విశ్వాసం : తండ్రి చెప్పిన నీతులు : పురాణపండ వైజయంతి

ఎరుకగలవారి చరితలు కరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం

బెరుగుచు నెరిగినదానిని మరవ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్‌‌

ప్రసిద్ధులైన వారి చరిత్రలు నిత్యం మననం చేసుకోవాలి. సజ్జనులతో గోష్ఠి జరుపుతుండాలి. ధర్మం తెలుసుకోవాలి. తెలిసిన దానిని మరచిపోకుండా నిత్యం అనుష్ఠించాలి. అటువంటివారిని బుద్ధిమంతులుగా చెప్తారని యయాతి మహారాజు తన కుమారుడైన పూరువుకి ధర్మబోధ చేస్తాడు. 

కొన్ని కారణాల వల్ల శాపవశాత్తు యయాతి యవ్వనంలో ఉండగానే వార్థక్యాన్ని భరించాల్సి వచ్చింది. తన వార్థక్యాన్ని ఎవరైనా తీసుకుంటే యయాతి యవ్వనవంతుడు అవుతాడని శుక్రాచార్యుడు శాపవిమోచనం చెప్పాడు. అప్పుడు యయాతి కుమారుడైన పూరువు తండ్రి వార్థక్యాన్ని స్వీకరించాడు. యయాతి వేయి సంవత్సరాలు యవ్వనవంతునిగా భోగాలను అనుభవించి, ఆ తరువాత తన వార్థక్యాన్ని పూరువు నుంచి తిరిగి స్వీకరించి, పూరువుకి రాజ్య పట్టాభిషేకం చేశాడు. తాను తపస్సుకు పోతూ పూరువుకి చేసిన ధర్మబోధ ఇది. 


ప్రసిద్ధులైన వారి చరిత్రలు నిత్యం మననం చేసుకోమన్నాడు. అంటే శ్రీరామచంద్రుని వంటి మహనీయుల గురించి నిత్యం మననం చేసుకోవాలి. శ్రీరాముడు సత్యవాక్పాలకుడు, తండ్రి మాటను జవదాటని వాడు. పరులను దూషించనివాడు. మిత, హిత, మృదు, పూర్వభాషి. ఇన్ని సద్గుణాలు ఉన్న రాముని వంటి ప్రసిద్ధుల చరిత్రలను అనునిత్యం పఠించడం వల్ల సత్ప్రవర్తన కలిగి ఉంటారని యయాతి మాటల్లోని అంతరార్థం. అదేవిధంగా సజ్జనులతో గోష్ఠి జరుపుతుండాలి. దానినే ‘సత్సంగం’ అని కూడా అంటారు. శ్రీరాముడు... జటాయువు, సుగ్రీవుడు, గుహుడు, హనుమంతుడు, విభీషణుడు వంటి సజ్జనులతో మంచిచెడులు విచారిస్తుండేవాడు. అందువల్లనే శత్రుసంహారం చేయగలిగాడు. రావణుడితో యుద్ధం చేసి, వాని చెర నుండి సీతమ్మను విడిపించగలిగాడు.


తెలుగు భారతాన్ని రచించిన నన్నయకు నారాయణభట్టు అనే స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితునితో నిత్యం సద్గోష్ఠి జరిపేవాడట నన్నయ. తనకు కలిగిన సందేహాలను అడిగి తెలుసుకునేవాడట. సద్గోష్ఠికి సంబంధించి పంచతంత్రంలో ‘మిత్రలాభం’ పేరున అనేక కథలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. 


యయాతి చెప్పిన మరో విషయం, ‘ధర్మం’ గురించి తెలుసుకోవటం. ఏది ధర్మం? ఏది అధర్మం? ఏవి ధర్మసూక్ష్మాలు? వంటి విషయాలను పరిపాలకుడు తప్పక తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న ధర్మాలను మరచిపోకుండా నిత్యం అనుష్ఠించాలి. అలా అనుష్ఠించిన వారిని బుద్ధిమంతులుగా చెప్తారు. 


