్వంసం చేస్తున్నది మనుషులే

భారీ వర్షాలకు కొండచరియలు కూలి పడడం,  నదులు సైతం చీలిపోవడం, భారీగా అటవీప్రాంతం నరికివేత, స్వేచ్ఛగా  ప్రకృతి ఇచ్చిన అందాలవాగులు,  వంకలను  అడ్డుకుని మనిషి అవసరాల కోసం వాటిని డిస్టర్బ్ చేసి ఖనిజాల ద్వారా సంపాదన కోసం మొత్తం పర్యావరణంను దెబ్బతీసి, రోడ్ల కోసం, వంతెనల కోసం,  ప్రాజెక్ట్స్ కోసం,  గ్రైనైట్​ కోసం, కరెంట్ కోసం గుట్టలను విచ్చలవిడిగా చీల్చడం వల్ల  ప్రకృతి ప్రకోపం చూపుతున్నది. ఈ పరిస్థితి హిల్ ఏరియాలు ఉన్న  ప్రతిచోట మనకు కానవస్తున్నది. ఇది అభివృద్ధి పేరు మీద మనిషి  జరుపుతున్న విధ్వంసం పక్కాగా మానవ తప్పిదం.  భారీ వర్షాల సందర్భంగా  చాలా చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగడం, పొలాలు, పంటలు నాశనం కావడం, ఇండ్లలోకి, కాలనీల్లోకి నీరు రావడం, కట్టడాలు కూలి మనుషులు చనిపోవడం, మట్టిలో ఇరుక్కుపోయి, నీళ్లలో కొట్టుకు పోయి చావడం లాంటి సంఘటనలకు మొత్తం మానవ తప్పిదమే కారణం.
పర్యావరణ పరిరక్షణతోనే..
 
ప్రకృతి వైపరీత్యాలకు అడ్డుకట్ట

 ప్రతిసారి భారీగా మానవ నష్టం, వనరుల నష్టం, ఆస్తుల నష్టం జరగడం, కాస్తోకూస్తో ప్రభుత్వం పరిహారం, బీమా ఇవ్వడం, బాధితుల పరామర్శలు  ఓదార్పులు  షరా మాములు అయిపోయాయి.  ప్రభుత్వపరంగా పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషి ఏమీలేదు.  గనుల తవ్వకం పేరిట తవ్వకాలు,  గుట్టలను  చీల్చుతూ  రోడ్లు,  రైల్వే ట్రాకులు వేయడం మొదలవుతుంది. ఎవరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. -వయనాడ్ దుఃఖం ఇంతా అంతా కాదు.  వయనాడ్​ బాధితులు కోల్పోయిన కుటుంబాలను, నష్టాన్ని ఎవరు తీర్చగలరు. ఎంత మంది దుఃఖంలో పాలు పంచుకుంటారు. కనీసం కనిపించకుండా పోయిన వెయ్యి మంది గురించి పాలకులు  ఏమి చెప్పుతారు.   ఈనేపథ్యంలో  ఎవరికివారే పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి.

మానవ అవసరాల కోసం ప్రకృతి వినాశనం

ప్రధానంగా హిమాలయాలు, పశ్చిమ కనుమలలో  కొండచరియలు విరిగి పడడానికి వర్షపాతం ఒక్కటే కారణం కాదు. అక్కడ ప్రకృతి ఇచ్చిన అద్భుత వాతావరణాన్ని మనిషి తన అవసరాల కోసం నాశనం చేయడం కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు.  గతంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, రాజస్థాన్,  బిహార్,  మధ్యప్రదేశ్,  తమిళనాడులలో  ఎక్కువగా ప్రకృతి  ఉగ్రరూపందాల్చడం వల్ల వందల మంది ఊపిరి కోల్పోవడం జరిగింది.  పవర్ ప్రాజెక్టులు  కొట్టుకుపోయాయి.  ప్రమాదాలు సంభవించడానికి వాతావరణంలో సమతుల్యం పాటించకపోవడం కూడా ఒక ప్రధానకారణం అనకతప్పదు.  

- ఎండి మునీర్, సీనియర్ జర్నలిస్ట్​