ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ గెలిస్తేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఉపాధి కూలీ రూ.400కు పెంచుతామన్నారు. ప్రతి మహిళా అకౌంట్లో రూ. లక్ష వేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డిలో ప్రియాంకగాంధీ రోడ్ షో నిర్వహించారు.
ఈ దేశం అహింస, సత్యంపై అధారపడి ఉందన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడుతుందని, దేశసంపదను బడా వ్యాపారులకు పంచుతుందని ఆరోపించారు. మోదీ పదేళ్ల కాలంలో ధనిక వర్గాలకు మాత్రమే మేలు జరిగిందన్న ప్రియాంక.. ఐదారుగురి ప్రయోజనాల కోసం మాత్రమే మోదీ పనిచేస్తున్నారని మండిపడ్డారు. రూ. 16 లక్షల కోట్లను మోదీ తన మిత్రులకు రుణమాఫీ చేశారు కానీ పేద రైతులకు మాత్రం రుణమాఫీ చేయ లేదన్నారు. ఈ ఎన్నికలతో మోదీ పని ఖతం అని జోస్యం చెప్పారు ప్రియాంక.
ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉంటే, తెలంగాణలో రూ.500కే ఇస్తున్నామని చెప్పారు ప్రియాంక. తెలంగాణ నుంచే మార్పు మొదలైందని తెలిపారు. బీజేపీ పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని తెలిపారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ నేతలు భావిస్తారని తెలిపారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పారు ప్రియాంక.