రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువే ఇస్తం: రాహుల్ గాంధీ

  • ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ
  • తన మాటల్ని బీజేపీ వక్రీకరించిందని ఫైర్
  • తన మాటల్ని బీజేపీ వక్రీకరించిందని ఫైర్ 
  • కులగణనతోనే సామాజిక న్యాయం దక్కుతుందని వెల్లడి

వాషింగ్టన్/న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని మరింత పెంచేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆ పార్టీ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం అన్నట్లుగా బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘నేను చెప్పిన మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. మేము 50 కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం”అని బుధవారం యూఎస్​లోని నేషనల్ క్లబ్​లో జరిగిన ఇంటర్వ్యూలో రాహుల్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం వాషింగ్టన్​లోని జార్జ్ టౌన్ వర్సిటీ స్టూడెంట్లలో ఇంటరాక్షన్ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారత్​లోని 90 శాతం మంది బీసీలు, ఆదివాసీలు, దళితులకు అభివృద్ధిలో ప్రాతినిధ్యం దక్కట్లేదని చెప్పారు. 

దేశంలోని టాప్ 200 వ్యాపారాల్లో ఆధిపత్యం చలాయిస్తున్నది 10 శాతం మందేనని, మిగతా 90 శాతం జనాభా ఎలాంటి వ్యాపారాల్లో యజమానులుగా లేరని అన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో సైతం పేదల భాగస్వామ్యం లేదని, మీడియాలో కూడా ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం సున్నా అని వివరించారు. వారందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని రాహుల్ అన్నారు. ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థాయిలోఉన్నారో అర్థం చేసుకోవడానికి తాము దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కులగణనతోనే దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. 

రాహుల్ కు సింగ్ సభ మద్దతు 

ఇండియాలో సిక్కులకు మత స్వేచ్ఛ లేకుండా పోయిందని, వారు గురుద్వారాలకు తలపాగా ధరించి వచ్చేందుకు కూడా అనుమతించడం లేదంటూ రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన కామెంట్లకు కేంద్రీయ సింగ్ సభ మద్దతు తెలిపింది. ఈ అంశంపై కేంద్రీయ సింగ్ సభ జనరల్ సెక్రటరీ కుష్నాల్ సింగ్ బుధవారం మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో ఏండ్లుగా సిక్కుల మతపరమైన, సాంస్కృతిక హక్కులకు రక్షణ లేని మాట నిజమేనన్నారు. 1984లో గోల్డెన్ టెంపుల్ లోకి ఆర్మీని పంపడం, సిక్కుల ఊచకోత వంటివి హిందూత్వ రాజకీయాల వల్లే చోటు చేసుకున్నాయని, అప్పట్లో ఆర్ఎస్ఎస్ తో కలిసి కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడిందన్నారు. ఒకరకంగా ఇందిరా గాంధీ సర్కారు చర్యలను రాహుల్ గాంధీ ఈ కామెంట్లతో తిరస్కరించారని ఆయన అభిప్రాయపడ్డారు. 

దేశ శత్రువులతో చేతులు కలుపుతరా?: జగదీప్ ధన్ ఖడ్

అమెరికాలో రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్లపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గురువారం పార్లమెంట్ హౌస్ లో రాజ్యసభ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం థర్డ్ బ్యాచ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి దేశ శత్రువులతో చేతులు కలపడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని రాహుల్ పేరును ప్రస్తావించకుండానే విమర్శించారు. దేశ రాజ్యాంగం, జాతీయ ప్రయోజనాల గురించి ఆయనకు ఎటువంటి ఆలోచన లేదని ఆరోపించారు. ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం, రక్షణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఎందరో మహిళలు తమ భర్తలను, పిల్లలను కోల్పోయారు. జాతీయ వాదాన్ని అపహాస్యం చేయడమేంటీ? మన దేశానికి 5 వేల ఏండ్ల నాగరిక చరిత్ర ఉందన్న విషయం ఆయనకు అర్థం అయితలే” అని రాహుల్​ను ఉద్దేశించి ధన్​ఖడ్ మండిపడ్డారు. కాగా, రిజర్వేషన్ల రద్దు అంశంపై రాహుల్ చేసిన కామెంట్లపై బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో సహా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని, ఈ విషయం రాహుల్ కామెంట్లతోనే బయటపడిందని అమిత్​షా విమర్శించారు. రాహుల్ తన మనసులో ఉన్న మాటనే బయటపెట్టారని అన్నారు. ప్రాంతీయ వాదం, భాష, మతం ప్రాతిపదికన చీలికలు తెచ్చే కాంగ్రెస్ పార్టీ  రాజకీయాల గురించే రాహుల్ విదేశాల్లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇండియాలోని 90 శాతం మంది బీసీలు, ఆదివాసీలు, దళితులకు అభివృద్ధిలో ప్రాతినిధ్యం దక్కట్లేదు. దేశంలోని టాప్ 200 వ్యాపారాల్లో ఆధిపత్యం చలాయిస్తున్నది 10 శాతం మందే. అత్యున్నత న్యాయస్థానంలో సైతం పేదల భాగస్వామ్యం లేదు. మీడియాలో కూడా ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం సున్నా. వారందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కులగణనతోనే దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుంది.
- రాహుల్ గాంధీ