నిజామాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ళు సెంటర్లు క్లోజ్

  • ప్రభుత్వ లక్ష్యం 6 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
  • ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మాత్రం 4.25 లక్షల టన్నులే
  • పూర్తి కావొస్తున్న యాసంగి వడ్ల కొనుగోలు
  •  జిల్లాలో 937.46 కోట్ల ధాన్యం కొన్న సర్కారు

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో యాసంగి సీజన్​ వడ్ల కొనుగోళ్ల టార్గెట్‌ను ఆఫీసర్లు చేరుకోలేకపోయారు. ​ మొత్తం 14 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడిలో  కనీసం 6 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా..   ఇప్పటివరకు కేవలం  4.25 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.  రైతులు దొడ్డురకం వడ్లను గవర్నమెంట్​కు అమ్మగా..  సన్న వడ్లను   ప్రైవేటు మిల్లర్లకు అమ్మారు.   రైతులకు లాభం కలిగేలా ప్రైవేటు కొనుగోళ్లు జరగడంతో సర్కారు దీన్ని ఎంకరేజ్​ చేసింది.  కడ్తా, తరుగు పేరుతో మిల్లర్లు మోసం చేస్తే యాక్షన్​ తీసుకోవాలని అధికారులను ఆదేశించి రైతులకు అండగా నిలబడడంతో సేల్స్​ కొనసాగాయి. కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన మిల్లర్లు వడ్లు కొనుగోలు చేసి తరలించారు.  

రెండు సీజన్​ల నుంచి బాగా డిమాండ్​ 

స్టేట్​లో వరి పంట సాగు చేసే టాప్​ త్రీ జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి.  సాధారణ విస్తీర్ణం కంటే 150 శాతం అధిక విస్తీర్ణంలో  వరి సాగు చేస్తున్నారు. గతేడాది వర్షాకాలంలో 4.20 లక్షల ఎకరాలు, యాసంగిలో 4.10 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు.  క్వింటాల్​ వడ్లకు ప్రభుత్వ మద్దుతు ధర 'ఏ' గ్రేడ్​కు రూ.2,203, సెకండ్​ గ్రేడ్​కు రూ.2,183 ఉంది.  పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, కర్నాటకలో భారీ వర్షాలు, వరదలతో కిందటేడు పంటలు సరిగా పండలేదు.  దీంతో అక్కడి మిల్లర్లంతా జిల్లా నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. పోయిన వానాకాలంలో సన్నరకం పచ్చి వడ్లను రూ.2,800 రేట్​తో స్పాట్​ పేమెంట్​ ఇచ్చి సేకరించారు.  

గవర్నమెంట్​ పర్చేజ్ సెంటర్లకు దొడ్డురకం వడ్లు మాత్రమే రాగా..  4  లక్షల మెట్రిక్​ టన్నుల కొనుగోళ్లతో సీజన్​ముగించారు.  మిల్లర్లు చెల్లించిన రేట్‌ను ప్రామాణికం చేసుకుని రైతులు మొన్నటి యాసంగిలో 85 శాతం విస్తీర్ణంలో సన్నాలను సాగుచేశారు.  మొత్తం 14  లక్షల దిగుబడిలో 6 లక్షల టన్నులను కొనుగోలు చేయాలని ఆఫీసర్లు ప్లాన్​ చేశారు.  జిల్లా వ్యాప్తంగా 480 పర్చేజ్ సెంటర్లు ఓపెన్ చేయాలని నిర్ణయించి ఏప్రిల్​ మొదటివారంలో 438 సెంటర్లు షురూ చేశారు.  అంతకు 20 రోజుల ముందే  ప్రైవేటు మిల్లర్లు ఎంటరై దాదాపు సగం దిగుబడిని కొనేశారు.  

దోపిడి లేకుండా చర్యలు

యాసంగిలో పండించిన  సన్నరకం పచ్చి వడ్లకు మిల్లర్లు రూ.2,400 రేట్​ముట్టజెప్పారు. దీంతో రైతులు అటే మొగ్గారు. వారికి మేలు జరుగుతున్నందున మిల్లర్ల దోపిడీ లేకుండా గవర్నమెంట్​ నియంత్రణ చర్యలు చేపట్టడంతో మరింత మేలు జరిగింది.  ఎంఎస్​పీ కంటే రేట్​ తగ్గించి ఎవరు కొనుగోలు చేయకుండా ఆఫీసర్లు పర్యవేక్షించారు. తరుగు, కడ్తాను కంట్రోల్​ చేశారు. ఫలితంగా సుమారు 10 లక్షల మెట్రిక్​ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేశారు. గవర్నమెంట్​ కాంటాలకు దొడ్డురకం వడ్లను 4.25 లక్షల టన్నులు అమ్మారు. యాసంగి కొనుగోళ్లు ఇక క్లోజ్​ అయినట్లేనని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.  

బాల్కొండ సెగ్మెంట్​ మినహా జిల్లాలో సెంటర్లు పది రోజుల కిందే మూసేశారు. మరో నాలుగు రోజులలో మిగితా వాటిని మూసేయనున్నారు.  జిల్లాలో గవర్నమెంట్​ పక్షాన రూ.937.46  కోట్ల విలువ వడ్ల కొనుగోళ్లు జరిగాయి. అందులో రూ.824.94  కోట్ల డబ్బును  రైతుల బ్యాంక్​ అకౌంట్​లో డిపాజిట్​ చేశారు.  మిగితా బిల్లు చెల్లించే ఏర్పాట్లు సివిల్​ సప్ల్సై ఆఫీసర్లు చేస్తున్నారు.