ప్రీ ప్రైమరీ లుక్ ​అదుర్స్​.. అంగన్​వాడీ సెంటర్ల అప్​గ్రెడేషన్ స్పీడప్​    

  • కార్పొరేట్ కు దీటుగా వసతులు 
  • ఒక్కో సెంటర్​కు రూ.లక్షకు పైగా ఖర్చు
  • మారుతున్న రూపురేఖలు 

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో అంగన్ వాడీ సెంటర్ల అప్​గ్రెడేషన్ ప్రక్రియ స్పీడందుకుంది. కార్పొరేట్ లుక్ తీసుకువచ్చేందుకు ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పెయింటింగ్, బొమ్మలు, ఫర్నిచర్​తో కొత్తరూపు తెస్తున్నారు. ఒక్కో సెంటర్​కు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తూ వసతులు కల్పిస్తున్నారు. అంగన్​వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ గా మారుస్తూ పిల్లలకు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నారు. 

జిల్లాలో 223 సెంటర్ల ఎంపిక..

జనగామ జిల్లాలో మొత్తంగా 695 అంగన్​వాడీ సెంటర్లున్నాయి. మూడు నుంచి ఆరేండ్ల చిన్నారులు 9,840 మంది, ఏడు నెలల నుంచి మూడేండ్ల వయస్సున్నవారు 13,816 మంది మొత్తం 23,456 చిన్నారులున్నారు. కాగా, జనగామ ప్రాజెక్ట్ పరిధిలో 257 సెంటర్లు ఉండగా, 81 సొంత బిల్డింగ్ లు కాగా 76 అద్దె భవనాల్లో, 100 సెంటర్లు అద్దె లేకుండా కొనసాగుతున్నాయి.

కొడకండ్లలో 183 సెంటర్లుండగా, వీటిలో 67 సొంత భవనాల్లో 38 అద్దె భవనాల్లో, 78 అద్దె లేకుండా పనిచేస్తున్నాయి. స్టేషన్ ఘన్​పూర్ ప్రాజెక్ట్ పరిధిలో 255 సెంటర్లు ఉండగా, వీటిలో 75 సొంత బిల్డింగ్​లలో, 67 అద్దె భవనాల్లో, 113 అద్దె లేకుండా పనిచేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 223 అంగన్​వాడీ సెంటర్లకు సొంత బిల్డింగ్​లున్నాయి. మిగిలిన వాటిలో 181 అద్దెకు, 291 అద్దె లేకుండా కొనసాగుతున్నాయి. 

లక్ష ఖర్చుతో..

జిల్లాలో సొంత భవనాలు ఉన్న 223 అంగన్​వాడీ సెంటర్లను డెవలప్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో సెంటర్​కు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. తొలి విడతగా 33 సెంటర్లను ఎంపిక చేసి పనులు చేపడుతున్నారు. వీటిలో పెయింటింగ్ కు రూ.40 వేలు, టాయిలెట్ల నిర్మాణానికి రూ.36 వేలు, డ్రికింగ్ వాటర్​ కోసం రూ.17 వేల చొప్పున కేటాయించారు.

ఈ 33 సెంటర్లలో ఇప్పటికే పెయింటింగ్ పనులు పూర్తయ్యాయి. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ నిర్మాణ పనులు మాత్రం కొనసాగుతున్నాయి. వీటిలో పనులు పూర్తైన తర్వాత మిగిలిన సెంటర్లలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రారంభించనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతుండగా, ఫర్నిచర్ మాత్రం​ డైరెక్టరేట్ నుంచి వస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. 

పెయింటింగ్​ పనులు పూర్తి.. 

జిల్లాలో తొలివిడతగా 33 అంగన్​వాడీ సెంటర్లలో డెవలప్ మెంట్ పనులు జరుగుతున్నాయి. బిల్డింగ్ ల పెయింటింగ్ పనులు పూర్తయ్యాయి. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నం. పక్కా బిల్డింగ్​లు ఉన్న 223 సెంటర్లలో కార్పొరేట్ లుక్ తీసుకువస్తం. - డీ ఫ్లోరెన్స్, డీడబ్ల్యూవో, జనగామ