సంఘాల చుట్టూ చక్కర్లు..చివరి ప్రయత్నాల్లో అభ్యర్థులు

  • నేడు  కామారెడ్డిలో ప్రియాంక, రేవంత్​రెడ్డి రోడ్ షో
  • కేసీఆర్ సభతో గులాబీ నేతల్లో పెరిగిన జోష్ 
  • మరికొన్ని గంటల్లో మైక్ లు బంద్ 

కామారెడ్డి ​, వెలుగు : ఎంపీ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుండగా..  ఓట్లు రాబట్టుకునేందుకు ఆయా పార్టీల నేతలు చివరి ప్రయత్నం చేస్తున్నారు.  జహీరాబాద్​ పార్లమెంట్​ స్థానం పరిధిలోని కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లపై  కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు స్పెషల్​ ఫోకస్​ పెట్టాయి.  ప్రధానంగా  కాంగ్రెస్​, బీజేపీలు నువ్వా, నేనా అన్నట్లుగా ఇక్కడ పోరాడుతున్నాయి.  ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు సాధించి జహీరాబాద్​ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి నేతలు శ్రమిస్తున్నారు.

ప్రచారం చివరి దశలో  ముఖ్య నేతలతో భారీ ర్యాలీలు,  రోడ్​ షోలు నిర్వహిస్తూ  తమ బలాన్ని నిరూపించుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు.  కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన పార్టీల అభ్యర్థులు, నేతలు ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తులు,  సంఘాల ప్రతినిధులను కలిసి మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు.  బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌‌కు మద్దతుగా శుక్రవారం కామారెడ్డి, బాన్సువాడ

ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ భారీ ర్యాలీలు నిర్వహించింది.  కాంగ్రెస్​ అభ్యర్థి  సురేశ్ షెట్కార్‌‌‌‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు చివరి రోజు శనివారం  కామారెడ్డికి ఆ పార్టీ అధినేత ప్రియాంకగాంధీ,  సీఎం రేవంత్​రెడ్డి వస్తున్నారు.   కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీల కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. 

భారీ ర్యాలీలతో బీజేపీ దూకుడు

జహీరాబాద్​ స్థానాన్ని దక్కించుకుని తమ బలాన్ని మరింత పెంచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది.   బీఆర్‌‌‌‌ఎస్​ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్​ఎంపీ బీబీపాటిల్​ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ బరిలో దింపింది.  క్షేత్ర స్థాయిలో మీటింగ్‌‌లు,  ఇంటింటా ప్రచారం, ముఖ్య నేతలతో సభలు నిర్వహించారు.  చివరి అస్ర్తంగా  కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో  భారీ  ర్యాలీలు నిర్వహించారు.   బాన్సువాడ

 ఎల్లారెడ్డిల్లో  జరిగిన  ర్యాలీల్లో  కామారెడ్డి, గోషామహల్​ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రాజాసింగ్,  జిల్లా కేంద్రంలో  నిర్వహించిన ర్యాలీలో  స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో పాటు, బీబీ పాటిల్​, ఇతర లీడర్లు పాల్గొన్నారు. ఓటర్లు తమ వైపు మళ్లేందుకు ఈ సమావేశాలు సహాయపడతాయని కాషాయ నేతలు చెబుతున్నారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే పని చేయనున్నారు.

సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని..    

జహీరాబాద్​లో వరుసగా 2 పర్యాయాలు గెలిచిన అనుభవంతో మరోసారి  ఇక్కడ గెలుస్తామనే ధీమా బీఆర్​ఎస్​ వర్గాల్లో  ఉంది.  అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రతికూలత ఉన్నప్పటికీ  ఎంపీ ఎన్నికల్లో తమ ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉంది.  కొందరు లీడర్లు, కార్యకర్తలు పార్టీని వీడినప్పటికీ  ఓటర్లు మాత్రం తమ వైపు ఉన్నారనే ధీమాతో ఉన్నారు.  

అభ్యర్థి గాలి అనిల్​కుమార్​కు మద్దతుగా మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో  కేసీఆర్​ రోడ్​ షో నిర్వహించారు.  దీని ద్వారా కొంత తమకు అనుకూలత ఏర్పడిందని గులాబీ నేతలు చెబుతున్నారు.   కేసీఆర్​ ప్రోగ్రాం తర్వాత ఆయా చోట్ల  లీడర్లు పార్టీని వీడారు. అయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పలు చోట్ల ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. 

చివరి అస్త్రంగా  ప్రియాంక, రేవంత్​రెడ్డి

జహీరాబాద్​ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్​ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.  ఆయా పార్టీల నుంచి లీడర్లు, కార్యకర్తలను చేర్చుకొని తమ బలాన్ని పెంచుకుంది.   మీటింగ్​లు, ప్రచారాలు, కుల సంఘాలతో భేటీలు నిర్వహించారు. చివరి అస్ర్తంగా కామారెడ్డికి ప్రియాంకగాంధీ, సీఎం రేవంత్​రెడ్డి వస్తున్నారు.  శనివారం జిల్లా  కేంద్రంలో  రోడ్​షో లో ప్రియాంక, రేవంత్​రెడ్డి పాల్గొననున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల  ప్రచార ప్రభావంతో  గెలుపునకు ఉపకరిస్తుందని నేతలు పేర్కొంటున్నారు.

స్టేట్​లో అధికారంలో ఉండటం,  చేరికలతో  ఊపు మీదున్న కాంగ్రెస్ కు వీరిద్దరి రాక మరింత బలాన్ని చేకూర్చనుందని చెబుతున్నారు. తటస్థులుగా ఉన్న  ఓటర్లు తమ వైపు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.  అభ్యర్థి సురేశ్ షెట్కార్ రెండు రోజులుగా కామారెడ్డి ఏరియాలోనే తిరుగుతూ ఆయా వర్గాల మద్దతు కూడగట్టుకుంటున్నారు.