- ఐక్యత కోసం కాంగ్రెస్ పోరాడుతుంది: రాహుల్ గాంధీ
- జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. కేంద్రంపై ఒత్తిడి తెస్తమని వెల్లడి
- ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ప్రచారం
పూంచ్, సూరన్‌కోట్: బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం అన్నారు.
వారు ఎక్కడికి వెళ్లినా, కులాలు, మతాలు, రాష్ట్రాలు, భాషల మధ్య విభేదాలు సృష్టించి, ఘర్షణను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని.. వారు హోదా ఇవ్వకపోతే భవిష్యత్తులో తాము రాష్ట్ర ఇస్తామని చెప్పారు.
అలాగే కాశ్మీరీల గొంతును పార్లమెంటులో వినిపిస్తానని చెప్పారు. సోమవారం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లాతో కలిసి రాహుల్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
పూంచ్, సురన్‌కోట్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం, ప్రతి ఒక్కరికి వారి హక్కులను ఇవ్వడం ద్వారా ముందుకు సాగుతుందని అన్నారు. ‘ఇండియా’ కూటమి ద్వేషం, హింసను కోరుకోదని.. అది ప్రేమ, కరుణతో బీజేపీని ఎదుర్కొంటుందని తెలిపారు.
ఢిల్లీ నుంచి కాదు.. స్థానికులే పాలించాలి
జమ్మూ కాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్ర నిర్వహణ, పరిపాలన ఢిల్లీ నుంచి జరగొద్దని.. స్థానికుల ద్వారా జరగాలని కాంగ్రెస్ కోరుకుంటుందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా పునురద్ధరణపై బలంగా గొంతు వినిపిస్తామని తెలిపారు. ఫస్ట్ టైమ్ ఒక పూర్తి స్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారని.. ఇక్కడి ప్రజల ప్రజాస్వామిక హక్కులు హరించారని విమర్శించారు.
మోదీ ‘బహుజన’ వ్యతిరేకి
బీజేపీ ‘కుల గణన’ అనే పదాన్ని పలకడానికి కూడా ప్రధాని మోదీ వణికిపోతున్నరని.. ‘బహుజనులు’ వారి హక్కులను, వాటాను పొందడం ఆయనకు ఇష్టంలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మోదీ ‘‘బహుజన వ్యతిరేకి’’ అని.. వారు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, రిజర్వేషన్లకు నష్టం చేయనీయబోమ ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సమగ్ర కుల గణన జరిపి.. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించి ప్రతి వర్గానికి హక్కులు, వాటా, న్యాయం లభించే వరకు విశ్రమించబోమని చెప్పారు.
కులగణన సమాచారం ద్వారా భవిష్యత్ పాలసీలు రూపొందించే వరకు కాంగ్రెస్ ఊరుకోదన్నారు. ‘‘కులగణన నాకు రాజకీయ అంశం కాదు.. బహుజనులకు న్యాయం చేయడమే నా లక్ష్యం” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.