గవర్నమెంట్​ స్కూళ్లలో ఏటా తగ్గుతున్న స్టూడెంట్లు

  • వనపర్తి జిల్లాలో మూడేండ్లలో 5,941 మంది తగ్గినట్లు చెబుతున్న నివేదికలు
  • ఆశించిన ఫలితమివ్వని అధికారుల చర్యలు

వనపర్తి, వెలుగు:‘గవర్నమెంట్​ స్కూళ్లలో అర్హత కలిగిన టీచర్లు పాఠాలు చెబుతున్నారు. అయినా తల్లిదండ్రులు ప్రైవేట్​ స్కూళ్ల వైపే మొగ్గు చూపడం ఆందోళన కలిగించే విషయం. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సర్కారు బడుల్లోనే పిల్లలను చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలి’ డీఎస్సీ-2024లో ఎంపికైన టీచర్లకు నియామకపత్రాలు అందించే సమయంలో సీఎం రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలివి..వనపర్తి జిల్లాలో ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ, హైస్కూళ్లు, ఇతర గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్లు ఈ అకడమిక్​ ఇయర్​లో 3,573 మంది తగ్గారు.

నిరుటి స్టూడెంట్ల ఎన్​రోల్​మెంట్​తో పోల్చుకుంటే ఈ సారి భారీగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గవర్నమెంట్​ ప్రైమరీ స్కూళ్లలో  విద్యార్థుల సంఖ్య గతంలో 60 వరకు ఉండగా, ఈసారి చాలా మటుకు స్కూళ్లలో 25 వరకు ఉండడం గమనార్హం. జిల్లా కేంద్రం వంటి పట్టణాల్లో ఇంగ్లీష్​ మీడియం ఉన్న చోట ఎన్​రోల్​మెంట్​ కాస్త మెరుగ్గా ఉంది. మిగతా చోట్ల ఎన్​రోల్​మెంట్​ అంతంతమాత్రమే. మౌలిక వసతుల కొరతే ఈ సంఖ్య తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. 

డ్రాపవుట్స్​పై దృష్టి పెట్టినా..

ప్రతి విద్యా సంవత్సరంలో డ్రాపవుట్స్​ను తగ్గించి బడుల్లో ఎన్​రోల్​మెంట్ పెంచేందుకు అకడమిక్​ ప్రారంభంలోనే జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోయిన కుటుంబాల్లో బడి ఈడున్న పిల్లలు స్కూళ్లకు రావడం లేదు. ఇంటి వద్ద అవ్వ, తాతల వద్దే ఉంటున్నారు. బడి ఈడున్న కొందరు పిల్లలు మధ్యాహ్నం వరకు బడికి వెళ్లి, ఆ తరువాత తమ తమ్ముడు, చెల్లిని చూసుకునేందుకు ఇంటి వద్దే ఉంటున్నారు.

అలాగే ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు, ఇతరత్రా కుటీర పరిశ్రమల వద్ద పని చేసే కార్మికుల పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. కార్మికులు ఎక్కడ పని చేస్తే అక్కడికి పిల్లలను వెంట తీసుకెళ్తుండడంతో వారి చదువు అటకెక్కుతున్నాయి.

 కొన్ని సందర్భాల్లో పని లేక పోవడంతో మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు అకడమిక్​ ఇయర్​ మధ్యలో తల్లిదండ్రులతో కలిసి పిల్లలు పోతున్నారు. దీంతో చదువుకు దూరమవుతున్నారు. ఇదిలాఉంటే దిగువ మధ్య తరగతికి చెందిన వారు ప్రిస్టేజ్​గా భావిస్తూ తమ పిల్లలను అప్పు చేసి  ప్రైవేట్​ బడుల్లో చేరుస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంకా పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. 

సర్దుబాటూ సమస్యే..

రెసిడెన్షియల్, మాడల్​ స్కూళ్లలో సీట్లు భర్తీ అవుతున్నాయి. కానీ, ప్రైమరీ, అప్పర్  ప్రైమరీ స్కూళ్లలో ఎన్​రోల్​మెంట్​ తగ్గుతుండడంతో ఆయా స్కూళ్లలోని టీచర్లను సర్దుబాటు కింద మరో బడికి పంపుతున్నారు. ఇందులో అక్రమ డిప్యుటేషన్లు ఉండడం ఎన్​రోల్​మెంట్​పై ప్రభావం చూపుతోంది. డీఎస్సీ-2024 నియామకంలో 154 పోస్టులకు గాను, 152 మందికి నియామకపత్రాలు ఇచ్చారు.

వనపర్తి జిల్లాలో ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ, హైస్కూళ్లతో కలిపి 518 స్కూల్స్​ ఉన్నాయి. 2022లో 54,731 మంది ఎన్​రోల్​మెంట్​ కాగా, 2023లో 52,543 మంది, 2024లో 48,790 మంది అయినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.