న్యూఢిల్లీ: అమెరికాలో తాను చేసిన కామెంట్లపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవాలను అంగీకరించలేక బీజేపీ నేతలు తన నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.
" దేశంలోని సిక్కు సోదరసోదరీమణులను నేను ఒక విషయం అడగాలనుకుంటున్న. అమెరికాలో సిక్కులను ఉద్దేశించి నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? ప్రతి సిక్కు, ప్రతి ఇండియన్ తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశంగా భారత్ ఎందుకు ఉండకూడదు? అమెరికాలో నేను చేసిన కామెంట్లను బీజేపీ ఎప్పటిలాగే వక్రీకరించింది. నా కామెంట్లపై మళ్లీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నది. నిజాన్ని అంగీకరించలేక నా నోరునేమూయించాలనుకుంటున్నది. కానీ మన దేశ విలువలను కాపాడేందుకు నేను కృషి చేస్తూనే ఉంటాను. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ ఉన్నాయి. వాటి విషయంలో నా గొంతు ఎప్పటికీ మూగబోదు" అని రాహుల్ పేర్కొన్నారు. యూఎస్‌లో చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్ కు జత చేశారు.