విశ్వాసం..ధనం కష్టపడి సంపాదించాలి

ఉత్తమం స్వార్జితం విత్తం 
మధ్యం పితురార్జితం
అధమం భ్రాతృ విత్తం
 స్త్రీ విత్తమ్‌ అధమాధమమ్‌

స్వయంగా సంపాదించుకున్న ధనము ఉత్తమమైనది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ధనం మధ్యమంగా భావించబడుతుంది. సోదరుల నుంచి సంపాదించుకున్న ధనాన్ని అధమంగాను, చివరగా స్త్రీ నుంచి పొందిన ధనాన్ని అధమాధమముగాను పరిగణిస్తారని ఈ శ్లోకం చెప్తుంది. 


‘ధనమూలమిదమ్‌ జగత్‌’ అని ఆర్యోక్తి. ఈ ప్రపంచమంతా సంపదల మీదే ఆధారపడి నడుస్తుంది. అందుకనే ప్రతి మానవ ప్రాణి తగినంత ధనాన్ని సంపాదించవలసిన అవసరం ఉంది. ఆ సంపాదించే ధనాన్ని నాలుగు విధాలుగా ఈ శ్లోకంలో తెలియచేశారు. 


ఒక ఊరిలో ఒక వ్యాపారి, భార్య, కుమారులు, కోడళ్లు ఉండేవారు. ఆ కుమారుల్లో ఒక కుమారుడు అప్రయోజకుడిగా ఉంటూ, ఏ పనీ చేసేవాడు కాదు. ఇంట్లో ధనాన్ని దుబారా చేసేవాడు. ఒకసారి తండ్రి ఆ కుమారుడిని పిలిచి ‘ఇలా డబ్బును వృథా చేయకూడదు, నువ్వు కష్టపడి ఒక్క పది పైసలు  సంపాదించుకునిరా. అప్పుడు నీకు నా వ్యాపారం అప్పచెప్తా’ అని గట్టిగా అన్నాడు.


‘సరేన’ని చెప్పి, మొదటిరోజు తల్లి దగ్గరకు వెళ్లి, పదిపైసలు ఇమ్మని అడిగాడు. తల్లి చిరాకు పడుతూ ‘ఇదిగో పదిపైసలు, ఇంకెప్పుడూ నన్ను అడగకు. కష్టపడి సంపాదించడం నేర్చుకో’ అని పదిపైసలు ఇచ్చింది. 


తండ్రి దగ్గరకు వెళ్లి ‘ఇదిగో ఈ రోజు నేను ఈ పది పైసలు సంపాదించా’ అని తండ్రి చేతికి ఇచ్చాడు. తండ్రి ఆ పది పైసలను పక్కనే ఉన్న కాలువలోకి విసిరేశాడు. మరొకరోజు అన్నగారి దగ్గరకు వెళ్లి, ‘అన్నయ్యా! నాకు ఒక్క పది పైసలు ఇవ్వు’ అని అడిగాడు. అన్నగారు అసహనంగా పదిపైసలు ఇస్తూ ‘ఇంకెప్పుడూ నన్ను డబ్బులు అడగకు’ అని చిరాకుపడ్డాడు. ఆ పది పైసలు తీసుకుని తండ్రికి ఇచ్చి ‘నాన్నా! నేను కష్టపడి సంపాదించా ఈ పదిపైసలు’ అన్నాడు. ఆ పది పైసలను కూడా తండ్రి కాలువలోకి విసిరేశాడు. కొడుకు మౌనంగా వెళ్లిపోయాడు. మరుసటి రోజు భార్య దగ్గరకు వెళ్లి ‘నాకు ఒక్క పది పైసలు ఇవ్వు’ అని చెయ్యి చాపాడు. 

‘నువ్వు సంపాదించి నాకు పెట్టకుండా, నన్ను డబ్బులు అడుగుతున్నావా’ అని విసుక్కుంటూ.. కొంగున కట్టుకున్న పదిపైసలు తీసి ఇచ్చింది. ఎప్పటిలాగే ఆ పదిపైసలు తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్లి ‘ఇదిగో, ఈ రోజు నేను సంపాదించిన పది పైసలు’ అని తండ్రికి ఇచ్చాడు. తండ్రి ఆ పది పైసల నాణాన్ని కూడా  విసిరేశాడు. 


ఇక తనకు డబ్బులు ఇచ్చేవారు ఎవ్వరూ లేకపోవడంతో, చేసేది లేక ఒకచోట రోజంతా కష్టపడి బస్తాలు మోసి పదిపైసలు సంపాదించాడు. ఆ పది పైసలను తీసుకుని తండ్రి దగ్గరకు వచ్చి ‘ఇదిగో ఈ పది పైసలు నేను చెమటోడ్చి సంపాదించి తెచ్చా’ అంటూ తండ్రికి ఇచ్చాడు. ఎప్పటిలాగే తండ్రి ఆ పది పైసలను కాలువలోకి విసిరేయబోయాడు. తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని, ఆ పది పైసలు తన చేతిలోకి తీసుకుని ‘నాన్నా! పది పైసలు ఎందుకు విసిరేస్తావు. 

నేను కష్టపడి సంపాదించా’ అని గట్టిగా అరిచాడు. అప్పుడు తండ్రికి అర్థమైంది. ఈ పది పైసలు తన కొడుకు చెమటోడ్చి, కష్టపడి సంపాదించి  తెచ్చాడని. ఆ రోజున కుమారుడితో అన్నాడు ‘ఉత్తమం స్వార్జితం విత్తం అని అర్థమయిందా!’ ఇంతకు ముందు విసిరేస్తే నువ్వు బాధపడలేదు. ఇది నీ కష్టార్జితం. అందుకే నీకు బాధ కలిగింది అన్నాడు. అంతకుముందు తన తల్లి, అన్న, భార్య తనను విసుక్కున్న సంగతి గుర్తు తెచ్చుకున్నాడు. తండ్రి మాటలను అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి వ్యాపారాన్ని కుమారునికి అప్పచెప్పాడు తండ్రి. తన కష్టంతో వ్యాపారం అభివృద్ధి చేసాడు.

*   *   *

దుర్యోధనాదులు కష్టపడకుండా ధనాన్ని అనుభవించాలనుకున్నారు. అందుకోసం పాండవులను ఎన్నో కష్టాలపాలు చేశారు. కాని చివరకు సర్వం పోగొట్టుకుని కురుక్షేత్ర యుద్ధంలో నూరుగురు సోదరులు మరణించారు. కష్టపడి సంపాదించితేనే ధనం విలువ తెలుస్తుంది. అంతేకాని తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తులు, అన్నల నుంచి అక్రమంగా తీసుకున్న ధనం, స్త్రీ నుంచి కట్నంగా వచ్చిన ధనం... ఇవన్నీ కూడా అధమమే. స్వయంగా సంపాదించుకున్న ధనం మాత్రమే ఉత్తమమైన ధనం అని ఈ సుభాషితం బోధిస్తోంది. 
 

- డా. పురాణపండ వైజయంతి
ఫోన్ : 80085 51232