హైదరాబాద్ ‘ఫిరంగి నాలా’ను అభివృద్ధి చేయాలి

నిజాం 1872వ సంవత్సరంలో ఫ్రెంచ్‌‌, ఇంగ్లీష్‌‌ ఇంజినీర్ల సలహాలతో రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు తాగు, సాగునీరు అందించేలా ఫిరంగి నాలా కాలువను నిర్మించాడు. షాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వరకు తవ్వించిన నీటి కాలువ ద్వారా ఆరోజుల్లో వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చారు. ఈ కాలువ దక్షిణ చందనవెల్లి, సోలిపేట,రామానుజపూర్, నానాజ్‌‌పూర్, జూకల్, నర్రూడ, ఊట్‌‌పల్లి, శంషాబాద్, ఉందానగర్, వెంకటాపూర్, మంగల్‌‌పల్లి మీదుగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో కలుస్తుంది. షాబాద్‌‌ మండలం చందన్‌‌వల్లి గ్రామానికి తూర్పున చేవెళ్ళ, మొయినాబాద్‌‌ మండలాల సరిహద్దుల్లో ‘ఈసీ’ నదిపై సర్వే నంబర్‌‌ 160లో సుమారు రెండు ఫర్లాంగుల పొడవున 48 మీటర్ల వెడల్పు, 85 కిలోమీటర్ల పొడవుతో ఈ ఆనకట్ట నిర్మించారు.

కాలువ పొడవునా అన్ని మండలాల్లోని పలు చెరువులకు నీటిని అందించే విధంగా ఈ కాలువ నిర్మాణం జరిగింది. వికారాబాద్ అడవులు, అనంతగిరి కొండల నుంచి ప్రవహిస్తున్న మూసీ,- ఈసా నదులు 1908లో హైదరాబాద్​ను వరదలతో ముంచెత్తాయి. వరద ముంపు నుంచి ఈసా నది ప్రవాహాన్ని మళ్లించి ఆ నీరును హైదరాబాద్​కు తాగు సాగునీరు అందించేవిధంగా నిర్మించినదే ఫిరంగి నాలా.  కృష్ణా, గోదావరి నదుల జలాల మీద ఉన్న శ్రద్ధ దీనిపై లేదు.150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కాంటూర్ (సమాంతర) నాలా స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాద్ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు.

గత ప్రభుత్వం చెరువులను పునరుద్ధరిస్తామని మిషన్ కాకతీయ అనే పథకాన్ని ప్రారంభించినా ఈ నాలా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మూసీ నది సుందరీకరణ పేరుతో అభివృద్ధి పనులు చేపట్టింది. నది జన్మస్థలం వికారాబాద్ అనంతగిరి కొండల నుంచి ఒక మూసీ నది మాత్రమే కాకుండా మూసీ, ఈసా రెండు జంట నదులు అక్కాచెల్లెళ్ళ అభివృద్ధి అందులో భాగంగా ఫిరంగి నాలా కూడా అభివృద్ధి చేయాలి.  హైడ్రా వ్యవస్థ కూడా ఈ ఫిరంగి నాలా, బల్కాపూర్ నాలాలపై అక్రమ కట్టడాలు, కబ్జాలపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది.     

  బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు