పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం

భారత రాజకీయ వ్యవస్థ పార్లమెంట్, విదానసభల ఫిరాయింపుల ద్వారా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఎక్కువ అస్థిరతను, గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. 1985లో రాజీవ్​గాంధీ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఫిరాయింపుల వ్యతిరేకతపై 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీనిని రాజ్యాంగంలో 10వ షెడ్యూల్​లో చేర్చారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్స్​ 101, 102, 190, 191లు కూడా పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతాయి. 10వ షెడ్యూల్​కు సంబంధించి సందర్భానుసారంగా కొన్ని పదాలకు అన్వయింపు ఇలా ఉంటుంది. ఎ. సభ అంటే పార్లమెంట్​లోని ఉభయ సభలు లేక రాష్ట్ర శాసనసభ (రెండు శాసనసభలున్నట్ల యితే రెండు శాసనసభలు) బి. శాసనసభ పార్టీ అంటే ఒక చట్టసభలో ఒక నిర్దిష్ట సమయానికి ఒక రాజకీయ పార్టీకి గల సభ్యుల మొత్తం. 


ఒక రాజకీయ పార్టీకి చెందిన చట్టసభల్లోని సభ్యుడు ఆ సభ సభ్యత్వానికి అనర్హుడవుతాడు. ఆ సందర్భాలు..  ఆ సభ్యుడు స్వచ్ఛందంగా ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేయడం (లేక)  తాను ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ ఆదేశాలకు భిన్నంగా సభలో ఓటు వేయడం లేక గైర్హాజరవడం వల్ల పార్టీ సభ్యత్వం రద్దు అవుతుంది.  కానీ అతని సభ సభ్యత్వం రద్దు కాదు. నామినేటెడ్​ సభ్యులకు సంబంధించి  నామినేట్ అయిన​ఆ సభ్యుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడైతే, ఆ పార్టీ సభ్యుడిగా పరిగణిస్తారు. పదవీ ప్రమాణం చేసిన ఆరు నెలల్లోపున మొదట ఏ పార్టీ సభ్యత్వాన్ని పొందితే, ఆ పార్టీ సభ్యుడిగానే పరిగణిస్తారు 

నామినేటెడ్​ సభ్యులు: నామినేటెడ్​ సభ్యుడు ప్రమాణం చేసిన ఆరు నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యుడిగా చేరినట్లయితే, అతని సభ్యత్వం రద్దవుతుంది.  ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తి  ఆ తర్వాత ఏదైనా ఇతర రాజకీయ పార్టీలో చేరినట్లయితే ఆ సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది.  స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి, గెలిచిన తర్వాత రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకున్న సభ్యులకూ తర్వాత ఇతర పార్టీలోకి వెళ్తే సభ్యత్వం రద్దవుతుంది. 

మినహాయింపులు: ఈ షెడ్యూల్​లో ఏమి పేర్కొన్నా లోక్​సభ స్పీకర్​, డిప్యూటీ స్పీకర్​గా ఎన్నికైన వారికి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గాకు, రాష్ట్ర శాసన మండలి చైర్మన్​, రాష్ట్ర శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్​లకు ఈ షెడ్యూల్​ వర్తించదు. ఆ సందర్భం ఏమిటంటే  పైన పేర్కొన్న పదవులకు ఎన్నిక కావడం వల్ల  ఆ వ్యక్తి తన రాజకీయ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భాలు. అయితే ఆ పదవిలో కొనసాగినంత కాలం ఆ వ్యక్తి  రాజకీయ పార్టీలో గానీ లేక మరేదైన రాజకీయ పార్టీలో గాని చేరొద్దు (లేక)  పైన పేర్కొన్న పదవులకు ఎన్నికైనందు వల్ల తన రాజకీయ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సభ్యుడు, ఆ పదవి పోయిన తర్వాత తిరిగి తన పూర్వ రాజకీయ పార్టీలో చేరిన సందర్భాలు. 

ఫిరాయింపుల వల్ల అనర్హతలు:  ఫిరాయింపుల చట్టం కింద సభ్యుడిగా కొనసాగే అర్హతను ఒక సభ్యుడు కోల్పోయాడా లేదా అన్న అంశం వివాదాస్పదమైనప్పుడు సందర్భానుసారంగా సభ చైర్మన్​ లేదా సభాపతి నిర్ణయమే అంతిమ నిర్ణయం. 

అనర్హతలపై న్యాయస్థానాలకు విచారణాధికారం లేదు: ఈ చట్టం కింద ఒక సభ్యుని అనర్హతకు సంబంధించిన ఎలాంటి అంశంపైనా ఏ న్యాయస్థానం విచారణ జరుపరాదు.  పార్టీ ఫిరాయింపు, పార్టీలో చీలిక, పార్టీ విప్​ను ధిక్కరించి ఓటు వేయడం లేక గైర్హాజరు కావడం మొదలైన అంశాలు వివాదాస్పదంగా మారినప్పుడు, ఆ వివాదాలపై అంతిమ నిర్ణయం స్పీకర్​కు వదిలేయడం జరిగింది. 

నిబంధనలు: ఈ చట్టం అమలుకు సంబంధించి కింది అంశాలపై సభ అధ్యక్షుడు (లేక) సభాపతి అవసరమైనప్పుడు నిబంధనలు రూపొందించవచ్చు. వివిధ రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలకు సభలో గల సభ్యుల వివరాలు. ఫిరాయింపులకు పాల్పడిన తన పార్టీకి చెందిన సభ్యుణ్ని క్షమించిన విషయాల గురించి ఆ పార్టీ శాసనసభ పార్టీ నాయకుడు ఎన్ని రోజుల లోపల ఎవరికి పంపించాలనే విషయం.  ఏదైనా చట్టసభలోని సభ్యులు ఒక రాజకీయ పార్టీలో చేరినట్లయితే, ఆ విషయాన్ని ఆ రాజకీయ పార్టీ ఎవరికి, ఎప్పటి లోపల రిపోర్టు చేయాలనే విషయం. ఆ సభలో ఆ మోదం పొందిన తర్వాత 30 రోజుల నుంచి నిబంధనలు అమలులోకి వస్తాయి. 


91వ రాజ్యాంగ సవరణ: మంత్రివర్గ సంఖ్యను తగ్గించడానికి, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మరింత శక్తిమంతం చేయడానికి కింది వాటిని రూపొందించారు. ఇది 2004 నుంచి అమలులోకి వచ్చింది. 

కేంద్ర మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్య ప్రధాన మంత్రితో కలిపి లోక్​సభ సభ్యుల సంఖ్యలో 15శాతం మించరాదు. పార్లమెంట్​లోని ఏ సభకి చెందిన సభ్యుడైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా తేలితే, ఆ సభ్యుడు మంత్రి కావడానికి కూడా అనర్హుడిగా ప్రకటించబడతాడు. ఒక రాష్ట్రంలోని మొత్తం మంత్రుల సంఖ్య, ముఖ్యమంత్రితో కలుపుకొని ఆ రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15శాతం దాటరాదు. 

కానీ ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువ ఉండరాదు. ఒక రాష్ట్రంలోని ఏ సభకు చెందిన సభ్యుడైనా ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా తేలితే ఆ సభ్యుడు మంత్రి కావడానికి కూడా అనర్హుడు అవుతాడు. ఏ సభకు చెందిన సభ్యుడైనా అనర్హుడిగా మారితే, ఆ సభ్యుడు ప్రతిఫలాన్నిచ్చే ఎలాంటి రాజకీయ పదవికి పోయినా అనర్హుడు అవుతాడు.  

రాజకీయ పార్టీల విలీనం: ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో విలీనమైనప్పుడు ఆ పార్టీకి చెందిన చట్టసభల్లోని సభ్యుల సభ్యత్వం రద్దు కాదు. విలీనమైన పార్టీ సభ్యులు తామూ తమ పార్టీ ఏ పార్టీలో విలీనమైందో, ఆ పార్టీలో చేరినట్లు.  తమ పార్టీ మరో పార్టీతో విలీనం కావడాన్ని తాము ఆమోదించడం లేది, తాము ఒక ప్రత్యేకమైన గ్రూపుగా కొనసాగుతామని ప్రకటించడం. వేరొక పార్టీలో విలీనం కావాలని ఏ పార్టీ నిర్ణయించుకున్నదో, ఆ పార్టీకి చెందిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల సభ్యులు (2/3) విలీనానికి అంగీకరించాలి. 


సుప్రీంకోర్టు తీర్పులు 

పశుపతినాథ్​ సుకుల్​ వర్సెస్​ నేమ్​చంద్ర జైన్​ కేసు: రాజ్యసభ సభ్యుని ఎంపిక, రాష్ట్రపతి ఎన్నికలు శాసనసభ వెలుపలి వ్యవహారం కాబట్టి వీటికి అనర్హత వర్తించదు. 


కిహోటో హాల్లోహాన్​ వర్సెస్​ జాచిల్హూ కేసు: లోక్​సభ, రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యుల భావ ప్రకటన స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను 10వ షెడ్యూల్లో హరిస్తుంది. 


తీర్పు: 10వ షెడ్యూల్​ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. కాబట్టి స్వేచ్ఛకు, హక్కులకు ఎలాంటి ప్రమాదం లేదు. 

సమస్య: ఫిరాయింపుల అనర్హత విషయంలో స్పీకర్​ లేదా చైర్మన్​దే అంతిమ నిర్ణయమా?


తీర్పు: ఫిరాయింపుల అనర్హత విషయంలో స్పీకర్​ లేదా చైర్మన్​దే అంతిమ నిర్ణయం, అయితే హైకోర్టు, సుప్రీంకోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చు. 
రవి.ఎస్​. నాయక్​ వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా: ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత పొందడానికి వారి పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సభ్యుల ప్రవర్తన తమ సొంత పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉంటే వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. ఈ కేసులో స్వచ్ఛంద విరమణ అనేది పదవీ విరమణ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. 

జి.విశ్వనాథన్​ వర్సెస్​ స్పీకర్​, తమిళనాడు అసెంబ్లీ: లోక్​సభ, విధానసభ సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు అతను ఆ సభకు చెందని వ్యక్తిగానే పరిగణించాలి. కానీ అతను తన పాత రాజకీయ పార్టీలో సభ్యుడుగానే కొనసాగుతాడు. ఒకవేళ అతను వేరొక రాజకీయ పార్టీలో చేరితే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగానే వదులుకున్నట్లు పరిగణిస్తారు. కాబట్టి ఆ సందర్భంలో అతను అనర్హతకు అర్హుడవుతాడు. 


కులదీప్​ నాయర్​ వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసు: రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుడు తన పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఓటు వేసినా 10వ షెడ్యూల్​ కింద అనర్హత వర్తించదని రాష్ట్ర శాసనమండలి సభ్యుల ఎన్నిక విషయంలో మాత్రం అనర్హత వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.