రాలేరు.. పోలేరు.. ఇరుకు బ్రిడ్జి, రైల్వేగేట్​తో ఇబ్బందులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో లక్షకు పైగా జనాభా ఉంది.   వ్యక్తిగత పనులు, వ్యాపారాలు, చదువు కోసం వేలాది మంది జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తారు. రోజు రోజుకు విస్తరిస్తున్న టౌన్​ను రైల్వే లైన్​ రెండు గా విభజిస్తోంది. ఈ రైల్వే లైన్​కు ఇరువైపుల కాలనీలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు ఉన్నాయి. అప్పటి అవసరాల నిమిత్తం రైల్వే లైన్​పై  బ్రిడ్జి, మరో చోట  మాన్యువల్​ గేట్​ ఏర్పాటు చేశారు.  ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బ్రిడ్జి సరిపోకపోగా,  తరచూ రైళ్ల రాకపోకలతో గేట్​ క్లోజ్​ చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.    సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

కామారెడ్డి, వెలుగు:   కామారెడ్డి మీదుగా సికింద్రాబాద్​ నుంచి  నాందేడ్​, ముంబై వైపు రైల్వేలైన్​ ఉంది.  టౌన్​మధ్యలో నుంచి రైల్వే లైన్ ​వెళ్తుంది. ఈ  రైల్వే లైన్​కు ఇరువైపులా  కాలనీలు ఉన్నాయి.   హైస్కూల్​ సమీపంలో బ్రిడ్జి నిర్మించారు. ఇది చిన్నదిగా ఉండటంతో దానిస్థానంలో ఫ్లై ఓవర్​ నిర్మించారు.  భవిష్యత్​ అవసరాలకు అనుగుణంగా నిర్మించకపోవడంతో ఇప్పుడు రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.  తరచుగా బ్రిడ్జిపై ట్రాఫిక్​ సమస్య తలెత్తోతోంది.  అకస్మాత్తు​గా ఏదైనా వెహికల్​లో టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఆగిపోతే ట్రాఫిక్​ క్లియర్​ కావటానికి గంటల సమయం పడుతోంది.  దీంతో  హాస్పిటల్స్, ఇతర అత్యవసర పనులపై వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు.  

తరచూగా గేట్​ క్లోజ్​

అశోక్​ కాలనీ దగ్గర రైల్వే గేటు ఉంది.  రైళ్లు వచ్చినప్పుడల్లా దీనిని క్లోజ్​ చేస్తారు.  దీంతో  రెండు వైపులా వాహనాలు​ బారులు తీరుతున్నాయి.   రోజుకు 30 నుంచి 40 సార్లు గేట్​ క్లోజ్​చేస్తారు.   మళ్లీ ఓపెన్​ చేసేందుకు తక్కువలో తక్కువ పది నిమిషాలు పడుతుంది.  రైళ్ల క్రాసింగ్​ఉంటే 15 నిమిషాలకు పైగా తీసుకుంటుంది.  గేట్​ తెరిచిన తర్వాత ట్రాఫిక్​ క్లియర్​ కావటానికి మరో 20 నిమిషాలు పడుతుంది.   ఎక్స్​ప్రెస్​లు, ఆర్డనరీ రైళ్లతో పాటు, గూడ్స్​ ట్రెన్లు వెళ్తుంటాయి.  అశోక్​నగర్,  ఎన్జీవోస్​కాలనీ, కాకతీయనగర్, స్నేహపూరి కాలనీ, జయశంకర్​కాలనీ,  పంచముఖి హనుమాన్​ కాలనీ తదితర కాలనీ వాసులతో పాటు కలెక్టరేట్​కు, స్కూళ్లకు, గ్రామాలకు వెళ్లే వాళ్లు ఈ గేట్​ మీదుగా వెళ్తుంటారు. రోడ్డు మధ్యలో డివైడర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ట్రాఫిక్​ వలయంలో చిక్కుకుపోతుంటారు.  

 ఫ్లై ఓవర్​ లే శరణ్యం

రైల్వే లైన్​ మీదుగా రాకపోకలు సాగించేందుకు అనువుగా  ఫ్లై ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.  ఆ దిశగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు  ఆలోచనలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.   హైవే నుంచి టౌన్లోకి వచ్చే మార్గంలో పాతరాజంపేట వద్ద ఉన్న రైల్వే గేట్​ వద్ద ప్లై ఓవర్​  నిర్మాణానికి రైల్వే, ఆర్​అండ్​బీ ఆఫీసర్లు సర్వే నిర్వహించారు. ఇదే మాదిరిగా కామారెడ్డి టౌన్లో కూడా ప్లై ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.