ధరణి సమస్యలు - పరిష్కారాలు

పట్టణ,  గ్రామీణ  ప్రాంతాలలో ఉన్న భూములకు సంబంధించిన అన్ని విషయాలకు వ్యవసాయ, నివాస, వాణిజ్య సమస్యలకు ఒకే పరిష్కారంగా ధరణి పోర్టల్​ను ప్రచారం చేశారు. మ్యుటేషన్‌‌లు, ఆన్‌‌లైన్‌‌లో అప్పటికప్పుడు  రిజిస్ట్రేషన్‌‌తో సహా భూమి ఆస్తులకు సంబంధించిన ప్రతి విషయానికి పోర్టల్ ఒక పరిష్కారంగా ఉంటుందని, రెవెన్యూ డిపార్ట్‌‌మెంట్‌‌లో భారీ అవినీతికి, అసంఖ్యాక భూ వివాదాలకు ముగింపు పలుకుతుందని కూడా చెప్పారు. అదనంగా, ధరణి పోర్టల్‌‌లో అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌‌లలోని ప్రతి  వ్యవసాయేతర ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.

యాప్ ద్వారా ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేయడానికి 2020లో గత ప్రభుత్వం 24,400 మంది అధికారులను నియమించింది.  ఒక దశలో 75.75 లక్షల ఆస్తులు మాత్రమే నమోదు అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ఆస్తులు నమోదయ్యాయో ప్రభుత్వం సమాచారం వెల్లడించలేదు. 

ధరణి పోర్టల్​తో సమస్యలు ఒక్కటి కాదు. అనేకం ఉన్నాయి.  ఏనాటి నుంచో ఉన్న గట్టు సమస్యలను చిన్నగా చేసి కొత్తరకం సమస్యలను సృష్టించిన ఘనత ధరణికే  దక్కింది. చేతులు మారిపోయిన  భూమి యజమానిని తిరిగి తీసుకువచ్చి రికార్డులలోకి ఎక్కించిన వైనాలు అనేకం.  తప్పులు వారివి.. పరిణామాలు మాత్రం ప్రజలు ఎదుర్కొంటున్నారు. అధికారులు తెలిసి చేసిన తప్పులే ఎక్కువ.  దీంతో  నిరంతర అవినీతికి ఆస్కారం ఏర్పడింది.  టైటిల్ గ్యారంటీ (భూమి హక్కు) ఇంకా పలుచన అయిపోయింది. కంప్యూటర్లో నిక్షిప్తం అయిన సమాచారం అందుబాటులో ఉన్నవాడిదే భూమి అయిపోయింది.  ఈ కంప్యూటర్  చిట్టాతో మున్ముందు ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో అని ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. 

సమస్యలకు మూలం ధరణి పోర్టల్‌‌

ధరణి పోర్టల్ వచ్చినాక ఒక ఆపరేటర్ సులువుగా భూమి యజమాని పేరు మార్చి ఇచ్చే అవకాశం ఉండటం శోచనీయం. ప్రభుత్వ అధికారులు కూడా భూసేకరణ సులువుగా చేయగలుగుతున్నారు. చట్టం ప్రకారం నోటీసు ఇవ్వడం వగైరా పద్ధతులు పాటించాల్సిన పనిలేదు. సరళంగా ధరణిలో భూమి యజమాని పేరు మారిస్తే రైతు గత్యంతరం లేక దారిలోకి వస్తాడు అనే ధీమా అధికారులలో కల్పించింది ధరణి. పారిశ్రామిక అవసరాలకు భూమి కావాలంటే చట్టపర ప్రక్రియలు పాటించాల్సిన పనిలేదు. ధరణిలో యజమాని పేరు మార్చి, TSIIC పేరు పెడితే  భూసేకరణ అయిపోతున్నది.

గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అసమంజసమైన భూరికార్డుల వ్యవస్థ నిర్వహణ వల్ల రైతులకు కొత్త సమస్యలు ఏర్పడ్డాయి. భూ రికార్డులు కొత్తగా ప్రామాణీకరించిన తర్వాత,  భూ రికార్డుల యాజమాన్యంలో మార్పులను ట్రాక్ చేయడానికి ధరణి పోర్టల్​లో  బ్లాక్‌‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగిస్తామని 2017లో తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. భూ లావాదేవీలలో మోసపూరిత లావాదేవీలను అరికట్టడానికి, విశ్వసనీయత, ఖచ్చితత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడానికి  సమీకృత భూ రికార్డు నిర్వహణ వ్యవస్థ అయిన ధరణిలో బ్లాక్‌‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించారు. 

ధరణిలో భూరికార్డులు ఎవరు తయారుచేశారు? 

