హోరుజల్లు..!రోడ్లు, నీట మునిగిన లోలెవెల్​ వంతెనలు

  •     ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరదలు
  •     అప్రమత్తమైన అధికారులు, సహాయక చర్యలు ముమ్మరం 

వెలుగు నెట్​వర్క్ ​: ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని జలవనరులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులను పై నుంచి వరద ముంచెత్తుతుండడంతో పలుచోట్ల రహదారులు తెగిపోయి రాకపోకలకు ఇబ్బందులుగా మారాయి. బ్రిడ్జిలపై నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా వెళ్తుండడంతో అధికారులు అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద ఇండ్లలో చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ పెద్ద చెరువు కట్ట కోతకు గురవడంతో అధికారులు పరిశీలించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి కరకట్ట వరద ఉధృతికి తెగే ప్రమాదం ఉండడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన 20 మంది కూలీల సహకారంతో బొంగులను డ్రిల్లింగ్ విధానం ద్వారా సుమారు 3 మీటర్ల లోతుకు పాతి ఇసుక బస్తాలతో నింపారు. జంపన్నవాగుపై ఉన్న లో లెవెల్​ బ్రిడ్జిలు మునగడంతో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారుల ప్రజలకు సూచిస్తున్నారు.

కాగా, ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంటలో  సుమారు 20 ఇండ్లలో ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వరాలతో బాధ పడుతున్నారని సమాచారం. కూడలి ఒర్రె నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడం వల్ల వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో వరద నీరు గ్రామంలోకి చేరడంతో అధికారులు సహాయక రర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొమ్ముల వంచ శివారులోని బీమునిపాదం పర్యాటక ప్రాంతం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.   

ముసురుకున్నది..

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్నేరు, పాకల వాగులు, కొత్తగూడ మండలంలోని గాదె వాగు , ముస్మీ, కత్తెర్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆదివారం అత్యధికంగా కొత్తగూడలో 40.2 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, జిల్లా సాధారణ వర్షపాతం 20.1ఎం.ఎంగా నమోదు అయ్యింది. బయ్యారం పెద్ద చెరువు, కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి, కర్లాయి చెరువులు మత్తడి పోస్తున్నాయి. గూడురులోని భీముని పాదం, బయ్యారంలోని జలధార జలపాతం వద్దకు పర్యాటకుల తాకిడిని ఆఫీసర్లు నిషేదించారు. 

గ్రేటర్​ లో అప్రమత్తమైన అధికారులు

హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ పరిధిలో కొన్నిచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. గ్రేటర్ పరిధిలోని హనుమకొండ, వరంగల్ లో 18 చోట్ల మెయిన్ రోడ్లపై నీళ్లు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా చోట్లా ఏఈలు, వారికి సపోర్టింగ్ ఆఫీసర్లు, డీఆర్​ఎఫ్​ టీమ్​కు చెందిన మరో ఐదుగురికి బాధ్యతలు ఇచ్చారు. వరంగల్ నగర వ్యాప్తంగా వర్షాలు పడిన ప్రతిసారి ముంపునకు గురవుతున్న 37 కాలనీలను గుర్తించారు.  హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వరకు 5.5 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా శాయంపేట మండలంలో 9.2 సెం.మీ, అత్యల్పంగా ఐనవోలు మండలంలో 2.6 సెంమీల వర్షపాతం నమోదైంది.