వ్యాపారులు సిండికేట్ అయిన్రు..పత్తి రేటు పెంచట్లే

  • ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో వ్యాపారుల తీరు!
  • ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా దక్కని మద్దతు ధర
  • తేమ శాతాన్ని మిషన్ తో చూడమంటే కొర్రీలు 
  • తొలుత చెప్పిన రేట్​ కాకుండా డబ్బులు ఇచ్చేటప్పుడు తగ్గిస్తున్రు..
  • రేటెక్కువ పెట్టలేమని, కొనుగోలు నిలిపిస్తామని బెదిరింపులు 
  • ప్రైవేట్ వ్యాపారులకే వత్తాసు పలుకుతున్న ఆఫీసర్లు! 
  • దిక్కుతోచని స్థితిలో రైతులు

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో సిండికేట్ అయిన పత్తి వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులకు దక్కకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సీజన్​ లో ఇప్పటి వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో ఒక్క పత్తి రైతుకు కూడా కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.7521 దక్కకపోవడం గమనార్హం. గరిష్ఠంగా రూ.7 వేలకు మించకుండా పత్తి బేరం చేస్తున్నారు. మార్కెట్ కు వచ్చిన పత్తిని చేత్తోని చూసి రేటు నిర్ధారణ చేసి రైతులకు చెప్పిన తర్వాత కాంటాల సమయంలో క్వింటాకు మరో రూ.200 వరకు రేటు తగ్గిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, అంత రేటు పెట్టలేమని కొర్రీలు పెడుతున్నారు. 

తేమ శాతాన్ని మిషన్లతో చెక్​ చేయకుండానే రేటు డిసైడ్ చేస్తున్నారు. 20 మందిలో ముగ్గురు మాత్రమే తేమ శాతం మిషన్లను ఉపయోగిస్తున్నారు. అప్పటి వరకు మార్కెట్​లో ఎదురుచూసిన రైతులు తెచ్చిన పంటను అమ్ముకునేందుకు మరుసటి రోజు వేచి చూడలేని పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన రేటుకే ఒప్పుకుంటున్నారు. ఈ - నామ్​ ప్రకారం ఆన్​ లైన్​ బిడ్డింగ్​అయిన ధరలను రైతులకు చెప్పకుండా వ్యాపారులు నిండా ముంచుతున్నారు. రైతులకు మార్కెట్​లో మద్దతు ధర దక్కకపోవడంపై ఇటీవల కలెక్టర్​ఆదేశాలతో 18 మంది ట్రేడర్లకు, ఒక కమిషన్​ దారుడికి ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని సూచించారు. నోటీసులపై మండి పడుతున్న ట్రేడర్లు.. ప్రస్తుతం మార్కెట్​లో నడుస్తున్న రేట్ల కంటే ఎక్కువ పెట్టలేమని, అవసరమైతే కొనుగోళ్లు నిలిపివేస్తామని చెబుతున్నారు. ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ ప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  

ట్రేడర్లకు అనుకూలంగా అధికారులు!

మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ ఉద్యోగులు కూడా వ్యాపారస్తులు, ట్రేడర్లకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పత్తిలో తేమ శాతాన్ని మిషన్​ ద్వారానే నిర్ధారించాలని, వ్యాపారులు చేతితో పరిశీలించి రేటు నిర్ణయించవద్దని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఇటీవల కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​ వ్యవసాయ మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలోనూ మిషన్లను ఉపయోగించకపోవడంపై సీరియస్​ అయ్యారు. మార్కెట్​లో అందుబాటులో ఉన్న 16 మిషన్లను తప్పకుండా వాడాలని, అవసరమైతే ఎక్కువ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. కానీ మార్కెట్ గ్రేడ్​ 1 కార్యదర్శి ప్రవీణ్​ కుమార్​ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

 బస్తాల్లో పత్తిని రైతులు తొక్కుకొని తీసుకురావడం వల్ల పత్తి టైట్​ గా ఉంటుందని, మిషన్​ ఉపయోగిస్తే తేమ శాతం ఎక్కువగా చూపిస్తుందని, దీని వల్ల రైతులకే అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. అందువల్లనే ట్రేడర్లు ఉన్న సమయంలో మిషన్ల ద్వారా తేమ శాతం చూడొద్దని సూచిస్తున్నారు. కలెక్టర్​చెప్పినా ఎందుకు మిషన్లు వాడడం లేదని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు కూడా మార్కెట్ సెక్రటరీ ఆఫ్​ ది రికార్డు ఇదే సమాధానం చెబుతున్నారు. మిషన్ల పనితీరుకు భిన్నంగా మార్కెట్ సెక్రటరీ చెబుతున్న లాజిక్​ ను విన్న రైతులు మాత్రం మండిపడుతున్నారు. తమకు మద్దతు ధర దక్కడం ఆయనకు ఇష్టం లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

ఖరీదుదారు గుమస్తాలే కాంటాలు వేసుకుంటున్రు!

రెగ్యులర్​ గా మార్కెట్ కు పత్తి బస్తాలు వస్తున్న సమయంలో దడువాయిలు లేకుండా కొన్ని బస్తాలను నేరుగా ఖరీదుదారు గుమస్తాలే కాంటాలు వేసుకుంటున్నారు. మార్కెట్లో ప్రతి బస్తా కాంటా ప్రక్రియ దడువాయి చేతుల మీదుగానే జరగాల్సి ఉండగా, దడువాయి వేసిన లెక్కల ఆధారంగానే వ్యాపారుల నుంచి మార్కెట్ ఫీజును వసూలు చేస్తారు. కొందరు వ్యాపారులు మార్కెట్ ఫీజు కట్టకుండా జీరో దందా నడిపిస్తూ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం ఇలాంటి జీరో దందా, రేట్​ డిఫరెన్స్​ (ఆర్డీ) ను లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీనిపై వివరణ కోసం మార్కెట్ కార్యదర్శిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. 

రేటు పెంచుతలేరు

అరెకరంలో పత్తి సాగు చేశాను. క్వింటా రూ.6500 చొప్పున కొనుగోలు చేశారు. ఆరబెట్టి తీసుకువచ్చినా మద్దతు ధర దక్కడం లేదు. వ్యాపారులంతా ఒక్కటై రైతులకు రేటు దక్కకుండా చేస్తున్నారు.  

మస్తాన్​, రఘునాథపాలెం