 ధరణి పోర్టల్ లో కనిపిస్తున్న భూమి రికార్డులు ఎవరు తయారు చేశారు? ఏ పాత రికార్డు ఉపయోగించి చేశారు? ఎవరు సరిదిద్దుతారు? వగైరా ప్రశ్నలకు సమాధానం లేదు. ఉదా: పెద్దపల్లి జిల్లా మొగల్పహాడ్ గ్రామంలో 45 ఏండ్ల  కిందట అమ్మేసిన వ్యక్తి పేరు మీద 697 ఎకరాలు నమోదు చేశారు. ల్యాండ్ సీలింగ్ చట్టం అమలు చేయకపోగా  ఏండ్ల కిందట భూమి కొన్న వ్యక్తుల పేర్లు కాకుండా అమ్మేసిన వ్యక్తి పేరు మీద ఉన్న రికార్డు ధరణిలోకి ఎట్లా వచ్చింది?  ధరణి సిబ్బందికి ఆ పాత రికార్డు, పేరు ఎవరు ఇచ్చారు?  భూరికార్డులు సరిగా లేని క్రమంలో పాత రికార్డు పరిగణనలోనికి తీసుకుని కొత్త రికార్డును నిర్లక్ష్యం చేయడం తెలంగాణ పట్టాదార్ చట్టం 2020లో లేదు. మ్యుటేషన్ చేసిన రికార్డు ధరణిలోకి ఎక్కించాలి.

ప్రక్షాళన పేరిట గ్రామాల వారీగా సమావేశాలు పెట్టినప్పుడు కూడా ఇక్కడ భూమి యజమానులు గురించి తెలిసి ఉండాలి. ఈ ప్రక్రియలకు అందకుండా ఎప్పటిదో రికార్డు ధరణిలోకి రావడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఇట్లా జరిగింది.  పక్కా రికార్డు  చేస్తామని లక్ష్యంతో  తెచ్చిన 2020 ఆర్ఒఆర్ చట్టంలో ఏ రికార్డును ధరణిలోకి ఎక్కిస్తారో చెప్పలేదు. ఇట్లా చెప్పనందున ధరణిలో అనేక అవకతవకలు జరిగినాయి. 

ధరణితో  రైతులకు క్షోభ

ధరణిలో భూమి యజమాని పేరు మార్చడం చాలా సులువు.  అయితే,  ఎవరు మార్చుతున్నారు? ఎట్లా మార్చుతున్నారు? ఎందుకు మార్చుతున్నారు? అనే విషయాల మీద ప్రభుత్వం విచారణ చెయ్యాలి. తప్పులు చేసేది ధరణి సిబ్బంది, కాని దాని తరువాత ఏర్పడే ఇబ్బందులు, ఖర్చులు, బాధలు మాత్రం ప్రజలే అనుభవిస్తున్నారు. అనేక భూ రికార్డులు ఉన్నాయి అని గుర్తించిన ప్రభుత్వం ఏ రికార్డు ధరణిలోకి ఎక్కించాలి అనే విషయం మీద విధి విధానాలు ప్రకటించలేదు. చట్టంలో ప్రస్తావించలేదు.  రైతుల దగ్గర ఉన్న పాస్ పుస్తకం పట్టించుకోవడం లేదు. అది కూడా చట్ట ప్రకారం రికార్డు.

రైతు దగ్గర ఉన్న రికార్డుకు భిన్నంగా ధరణిలో రికార్డు ఉంటే, సరి చేయడానికి 2020 చట్టంలో పద్ధతి సూచించలేదు. ధరణిలో తారుమారైన, మార్చిన రికార్డులను సరిదిద్దుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బ్లాక్ చైన్ సాంకేతికత ఉపయోగించని కారణంగా అవినీతి వ్యవస్థ కుతంత్రాలకు రైతులు బలయ్యారు. దిద్దుబాట్ల కోసం, ఫిర్యాదుల కోసం దరఖాస్తులను స్వీకరించి, నిర్దిష్ట కాలపరిమితిలో అధికారులు సృష్టించిన సమస్యలను పరిష్కరించడానికి సరైన పద్ధతిని, అధికారిని గుర్తించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఈ వైఫల్యం వలన రైతుల ఆందోళనను సొమ్ము చేసుకోవడానికి ఒక రహస్య యంత్రాంగం ఏర్పడింది. భూ రికార్డుల వ్యవస్థ నిర్వహణలో అవినీతి ఎమ్మార్వో నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి దాటి అంతకంటే ఎక్కువ స్థాయికి మారింది.

