విశ్వాసం.. మాటలే మనిషికి అలంకారం : పురాణపండ వైజయంతి

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న్న చన్ద్రోజ్వలా

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్థజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌

కిరీటాలు, భుజకీర్తులు, సూర్యచంద్రహారాలు, ఇతర నగిషీ నగలు గాని, పరిమళ భరితద్రవ్యాలతో స్నానం గాని; చందన సుగంధ వస్తువులు శరీరానికి అద్దుకోవడం వల్లగాని; సువాసనభరిత పుష్పహారాలు ధరించడం లేదా చిత్రవిచిత్ర గతులతో కురులను దువ్వుకోవడం వల్ల గాని పురుషోత్తమునికి అలంకారాలుగా అందాన్ని ఇవ్వవు. శాస్త్ర సంస్కారం చేత మధురమైన వాక్కు ఒక్కటే అతనికి గొప్ప అలంకారమై ప్రకాశిస్తుంది. 

బంగారం వెండి రత్నాభరణాలు నశిస్తాయి కాని, వాక్కు అనే అలంకారం ఎన్నటికీ వాడిపోనిది, నశించనిది. మనిషికి నిత్యమైనది, సత్యమైనది అతని వాక్కే. కనుక ‘మాటల చేత మన్నన పొందవచ్చు’ అంటాడు భర్తృహరి తన సుభాషితాలలో. ఒక వ్యక్తి యొక్క సామాజిక అస్థిత్వ ఉత్థాన పతనాలకు అతని మాట తీరు, భావాలను పలికించే విధానమే ప్రధానకారణమై ఉంటుంది, అతని అందచందాలు, సంపదలు, ఆభరణాలు కాదు... అంటున్నాడు కవి ఈ శ్లోకంలో.

వాల్మీకి, వ్యాసుడు, నారదుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు... వంటి మన మహర్షులు నార వస్త్రాలు, గడ్డాలు, మీసాలు ధరించారు. శరీరానికి ఎటువంటి అలంకారాలు లేవు. కాని వారి నోట వెలువడిన మాటలు వారికి అలంకారంగా నిలిచిపోయాయి. వారిని చిరంజీవులను చేశాయి. ‘వ్యాసోచ్చిష్టం జగత్సర్వమ్‌’ అన్నారు. ఆయన అందించిన భారత, భాగవత, అష్టాదశ పురాణాలు... ఇవన్నీ నేటికీ నశించకుండా ఉండిపోయిన భూషణాలు. 
 

శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, విద్యారణ్యుడు, చాణుక్యుడు, రామకృష్ణపరమహంస, వివేకానందుడు... ఇలా ఎంతోమంది మహనీయులు మనలను జాగృతం చేశారు. వీరందరికీ వాక్కులే నిజమైన భూషణాలు, నశించకుండా మిగిలిపోయేవి ఆ అలంకారాలేనని భర్తృహరి చెబుతున్నాడు. 

కొందరు వారి శరీరాన్ని బంగారంతోను, వెండితోను, పట్టు వస్త్రాలతోను అలంకరించుకుంటారు. వాటిని చూసి, తమంతవారు లేరని మిడిసిపడుతుంటారు. ఇతరులతో జరిపే సంభాషణలో సైతం అహంకారం ప్రదర్శిస్తుంటారు. ఆ అలంకారాలన్నీ తాత్కాలికమైనవేనని తెలుసుకోలేకపోతారు. ఎన్ని సంపదలున్నా.. ఒక్క మంచి మాట పలికితేనే వారికి అది అలంకారమవుతుందని భావించలేకపోతారు. ఇందుకు ఒక కథ మంచి ఉదాహరణగా కనిపిస్తుంది.

ఒక ఊరిలో ఒకనాడు బాగా మదించిన ఏనుగుని సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆ రోజు ఆ ఏనుగు మీద ఒక సాధువుని ఊరేగించటం కోసం ఇంత అలంకారం చేశారు. ఆ ఏనుగు మీద సాధువును సాదరంగా కూర్చోపెట్టి, ఊరంతా వైభోగంగా ఊరేగించారు. ఆ ఏనుగు ఎంతో మురిసిపోయింది. ‘నేను గొప్పదాన్ని కాబట్టే కదా ఇంత అందంగా అలంకరించి నన్ను ఊరేగిస్తున్నారు. 

అందరూ నాకు నమస్కారాలుచేస్తున్నారు’ అని విర్రవీగింది. ఆ రోజు సాయంత్రం వరకు ఆ ఏనుగు మీద సాధువును ఊరేగించారు. సాయంత్రానికి ఏనుగును గజశాలకు పంపించారు. మరుసటి రోజు నుంచి ఏనుగును సాధారణంగానే చూశారు.  సాధువును మాత్రం ఎంతో గౌరవంగా అనుదినం సత్కరిస్తూనే ఉన్నారు.

తన మీద కూర్చున్న సాధువుని గౌరవించారని, తన అలంకారం దర్పం చూసి తనను గౌరవించలేదని ఆ ఏనుగుకు అర్థం అయింది. మంచి మాటకు అంత విలువ ఉంటుందని, ఎంత అలంకరించుకున్నా, ఎన్ని సంపదలున్నా, ఎన్ని ఆభరణాలు ధరించినా, మంచి మాటకు సాటిరావని ఏనుగు అర్థం చేసుకుంది.

మహాభారతంలో విదురుడు చెప్పిన నీతివాక్యాలు ఇప్పటికీ అనుసరణీయాలు. విదురుడు దాసీ పుత్రుడే కదా అని అతనికి గౌరవం తగ్గలేదు. అతని జన్మకు కాని, అతని వస్త్ర ధారణకు గాని సంబంధం లేకుండా, విదురుడు పలికిన మంచి మాటలకు మాత్రమే విలువ ఉంది కాబట్టే, నేటికీ విదురనీతి పేరున ఆ వాక్యాలు అందరం వింటూనే ఉన్నాం.

శ్రీకృష్ణభగవానుడు పలికిన గీతావాక్యాలే నేటికీ ఆయనను జగద్గురువుగా నిలబెడుతున్నాయి. భర్తృహరి, వేమన, బద్దెన, మారద వెంకయ్య, రామదాసు, త్యాగయ్య... వీరందరూ మానవాళికి సూక్తులు బోధించారు. ఆ కారణంగానే నేటికీ చరిత్రలో నిలిచిపోయారు. ఆదికవి నన్నయ మహాభారతంలో కావలసినన్ని మంచిమాటలు పలికి, ‘నానా రుచిరార్థ సూక్తి నిధి’ అనే బిరుదు పొందాడు. అందుకే మంచి మనిషికి ఒక్కమాట చాలు అని పెద్దలు పలికారు. 
- డా. పురాణపండ వైజయంతి
ఫోన్ : 80085 51232