ధర్మాన్ని ఆచరించటంలో ధర్మరాజును మించినవారు లేరు. ఎన్ని కష్టాలు అనుభవించినా, ధర్మాన్ని అతిక్రమించటానికి ఏనాడూ ప్రయత్నించలేదు ఆయన. జూదంలో ఓడిపోయిన సమయంలో, ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పటికీ, ధర్మానికే కట్టుబడ్డాడు ధర్మరాజు. యుద్ధంలో ద్రోణాచార్యుని చేత అస్త్ర సన్యాసం చేయించటం కోసం ‘అశ్వత్థామ హతః’ అని పలుకమన్నప్పటికీ పెదవి కదపలేదు ధర్మరాజు. సరిగ్గా అదే సమయంలో ‘అశ్వత్థామ’ అనే పేరు కలిగిన ఏనుగు మరణించటంతో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః కుంజరః’ అని ధర్మబద్ధంగా మాట్లాడాడు. 


యయాతి ఇంకా మరికొన్ని హితవాక్యాలను పూరువుకి బోధించాడు. ‘‘అర్హులైన వారికి సాయం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. అవసరానికి సాయం అర్థించిన వారికి లేదనకుండా తగినరీతిలో సాయం అందించాలి. మంచి మనసు కలిగి ఉండాలి. ప్రియము, హితము, అమోఘము, మధురము, పరిమితము అయిన  మంచి పలుకులు పలకాలి. వాడి మొనలు కలిగిన శరముల వంటి పలుకులు పలుకరాదు. అరిషడ్వర్గాలను గెలవాలి’’ అని నీతి బోధ చేశాడని నన్నయ ఆదిపర్వం తృతీయాశ్వాసంలో చెప్పాడు. 


రఘు మహారాజు ఒకసారి యాగం చేసి అర్హులైనవారందరికీ దానధర్మాలు చేశాడు. కోశాగారమంతా ఖాళీ అయిపోయింది. అటువంటి సమయంలో... వరతంతు అనే గురువు దగ్గర విద్యాభ్యాసంచేసి కౌత్సుడు అనే శిష్యుడు పద్నాలుగు వేల బంగారు నాణాలను గురుదక్షిణగా చెల్లించటం కోసం రఘుమహారాజు దగ్గరకు వచ్చి అర్థించాడు. కౌత్సుని అర్హతలు తెలుసుకున్న రఘుమహారాజు, కుబేరుని మీద యుద్ధం చేసి, పద్నాలుగు లక్షల బంగారు నాణాలను కౌత్సుడికి ఇచ్చాడు. కౌత్సుడు గురుదక్షిణ చెల్లించుకున్నాడు.

 *   *   *

రామాయణంలో...

దశరథుడు... తన నలుగురు పిల్లలను కూర్చోబెట్టుకుని వారికి నీతిబోధ చేశాడు. సక్రమ మార్గంలో పయనించేలా శిక్షణ ఇచ్చాడు.

మహాభారతంలో..

ధృతరాష్ట్రుడు తన నూరుగురు కుమారులకు నీతిబోధ చేయకపోగా, వారు చేసే అకృత్యాలను వ్యతిరేకించలేదు. ఇంటి కోడలికి పరాభవం జరుగుతున్నప్పటికీ పెదవి కదపలేదు. చిన్ననాటి నుండి పాండవులను ఎంతగా బాధించినా ‘తప్పు’ అని ఒక్కనాడూ చెప్పలేదు ధృతరాష్ట్రుడు.


‘సంతానానికి ధర్మబోధ చేయటం తండ్రి కర్తవ్యం’ అని బుధులు పలుకుతున్నారు. అందువల్లనే యయాతి మహారాజు తన కుమారునికి ఇంత నీతిని, ధర్మాన్ని బోధించాడు అని భారతం చెప్తోంది.

-  డా. పురాణపండ వైజయంతి
ఫోన్ : 80085 51232