సెక్షన్ 22 నిషేధిత భూములు

రిజిస్ట్రేషన్ చట్టం కింద ఈ సెక్షన్లో ప్రకటించిన భూములు అమ్మడానికి, కొనుగోలు చేయడానికి వీలు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ లేక వక్ఫ్, ధార్మిక సంస్థల భూములు, సీలింగ్ చట్టం కింద భూములు, ప్రభుత్వం ఏదేని సంస్థలకు ఇచ్చిన భూములు ఈ సెక్షన్ క్రిందకు వస్తాయి. సెక్షన్ 22  కింద ఉన్న భూముల రికార్డులు విశ్వసనీయంగా లేవు.  ధరణి వచ్చినాక కొత్తగా భూసేకరణకు నిర్దేశించిన భూములను ఈ సెక్షన్ కింద ఏకపక్షంగా చేర్చారు. భూసేకరణకు ప్రత్యేక చట్టం ఉంది. దాని ప్రకారమే రైతుల నుంచి భూసేకరణ జరగాలి.

ధరణి పోర్టల్ రికార్డ్ అఫ్ రైట్స్ చట్టం ప్రకారం తయారు చేశారు. ఈ చట్టంలో భూసేకరణ అంశం రాదు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులను భయపెట్టటానికి వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించదలిచిన భూమిని ఈ సెక్షన్​లో  చేర్చింది.  ఇదే కాదు. ఎవరిపైనైనా కక్ష సాధించాలంటే వారి భూమి ఈ సెక్షన్లోకి చేర్చటం అధికారులకు పరిపాటి అయిపోయింది. ఇక్కడ అవినీతికి చాలా అవకాశం ఏర్పడింది. దరిమిలా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతూనే ఉన్నది. నిషేధిత జాబితాలో పెట్టటానికి ప్రభుత్వ భూముల రికార్డులే సరిగా లేవు. 

భూమి రికార్డుకు భరోసా లేదు

ధరణి వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగించకుండా నివారించడానికి  బ్లాక్‌‌చెయిన్ టెక్నాలజీ సహాయపడుతుందని తెలంగాణ ప్రభుత్వం విశ్వసించింది. ఒక అధికారి చెప్పిన ప్రకారం ‘ఉదాహరణకు, ఎవరైనా భూమి రికార్డులో  పేరును మార్చడంలో ఐదు దశలు ఉండవచ్చు. 
ఐదు దశలు పూర్తయిన తర్వాత, ఒక కొత్త రికార్డు సృష్టించబడుతుంది. ఆ భూమి రికార్డు చెల్లుబాటు అవుతుంది’. భూమి రికార్డులలో పేర్లు మార్చే ప్రక్రియలు అమలులో ఉన్నాయి. అంటే, భూమి రికార్డుకు భరోసా లేదు.

ధరణి వచ్చిన తరువాత భూమి రికార్డు వ్యవస్థ మీద భరోసా ఇంకా తగ్గింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ డేటాబేస్‌‌ (ధరణి) నిర్వహణ ఏ అధికారి ఎలా చేస్తాడో చెప్పమని అడిగింది. బ్లాక్‌‌చెయిన్ టెక్నాలజీ రికార్డులలో మార్పులు కఠినతరం చేస్తుంది. -ఒకసారి ఆమోదించిన భూమి రికార్డు డేటా సులువుగా మార్చడం లేదా తొలగించడం కుదరదు. అయితే, ఈ టెక్నాలజీ ఉపయోగించలేదు. భూమి రికార్డులలో అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులను లోపాలను సరిదిద్దడం సమర్థవంతమైన  అధికార యంత్రాంగం, ముందుగా ఆమోదించిన పద్ధతి ప్రకారం చేయవలసి ఉంటుంది. 

23 లక్షల అటవీ భూమి ఎక్కడకు పోయింది?

అటవీ శాఖ రికార్డులలో 66.33 లక్షల ఎకరాలు ఉండగా, నోటిఫై చేసినవి 65.12 లక్షలు మాత్రమే.  కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో రెవెన్యూ శాఖ నుంచి, CCLA నుంచి తీసుకుని పంపిన వివరాల ప్రకారం అటవీ భూములు 43.05 లక్షలే.  జిల్లాల వారీగా కూడా తేడాలున్నాయి. దాదాపు 23 లక్షల అటవీ భూమి ఎక్కడకు పోయింది?  చాలా ఏండ్లుగా ప్రభుత్వ భూముల సర్వే కూడా జరగలేదు. సెక్షన్ 22లో, నిషేధిత భూములలో 23 లక్షల ఎకరాల అటవీ భూమి ఉండాలి.

ధరణి పోర్టల్ నిర్మాణ సమయంలో రికార్డుల ప్రక్షాళన చేసి, రికార్డులు ఎక్కించామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం అప్పుడే బయటపడలేదు.  ప్రభుత్వం పూనుకుని నిరంతరం కృషి చేస్తే ఎక్కడో ఉన్న ఈ 23 లక్షల ఎకరాలు క్రమంగా సెక్షన్ 22లోకి వస్తాయి. అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూముల పరిస్థితి ఇంచుమించు ఇట్లాంటిదే. 

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​