సకల కలా విభూషితులు శబ్దవిదుల్ నయతత్త్వ బోధకుల్
ప్రకట కవీంద్రులే నృపతి పజ్జను నిర్ధనులై చరింతు రా
వికృతపుజాడ్య మా దొరది విత్తము లేకయ వారు పూజ్యులం
ధకజన దూషితంబులు ఘనంబులు గావె యమూల్యరత్నముల్
‘కళలయందు పండితులై వ్యాకరణము మొదలగు శాస్త్రపారంగతులై, నీతి శాస్త్ర పద్ధతులను బోధించువారు, గొప్ప కవులు అయినవారు ఏ ప్రభువు వద్దనైనను ధనహీనులైన పేదలుగా ఉండిన యెడల అది ఆ ప్రభువు యొక్క దోషమే గానీ వారిది కాదు. రత్న పరిజ్ఞానము లేని వర్తకుడు అమూల్య మణులను తక్కువ విలువ కలిగినవానిగా చెప్పినంత మాత్రమున ఆ రత్నముల విలువ తగ్గదు కదా...’ అని భర్తృహరి నీతిశతకం (తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి) చెప్తోంది.
ఉదాహరణకు ఒక ఏనుగు మందగమనంతో నడుస్తూ ఉంటే ఆ వెనుకే కుక్కలు తోక లాగుతూ, మొరుగుతూ వెళ్తుంటాయి. అయినంత మాత్రాన ఏనుగు గొప్పదనం ఏ మాత్రం తగ్గదు. ఏనుగు కూడా తోకను అదిలించుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఒక్క కుక్కకు కూడా అపకారం చేయదు. గొప్పవారిని నిందించేవారి గురించి ఈ ఉదాహరణను వాడటం తెలిసిందే. ఒకరు తక్కువ చేసినంత మాత్రాన, గొప్పవారికి కలిగే చేటు ఆవ గింజ అంతయినా ఉండదని పెద్దలు చెప్తారు.
శ్రీకృష్ణదేవరాయల కొలువులో అష్టదిగ్గజములు, భోజరాజు ఆస్థానంలో నవరత్నాలు... పేరుతో పండిత సభ ఉండేది. ఆయా రాజులు కవులు, పండితులు, కళాకారులను పోషించారు. అందువల్ల వారికి ఎటువంటి గౌరవభంగము కలుగలేదు. కాని కొందరు రాజుల పరిపాలనలో పండితులకు, కళాకారులకు సన్మానాలు జరగలేదు. బృహత్కథ రచించిన గుణాఢ్యుడు తనకు జరిగిన అవమానం భరించలేక, తన కావ్యాన్ని హోమంలో వేసేశాడు. శిష్యులు ఆ విషయం గమనించి వెంటనే ఆ కావ్యాన్ని హోమం నుంచి బయటకు తీశారు. అప్పటికే కొంత కావ్యం అగ్నికి ఆహుతి అయిపోయింది. రాజు ఆదరించనంత మాత్రాన గుణాఢ్యుడు కవి కాకపోడు. ఇటువంటివి చరిత్రలో చాలానే కనపడతాయి.
ఇక ప్రస్తుత ఆలోచనా విధానం పరిశీలిస్తే...
రామాయణంలోని రాముడిని ఎవరి చిత్తానికి వచ్చినట్లు వారు దూషిస్తూనే ఉన్నారు. చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని సంహరించాడని, విభీషణుడి సాయం కారణంగా లంక గుట్టు తెలుసుకుని రావణుడిని సంహరించాడనీ, భార్యను అనుమానించాడని, నిండు చూలాలని కూడా చూడకుండా అరణ్యవాసానికి పంపేశాడని... ఇలా ఎన్నో రకాలుగా ఎవరికి తోచిన విధంగా వారు కువిమర్శలు చేస్తూనే ఉన్నారు.
రాముడిని ఎవరు ఏ విధంగా మాట్లాడినా, ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే శిలా శాసనాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు. వాల్మీకి రామాయణాన్ని విమర్శనాత్మకంగా చదవకుండా, అటు తరువాత పుట్టుకొచ్చిన అభూత కల్పనల రామాయణాన్ని, రాముడిని విమర్శించిన రామాయణాన్ని చదివి, అదే వాస్తవమనుకుంటే అది వాల్మీకి దోషం కాదు. అందుకే రాముడు రత్నంలాగ విలువ తగ్గకుండా ఉంటూనే ఉన్నాడు.
శ్రీకృష్ణుని విషయానికి వస్తే...
మానవజాతికి భగవద్గీత అనే వ్యక్తిత్వ వికాస గ్రంథం అందించాడు శ్రీకృష్ణుడు. పాండవులకు ధర్మబోధ చేశాడు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, అక్కడ ప్రత్యక్షమై న్యాయం చేకూర్చాడు. ద్రౌపదికి అవమానం జరుగకుండా చీరలు ఇచ్చి ఆవిడ మానాన్ని కాపాడాడు. పాండవులకు ప్రాణసంకటం కలిగినప్పుడల్లా శ్రీకృష్ణుడు తరుణోపాయం చెప్పి కాపాడాడు. తన బాల్యమిత్రుడైన సుదామునికి సంపదలు చేకూర్చాడు. అటువంటి శ్రీకృష్ణుడిని, ‘స్త్రీ లోలుడు’ అంటూ నిందిస్తూ ఆనందించేవారూ ఉన్నారు. శ్రీకృష్ణతత్త్వాన్ని అర్థం చేసుకోకుండా ఈ విధంగా దూషించినప్పటికీ శ్రీకృష్ణుడిని భగవద్గీతాకారుడిగానే గుర్తించాలి.
చంద్రగుప్తుడిని మౌర్య సామ్రాజ్య సింహాసనంపై కూర్చుండబెట్టిన చాణుక్యుడు కూడా ఎన్నో నిందలకు గురయ్యాడు. సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి నిస్వార్థంగా కృషిచేశాడు చాణుక్యుడు. ఇటీవలి కాలంలో మన దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన పి.వి. నరసింహారావుకు అవమానం తప్పలేదు. కాని భారతదేశం ఈరోజు ఆర్థిక మాంద్యం నుండి తప్పించుకోగలగటానికి, ఆనాడు పి. వి. నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలే కారణమని నేటికీ ఆర్థికవేత్తలు ప్రశంసిస్తూనే ఉన్నారు. నిన్న కాక మొన్న జరిగిన నంబి నారాయణన్ విషయంలో కూడా ఇదే జరిగింది.
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్న చందాన, మన దగ్గర ఉన్న పండితులను, మేధావులను గుర్తించకపోవటం అనాదిగా జరుగుతూనే ఉంది. అయినంతమాత్రాన వారి మేధావితనానికి వచ్చిన నష్టమేమీలేదని ఈ పద్యం సారాంశం.
- డా. పురాణపండ వైజయంతి
ఫోన్ : 80085 51232