పట్టాలున్నా.. సాగుచేయనిస్తలే.. 15 ఏళ్లుగా అడ్డుకుంటున్న  ఫారెస్ట్​ ఆఫీసర్లు

  • 15 ఏళ్లుగా అడ్డుకుంటున్న  ఫారెస్ట్​ ఆఫీసర్లు
  •     166 మందికి భూ పంపిణీ
  •     సాగు చేయనీయకుండా అటవీశాఖ అడ్డగింత
  •     కోర్టును ఆశ్రయించిన రైతులు
  •     జాయింట్​ సర్వేలో మిగులు భూమి ఉందని గుర్తింపు
  •     పట్టాలిచ్చి రైతు భరోసా కల్పించాలని వినతి

సిరికొండ, వెలుగు : సిరికొండ మండలంలోని మైలారం, గడ్కోల్​ తూంపల్లి, సిరికొండ  గ్రామాల్లో పట్టాలున్న, ఏళ్లుగా సాగులో ఉన్న రైతుల సమస్య నేటికి పరిష్కారం కాలేదు. సిరికొండ మండలం  మైలారం శివారులోని 128,137 సర్వే నంబర్​లో నిరుపైద రైతులకు గత ప్రభుత్వం పట్టాలిచ్చింది. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు తీసుకున్న రైతులను అటవీశాఖ ఆఫీసర్లు సాగు చేయనీయకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం హరితహారం పేరుతో 2019, 2021లో జాయింట్​ సర్వే చేసి మిగులు భూమి ఉందని గుర్తించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. గడ్కోల్ శివారులోని 100,102 సర్వే నంబర్​లో   కొంతమంది రైతులకు పట్టాలున్నాయి, మరికొందరికి సాగులో ఉన్నా పట్టాలు రాలేదు.

ఈభూమిలో  గతంలో జాయింట్​ సర్వే చేశారు. సుమారు 90 ఎకరాల్లో మిగులు భూమి రెవెన్యూదని తేలింది. కానీ అటవీశాఖ అధికారులు మాత్రం కొత్త పట్టాలున్న రైతులను సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. తూంపల్లి, కొండాపూర్ శివారులో ఉన్న భూముల్లో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు అటవీ భూమని అధికారులు అడ్డుకుంటున్నారు.  ఏళ్ల తరబడి సమస్యను ప్రభుత్వాలు పరిష్కరించడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలకు, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు డిజిటల్​ పట్టాలు అందించాలని 
కోరుతున్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న భూమి సిరికొండ మండలంలోని 532 సర్వే నంబర్​లోనిది. 2009లో 166 మంది రైతులకు నాటి ప్రభుత్వం ఇందులో పట్టాలిచ్చింది. ఇది అటవీ భూమని ఆఫీసర్లు సాగు చేయనీయకుండా వారిని అడ్డుకుంటున్నారు. దీంతో  2012లో హైకోర్టును ఆశ్రయించారు.  రైతులు సాగు చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. కానీ, అటవీశాఖ ఆఫీసర్లు కోర్టు తీర్పును లెక్కచేయలేదు.2009 నుంచి 2015 వరకు అటవీశాఖ, రెవెన్యూ శాఖ జాయింట్​సర్వే నిర్వహించారు.ఈ భూమి రెవెన్యూదని తేలింది. అయినా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు.

డిజిటల్​ పట్టాలు ఇవ్వాలి

గతంలో ప్రభుత్వం పట్టాలిచ్చి సాగు చేసుకొమ్మంది.కానీ, ఫారెస్టు ఆఫీసర్లు సాగు చేయనీయకుండా ఏళ్లుగా అడ్డుకుంటున్నారు. హైకోర్టు తీర్పును లెక్కచేయ్యడం లేదు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు డిజిటల్​ పట్టాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి.-ప్రకాశ్​, రైతు, సిరికొండ 

నివేదికలో సంతకాలు చేస్తలే

ఫారెస్టు, రెవెన్యూ డిపార్ట్ మెంట్ జాయింట్​సర్వే చేసిన తరువాత జాయింట్ నివేదికలో ఫారెస్టు ఉన్నతాధికారులు సంతకం చేయడంలేదు. దీంతో సమస్య పరిష్కారం కావడంలేదు. రెవెన్యూ భూమని తేలినా ఫారెస్టు అధికారులు అడ్డుకోవడం తగదు. నిరుపేద రైతులు ఏళ్లుగా సాగులో ఉన్న, పట్టాలున్న  వారు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి  రైతులకు పట్టాలిచ్చి రైతు భరోస కల్పించాలి - పిట్ల రామకృష్ణ,పీడీఎస్​యూ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు