ఎడ్యుకేషన్​ హబ్​గా..పాలమూరు

  •     నిట్  ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రపోజల్స్
  •     సానుకూలంగా స్పందించిన సెంట్రల్  సర్కారు
  •     రెండు, మూడేండ్లలో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు
  •     పీయూ పరిధిలో లా, ఇంజనీరింగ్  కాలేజీల ఏర్పాటుకు సన్నాహాలు

మహబూబ్​నగర్, వెలుగు : విద్యపరంగా వెనుకబడిన పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్  హబ్​గా మార్చేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్  నియోజకవర్గంలో ఇటీవల పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, డిగ్రీ, జూనియర్  కాలేజీలకు శంకుస్థాపన చేయగా, తాజాగా పాలమూరులో నేషనల్  ఇనిస్టిట్యూట్  ఆఫ్  టెక్నాలజీ(నిట్) ఏర్పాటు చేసేందుకు మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పాలమూరు వర్సిటీ పరిధిలో త్వరలో లా, ఇంజనీరింగ్  కాలేజీలు కూడా ఏర్పాటు కానున్నాయి.

వడివడిగా అడుగులు..

ప్రస్తుతం రాష్ట్రంలో వరంగల్​లో మాత్రమే నిట్ అందుబాటులో ఉంది. గత ప్రభుత్వం పదేండ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో  విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  ప్రభుత్వం మహబూబ్​నగర్​లో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చొరవతో పాలమూరులో నిట్  ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రపోజల్​ను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొద్ది రోజుల కింద కేంద్రానికి పంపారు. కేంద్రం కూడా ఈ ప్రపోజల్​పై సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

సీఎం కూడా తన జిల్లాలో నిట్  ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇవ్వడంతో, రానున్న రోజుల్లో నిట్  ఏర్పాటు కావడం ఖాయమని కాంగ్రెస్​  నేతలు చెబుతున్నారు. దీనికితోడు నిట్  ఏర్పాటుకు పాలమూరు అనువైన ప్రాంతమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. హైదరాబాద్  నుంచి బెంగళూరు వరకు ఉన్న హైవే 44 పాలమూరు మీదుగా వెళ్తుండడం, శంషాబాద్  ఎయిర్ పోర్టుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండడం, రీజినల్  రింగ్  రోడ్డు కూడా ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతం నిట్  ఏర్పాటుకు అనువైందిగా చెబుతున్నారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు..

నిట్  ఏర్పాటైతే పాలమూరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానుంది. దీన్ని పాలమూరులో ఏర్పాటు చేయడం వల్ల ప్రతి డిపార్ట్​మెంట్​తో పాటు కంప్యూటర్, టెక్నికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్​మెంట్లలో ఉద్యోగావకాశాలు స్థానికులకే దక్కుతాయి. అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్  ప్రొఫెసర్లు అందుబాటులో ఉండడం వల్ల మెరుగైన విద్య అందనుంది. అలాగే మల్టీ నేషనల్  కంపెనీలు నిట్​లో చదువుకునే స్టూడెంట్లకు ముందుగానే క్యాంపస్  ఇంటర్య్వూలు నిర్వహించి ప్యాకేజీలు చెల్లించి సెలెక్ట్  చేసుకుంటాయి. దేశ, విదేశాల నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్లు చదువుకునేందుకు వచ్చే అవకాశాలుండడంతో స్థానికంగా వ్యాపారాలు కూడా పెరగనున్నాయి. 

పీయూకు మంచి రోజులు..

త్వరలో పాలమూరు యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజనీరింగ్  కాలేజీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే ఇటీవల పీఎం ఉషా స్కీం కింద రూ.వంద కోట్ల ఫండ్స్​ మంజూరయ్యాయి. రూ.20 కోట్ల నిధులకు ప్రపోజల్స్ పంపగా, కేంద్రం అడిషనల్​ ఫండ్స్​ మంజూరు చేస్తున్న విషయం తెలుసుకొని ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్లి అక్కడ యూజీసీలోని ఆఫీసర్లకు కలిశారు. అడిషనల్​ ఫండ్స్​  మంజూరు చేయాలని కోరడంతో, వారు సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేశారు. 

ఎడ్యుకేషన్​ను డెవలప్  చేయాలె..

పాలమూరు జిల్లాను గత పాలకులు పట్టించుకోలేదు. జిల్లాలో ఎడ్యుకేషన్  సిస్టంను డెవలప్  చేయాలనే టార్గెట్  పెట్టుకున్నా. ఇక్కడి స్టూడెంట్లు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో నిట్  ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు చేశా. త్వరలో అది సాకారం అవుతుంది. ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వస్తుంది.

 యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్​నగర్