
- తొలి ఇన్నింగ్స్‌లో 544/7
- తేలిపోయిన ఇండియా బౌలర్లు
మాంచెస్టర్: సీనియర్ క్రికెటర్ జో రూట్ (248 బాల్స్‌లో 14 ఫోర్లతో 150) రికార్డులు బ్రేక్ చేస్తూ ఖతర్నాక్ సెంచరీతో కదం తొక్కడంతో ఇండియాతో నాలుగో టెస్టును ఇంగ్లండ్ పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకుంది. గిల్ సేన పేలవ బౌలింగ్‌ను దంచికొడుతూ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యంతో పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 225/2తో ఆట కొనసాగించిన ఇంగ్లిష్ టీమ్ మూడో రోజు, శుక్రవారం చివరకు135 ఓవర్లలో 544/7తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటికే 186 రన్స్ ఆధిక్యం అందుకుంది.
కెప్టెన్ బెన్ స్టోక్స్ (77 బ్యాటింగ్), ఒలీ పోప్ (71) ఫిఫ్టీలతో సత్తా చాటారు. రోజంతా బౌలింగ్ చేసిన ఇండియా ఐదే వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్ సుందర్ (2/57) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా (1/91) సహా పేసర్లు ఫెయిలయ్యారు. ప్రస్తుతం లియామ్ డాసన్ (21 బ్యాటింగ్)తో కలిసి స్టోక్స్ క్రీజులో ఉండగా ఆతిథ్య జట్టు ఆధిక్యం 230–250 దాటేలా ఉంది. ఈ పరిస్థితుల్లో అద్భుతం చేస్తే తప్ప ఇండియాకు ఓటమి తప్పేలా లేదు.
రూట్, పోప్ అలవోకగా..
రెండో రోజు సాయంత్రం సెషన్‌లో విఫలమైన ఇండియా బౌలింగ్ ఎటాక్ మూడో రోజు ఉదయం కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో రూట్, పోప్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. బుమ్రా, అన్షుల్, సిరాజ్ వాళ్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. ఒక ఎండ్ నుంచి బాల్ అనూహ్యంగా బౌన్స్ అయినా.. ఇంగ్లండ్ బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొన్నారు. ఇంకోవైపు ఇండియా బౌలర్లు వాళ్లపై ఒత్తిడిని తగ్గించేలా లూజ్ బాల్స్ వేశారు. బుమ్రా.. రూట్ ప్యాడ్స్‌ను టార్గెట్ చేస్తూ వేసిన బాల్‌తో బౌలింగ్ దాడి మొదలు పెట్టగా.. అతను దాన్ని ఫోర్ కొట్టాడు.
ఆపై, ఇండియా పేస్ లీడర్ ప్లాన్ మార్చి షార్ట్ పిచ్ బాల్స్ వేసినా రూట్, పోప్ క్రమం తప్పకుండా బౌండ్రీలు బాదారు. రూట్ 22 రన్స్ వద్ద ఉన్నప్పుడు అతడిని రనౌట్ చేసే చాన్స్‌ను ఇండియా మిస్ చేసింది. ఇక, కొత్త పేసర్ అన్షుల్ కంబోజ్ తన తొలి స్పెల్‌లో పోప్ ఎడ్జ్ రాబట్టినా.. కష్టమైన క్యాచ్‌ను కీపర్ జురెల్ డ్రాప్ చేశాడు. వీటిని సద్వినియోగం చేసుకొని రూట్, పోప్ ఇద్దరూ ఫిఫ్టీలు పూర్తి చేసుకోగా.. ఇంగ్లండ్ 332/2తో లంచ్‌కు వెళ్లింది.
