ట్రంప్​, కమల హారిస్‌లకు రాహుల్ గాంధీ లేఖలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ కు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన లేఖ రాశారు. “అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మీకు అభినందనలు. భవిష్యత్తు కోసం ప్రజలు మీ విజన్ పై విశ్వాసం ఉంచారు. ప్రజాస్వామ్య విలువలపై మన దేశాలు చూపుతున్న నిబద్ధత ఇరుదేశాల మధ్య చరిత్రాత్మకమైన స్నేహాన్ని పంచుకుంటున్నాయి. మీ నాయకత్వంలో రెండు దేశాలు పలు రంగాల్లో మరింతగా సహకరించుకుంటాయని నేను ఆశిస్తున్నాను” అని లేఖలో రాహుల్  గాంధీ పేర్కొన్నారు.        

కమలకు ప్రశంసలు

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన కమలా హారిస్​ను రాహుల్ ప్రశంసించారు. అందరిని ఏకం చేయాలనే ఆమె పోరాటం మరికొంతమందికి స్ఫూర్తినిస్తుందని ఆమెకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘అధ్యక్ష ఎన్నికల్లో మీరు అద్భుతంగా ప్రచారం చేశారు. అందుకు నా అభినందనలు. భవిష్యత్తులో చేయబోయే ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని చెప్పారు.