సార్​ జీవితమంతా.. తెలంగాణమే!

తెలంగాణ సమాజానికి పరిచయం అక్కరలేని వ్యక్తి తెలంగాణ సిద్ధాంత కర్త, మన జాతిపిత ప్రొఫెసర్‌‌ కొత్తపల్లి జయశంకర్ సార్. విద్యార్థి దశ నుంచే ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై.. హక్కుల కోసం ఉద్యమించారు. తన జీవితమంతా తెలంగాణ స్వరాష్ట్ర సాధనే  ధ్యేయం గా శ్వాసించారు. జీవించారు. 1969లో తొలిదశ, 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమాల్లోనూ సార్ సమరశీల పాత్ర పోషించారు.    రాష్ట్ర ఉద్యమ ట్యాగ్ లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలపై పదేండ్ల స్వరాష్ట్ర పాలనలో సార్ ఆకాంక్షలు నెరవేరినయా? గత పాలకులు నిబద్ధతతో నెరవేర్చినరా ? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం. స్వరాష్ట్రంలో  తొలి పాలకులు సార్  ఆకాంక్షలను  నెరవేర్చుతామని ఎన్నో హామీలు ఇచ్చారు. అధికార పీఠమెక్కగానే అటకెక్కించారు.  తెలంగాణ సాధిస్తే  నీళ్లలో మన వాటా తేలుతుందని, కొలువుల కొట్లాటలు తీరుతాయని సార్  ఆశించారు. కానీ, ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై ఇంకా పీఠముడే ఉంది.  

రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. మేడిగడ్డ ప్రాజెక్ట్  పిల్లర్ల కుంగుబాటుతో పడావు పడింది. కొలువుల కోసం ఉద్యమించి కేసుల పాలైన  నిరుద్యోగులకు  ఉద్యోగాలు అందని ద్రాక్షనే  అయ్యాయి.  మొత్తంగా సార్  ఆకాంక్షలను అణగదొక్కారు. కేవలం ఒక జిల్లాకు జయశంకర్ సార్  పేరు పెట్టి గత పాలకులు సరిపెట్టారు. 

అప్పుల పాలై.. ఆర్థికంగా దివాలా

రాష్ట్రం ఏర్పడే నాటికి ఖజానాలో రూ.65 వేల కోట్లకుపైగా మిగులు నిధి ఉంది. కానీ, పదేండ్ల లో అభివృద్ధి పేరిట రాష్ట్రం అప్పుల కుప్ప అయింది. దాదాపు రూ.7 లక్షల కోట్లుగా ఉం ది. చివరకు ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా అప్పులు చేసే దీన స్థితికి రాష్ర్టం దిగజారిపోయింది. మొత్తంగా   ఆర్థికంగా దివాలా తీసింది.  నిధుల కొరత ఏర్పడింది. అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోతుంది.  ఉద్యమ కాలం నాటి జయ జయహే తెలంగాణ రాష్ట్ర గేయంగా కూడా గత పాలనలో నోచుకోలేదు.  అమరుల త్యాగాలకు సరైన గుర్తింపు  దక్కలేదు. ఉద్యమ కారులను అణచివేశారు. వేటి కోసమైతే సబ్బండ వర్గాలు రోడ్డెక్కి కొట్లాడారో..  వారి ఆశయాలు నెరవేర్చలేదు.  అడుగడుగునా అప్రజాస్వామిక పాలన కొనసాగింది.  

రేవంత్​ సర్కారుపైనే ఆశలు

ప్రస్తుత ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి..   జయశంకర్ సార్  ఆశయాలు  నెరవేర్చే 
బాధ్యతను తీసుకోవడం అభినందనీయం. జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రభుత్వం  గుర్తించింది. టీఎస్ నుంచి టీజీగా మార్పు చేసింది.  కొలువుల భర్తీ చేపడుతుంది.  ఇలా గత పాలకుల కంటే భిన్నంగా  ప్రజా పాలనను అందిస్తోంది. సార్  ఆశయ స్ఫూర్తితో ముందుకుసాగుతుండగా.. అన్నివర్గాలకు సామాజిక న్యా యం జరగాలి. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించడమే జయశంకర్​ సార్​కు మనం ఇచ్చే ఘన నివాళి! 

- వేల్పుల సురేశ్, సీనియర్ జర్నలిస్ట్