సుందర్ బ్రేక్ ఇచ్చినా.. వాళ్లది అదే జోరు
లంచ్ బ్రేక్ నుంచి వచ్చి ఏడో బాల్‌కే పోప్‌ను ఔట్ చేసిన సుందర్ మూడో వికెట్‌కు 144 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. కొద్దిసేపటికే సుందర్ బౌలింగ్‌లో క్రీజు దాటొచ్చి షాట్ ఆడే ప్రయత్నంలో హ్యారీ బ్రూక్ (3) స్టంపౌట్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ 349/4తో నిలవగా.. ఇండియా పుంజుకునేలా కనిపించింది. కానీ, కెప్టెన్ బెన్ స్టోక్స్ తోడుగా జోరు కొనసాగించిన రూట్ ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. కొత్త బాల్ వచ్చినా మన పేసర్లు చాలా సేపటి వరకు వికెట్ తీయలేపోయారు. ఈ బాల్‌తో ఒక ఓవర్ వేసిన తర్వాత బుమ్రా గ్రౌండ్ వీడాడు. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి గ్రౌండ్‌లోకి వస్తుండగా మెట్లపై జారి పడటంతో ఇబ్బందికి గురయ్యాడు. దాంతో స్టోక్స్, రూట్ ధాటిగా ఆడటంతో చూస్తుండగానే స్కోరు 400 దాటింది.
178 బాల్స్‌లో రూట్ సెంచరీ పూర్తి చేసుకోగా ఇంగ్లండ్ 433/4తో రెండో సెషన్ ముగించింది. చివరి సెషన్‌లోనూ ఆటలో ఎలాంటి మార్పు లేదు. రూట్, స్టోక్స్ తమ ధాటిని కొనసాగించారు. ఈ క్రమంలో 97 బాల్స్‌లో స్టోక్స్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే కాలు కండరాలు పట్టేయడంతో తను రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతని ప్లేస్‌లో క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్ (9) తోడుగా రూట్ 150 మార్కు అందుకున్నాడు. అదే స్కోరు వద్ద జడేజా టర్నింగ్ బాల్‌ను ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడబోయి స్టంపౌట్ అవ్వడంతో అతని మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ముగిసింది. తిరిగి గ్రౌండ్‌లోకి వచ్చిన బుమ్రా.. స్మిత్‌ను ఔట్ చేసి తొలి వికెట్ ఖాతాలో వేసుకోగా. కొద్దిసేపటికే క్రిస్ వోక్స్ (4)ను బౌల్డ్ చేసిన సిరాజ్ కూడా ఖాతా తెరిచాడు. అయితే, చివర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్ .. డాసన్ తో కలిసి ఇంకో వికెట్ పడకుండా రోజు ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 135 ఓవర్లలో 544/7 (రూట్ 150, స్టోక్స్ 77 బ్యాటింగ్ , సుందర్ 2/57)
రికార్డుల రూట్
ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న జో రూట్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. 13,409 రన్స్‌తో టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్ (13,378) ను అధిగమించాడు. ఈ లిస్ట్‌లో సచిన్ టెండూల్కర్ (15,921) టాప్‌లో ఉన్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో రూట్ 38 సెంచరీలు సాధించాడు. టెండూల్కర్ (51), కలిస్ (45), పాంటింగ్ (41) మాత్రమే అతని కంటే ముందున్నారు. కుమార సంగక్కర కూడా 38 సెంచరీలు సాధించాడు. రూట్ చేసిన సెంచరీల్లో 23 స్వదేశంలోనే వచ్చాయి. దాంతో సొంతగడ్డపై ఎక్కువ టెస్టు సెంచరీలు చేసిన పాంటింగ్ (ఆస్ట్రేలియా), కలిస్ (సౌతాఫ్రికా), జయవర్ధనే (శ్రీలంక) సరసన నిలిచాడు.
ఈ ముగ్గురూ 23 సెంచరీలు కొట్టారు.
టెస్టుల్లో రూట్ 104 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. ఈ జాబితాలో ఉన్న పాంటింగ్, కలిస్ (103)ను అధిగమించాడు. సచిన్ (119) ఈ రికార్డులో రూట్ కంటే
ముందున్నాడు. ఇండియాపై రూట్ 12 టెస్ట్ సెంచరీలు కొట్టాడు. మన టీమ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన స్టీన్ స్మిత్ (11) రికార్డును బ్రేక్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో రూట్ 37 ఇన్నింగ్స్‌ల్లో 583 రన్స్ రాబట్టాడు. దాంతో ఒక బౌలర్‌పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. స్టీన్ స్మిత్.. స్టువర్ట్ బ్రాడ్‌పై 49 ఇన్నింగ్స్‌ల్లో 577 రన్స్ సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు.