జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి : ఆర్. గౌతమ్ కుమార్​ 

బోధన్, వెలుగు: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు ఆర్.గౌతమ్​ కుమార్​ డిమాండ్​ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెలో భాగంగా శుక్రవారం బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా గౌతమ్​ కుమార్​ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి లేకుండా ప్రభుత్వం అజమాయిషీ చెలాయించడం కోసమే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఎన్​సీఈఆర్ టీ ద్వారా పాఠ్యపుస్తకాల్లో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీ స్టూడెంట్స్​కు స్కాలర్​షిప్, ​ఫెలోషిప్​లలో కోత విధించడం సమంజసం కాదన్నారు. యూనివర్సిటీ గ్రాంట్​కమిషన్ కు సరిపడా నిధులు ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. వామపక్ష విద్యార్థి సంఘం లీడర్లు రాజన్న, అంజలి, సాయికుమార్, మోసిన్, ఆకాశ్, సాయినాథ్, ప్రకాశ్​ పాల్గొన్నారు.