పూసా గెహూ గౌరవ్​ వంగడం

మెత్తని చపాతీలు, రుచికరమైన పాస్తా తయారీకి మన్నిక కలిగిన పూసా గెహూ గౌరవ్​ వంగడాన్ని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండో ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్​ జంగ్​ బహదూర్​ సింగ్​ కనుగొన్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన 109 రకాల వంగడాల్లో పూసా గౌరవ్​ ఉంది. 

పూసా గౌరవ్​ డురం జాతి వంగడం. ప్రపంచమంతటా పాస్లా, అంబలి, సేమ్యా తయారీకి డురం గోధుమను విరివిగా ఉపయోగిస్తున్నారు. పూసా గెహూ గౌరవ్​ గోధుమ పిండి సాధారణ డురం గోధుమల కంటే ఎక్కువ నీటి పీల్చుకుంటుంది. దీంతో చపాతీలు మెత్తగా వస్తాయని జంగ్​ బహదూర్ సింగ్​ వివరించారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగి, సాగునీటి సదుపాయం తగ్గినా పూసా గౌరవ్​ మంచి దిగుబడిని ఇస్తుంది. పరిమిత సాగునీటి సదుపాయం ఉన్నా హెక్టారుకు 30.2 క్వింటాళ్ల నుంచి 39.9 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇచ్చే ఈ వంగడం దక్షిణ, మధ్య భారత ప్రాంతాలకు ఎంతో అనువైంది.