ఎప్పుడూ మన పక్కనే ఉంటారు. చాలా నమ్మకస్తుల్లా వ్యవహరిస్తుంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. మనసులో మాటలన్నీ విని, శత్రువులకు మోస్తారు. దగ్గరకు వచ్చి.. 'మీరెంత మంచివాళ్లు' అని పొగుడుతారు. ఇలా.. వినయ విధేయతలు ప్రకటించే కొందరిలో స్వార్థం అభిమానం, మీకోసం ఏదైనా చేస్తాం" అనే ఉండొచ్చు, దెబ్బతీయాలనే కుట్ర ఉండొచ్చు. బ్లాక్ మెయిల్ చేసి అవసరాలకు ఉపయోగించుకునే స్వభావం ఉండొచ్చు!
నిజమైన ఉద్వేగాలను ఎవరైతే కప్పిపుచ్చుకుంటారో వాళ్లే ఎదుటి వాళ్లతో నటిస్తుంటారు, లోపల ఒక విధంగా, బయట మరో విధంగా ఉంటారు. ఇలాంటి వాళ్లు 'మాకు మేమే ముఖ్యమనుకుంటారు. వాళ్ల పనుల కోసం ఇతరులను ప్రభావితం చేస్తారు. ప్రతిదీ వాళ్లకు అనుకూలంగా జరగాలనుకుంటారు. ఇలాంటి వాళ్లను గుర్తించాలి. వాళ్ల స్వార్ధ పూరితమైన వినయం నుంచి బయటపడాలి. లేదంటే వ్యక్తిగతంగా చాలా కోల్పోవాల్సి వస్తుంది.
ప్రవర్తన
కేవలం వ్యక్తిగత స్వార్థంతో దగ్గరయ్యేవాళ్లు వాళ్ల పని అయ్యే వరకు రోజూ ఫోన్లు చేస్తారు. 'గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్' చెప్తారు. ప్రతి నిమిషం టచ్ లో ఉంటారు. వాళ్ల జీవితంలోని ప్రతిదీ షేర్ చేసుకుంటున్నట్లు మాట్లాడతారు. ప్రతి మాటలో, పనిలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు, సర్వం వాళ్లే అయినట్లు ప్రవర్తిస్తారు. పని అయ్యాక, కావాల్సిన ప్రతిఫలం పొందాక దూరం అవుతారు. ఫోన్ ఎత్తరు, ఒకవేళ మాట్లాడినా సాకులు చెప్తారు. అవసరం కోసం పర్సనల్ రిలేషన్ను కూడా వాడుకుంటారు. పరిస్థితులను వాళ్లకు అనుకూలంగా మార్చేసుకుంటారు. ఎదుటి వాళ్ల ఫీలింగ్స్ వాళ్లకు పని ఉండదు. వాళ్ల ఎదగడం కోసం పరిస్థితులను, వ్యక్తులను గురించి పట్టించుకోరు. వాళ్ల వినయం వెనక విషం పూసిన కత్తి ఉంటుంది.
కారణాలెన్నో..
వినయాన్ని నటిస్తూ మోసం చేసేవాళ్లు పైకి బుద్ధిగా, మంచిగా కనిపిస్తారు. మొదట్లో స్వలాభం కోసం చిన్నచిన్న సాయాలు చేస్తారు. 'మేము మంచివాళ్లం, మీరు అంటే చాలా అభిమానం, మీకోసం చేస్తాం అనే నమ్మకం కలిగిస్తారు. మంచికే కాదు చెడుకూ తలూపుతారు. అలాగని వీళ్లకు సొంత అభిప్రాయాలు ఉండవు. ఎప్పటికప్పుడు వీళ్ల అవసరాలు.. వ్యక్తుల అభిప్రాయాలు, కోరికలకు అనుకూలంగా మారిపోతుంటాయి. విలువలు, నిబద్దత ఉండవు. సమయం, సందర్భం, అవకాశాలకు అనుకూలంగా మాట్లాడుతుంటారు. ఎదురుగా వినయం.
నటించి, మరొకరి దగ్గర వాళ్ల గురించి చెడుగా చెబుతుంటారు. రహస్యాలను చేరవేస్తుంటారు. పైకి మాత్రం గుంబనంగా కనిపిస్తారు. డ్యూయల్ పర్సనాలిటీస్ లాగా ప్రవర్తిస్తారు. అయితే అంతా తెలిసే చేస్తుంటారు. వ్యక్తిగత స్వార్థం, గుర్తింపు. డబ్బు, పేరు, పై స్థాయికి ఎదడగం.. లాంటి స్వలాభాల కోసం అలా నటిస్తుంటారు.
నిజం బయటపడితే.. ఒంటరి
వినయం నటించి కావాల్సిన పనులు చేయించుకునే వాళ్లు అందరితో ఎక్కువకాలం సంబంధాలు కొనసాగించలేరు. వాళ్లు అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లతోనే ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ల మధ్య ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు. అవసరాల కోసమే సంబంధాలు కొనసాగిస్తారు. అయితే ఎప్పుడో ఒకప్పుడు తప్పుక తమ తప్పులు తెలుసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దాంతో మంచివాళ్లకు సైతం దూరం అవుతారు. మనస్ఫూర్తిగా సాయం చేసేవాళ్లు ఉండరు.
దాంతో ఉద్వేగానికి గురవుతారు. కొన్నిసార్లు ఎగ్రెసివ్గా తయారవుతారు లేదా పూర్తి డిప్రెషన్కు లోనవుతారు. అనుకున్నది జరగలేదు. కావాల్సింది దక్కలేదని కుంగిపోతారు. మానసిక సమస్యలతో సతమతమవుతారు. అలాంటి వాళ్లకు ఎప్పటికీ నిజమైన ప్రేమాభిమానాలు దొరకవు. ఒంటరిగా మిగిలిపోతారు.
దూరం పెట్టాలి
మొదట వినయం నటిస్తూ తర్వాత మోసం చేసే వాళ్లను మొదట్లో గుర్తించడం కష్టం. కానీ మోసం చేసే వాళ్లది ఎంత తప్పో, మోసపోయే వాళ్లది కూడా అంతే తప్పు. ఏ రిలేషన్తో అయినా మరొకరు దగ్గరవుతున్నారు అంటే కచ్చితంగా వాళ్ల ప్రవర్తన గురించి ఆలోచించాలి.
'ఎందుకు దగ్గరవుతున్నారు? ఎందుకు అభిమానంగా మాట్లాడుతున్నారు? ఆ అభిమానం నిజమైందా? కాదా?..' అని గమనించాలి. స్నేహితుల్లో, చుట్టాల్లో... ఉద్యోగం చేసే చోట. ఇంటి పక్కన... ఎక్కడైనా సరే ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు తప్పకుండా ఉంటారు. వాళ్లను గుర్తించి దూరం పెట్టాలి. లేదంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వ్యక్తిగత విషయాలన్నీ వాళ్ల వల్ల బయటపడి, పరువు మర్యాదలు పోవచ్చు. అలాంటి వాళ్లను పసిగట్టిన తర్వాత పూర్తిగా దూరం పెట్టాలి. అలా పెట్టలేకపోతే వాళ్లలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ మానసికంగా వాళ్ల రిలేషన్ ఇన్వాల్వ్ కాకూడదు.