ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు. 46 మ్యాచ్ లకే ఏకంగా 8 సెంచరీలు బాదేశాడు. ఒక సెంచరీ కొట్టడం చాలా కష్టం. కానీ ఈ ఆఫ్ఘన్ ఓపెనర్ చాలా ఈజీగా కొట్టేస్తున్నాడు. సోమవారం (నవంబర్ 11) బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో కదం తొక్కాడు. 121 బంతుల్లో 101 పరుగులు చేసి వన్డే కెరీర్ లో 8వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. గుర్భాజ్ ఇన్నింగ్స్ లో 7 సిక్సులు..5 ఫోర్లున్నాయి.
గుర్బాజ్ సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ గెలుచుకుంది. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ రికార్డ్స్ ను బద్దలు కొట్టాడు. 22 సంవత్సరాల వయసులో వన్డే కెరీర్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (22 సంవత్సరాల 357 రోజులు), విరాట్ కోహ్లి (23 సంవత్సరాల 27 రోజులు), బాబర్ అజామ్ (23 సంవత్సరాల 280 రోజులు) లాంటి దిగ్గజాలను గుర్బాజ్ అధిగమించాడు.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ ఈ లిస్టులో అగ్ర స్థానంలో ఉన్నాడు. డికాక్ కు 22 సంవత్సరాల 312 రోజులు అవసరం కాగా.. గుర్భాజ్ కు 22 సంవత్సరాల 349 రోజులకు ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా 98 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ మరో 10 మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. గుర్భాజ్(101) సెంచరీకి తోడు ఓమార్జాయి (70) హాఫ్ సెంచరీతో రాణించాడు.
And he is just 22 years old ? ?? @ACBofficials #RahmanullahGurbaz #AFGvsBAN #CricketTwitter pic.twitter.com/WnfgFyITbm
— the_cricket_web (@the_cricket_web) November 12, 2024