బీర్కూర్, వెలుగు : తల్లి చనిపోయిన పది రోజులకే ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఇరు కుటుంబాల వారు పరస్పరం దాడి చేసుకోవడంతో ఐదుగురికి గాయాలు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా బీర్కూర్‌కు చెందిన శంకర్, మాధవ్ అన్నదమ్ములు. వీరి తల్లి వారం కింద చనిపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బుధవారం రాత్రి ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరగడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత శంకర్ తన కొడుకు బాబులాల్, కూతురు గంగామణితో కలిసి తమ్ముడు మాధవ్, అతడి భార్య నాగమణిపై మరోసారి దాడి చేశాడు. దీంతో మాధవ్ కుటుంబ సభ్యులు సైతం ఎదురుదాడి చేశారు. దీంతో ఐదుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. మాదవ్, నాగమణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.