ఆంధ్రా, కర్నాటక మిల్లర్లదే హవా .. టార్గెట్‌లో సగం కూడా కొనని సర్కార్‌ సెంటర్లు

  • నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటికే 50 శాతం వడ్ల కొనుగోళ్లు
  • మద్దతు ధర కంటే రూ. 150 ఎక్కువ ఇస్తామంటున్న ప్రైవేట్‌ మిల్లర్లు
  • కమీషన్‌ ఏజెంట్లతో దందా

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌ జిల్లాలో జరుగుతున్న వడ్ల కొనుగోళ్లలో ఆంధ్రా, కర్నాటక మిల్లర్ల హవా కొనసాగుతోంది. జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో వారు రంగంలోకి దిగారు. మద్దతు ధర కంటే రూ. 150 ఎక్కువ ఇస్తామంటూ గ్రామాల్లో కమీషన్‌ ఏజెంట్లను నియమించుకొని రైతుల వద్ద నుంచి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన పంట దిగుబడిలో 50 శాతానికి పైగా వారే కొనుగోలు చేయడం గమనార్హం.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆఫీసర్ల నిర్లక్ష్యం

యాసంగి సీజన్‌లో నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 1.66 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. మొత్తం 11.72 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 6 లక్షల టన్నులు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందుకు జిల్లాలో మొత్తం 462 సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సగం సెంటర్లు కూడా ఓపెన్‌ కాలేదు. ఏర్పాటైన సెంటర్లలో కేవలం 30 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మరో 20 రోజుల్లో సీజన్‌ ముగుస్తుండడంతో మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కష్టమేనని సమాచారం.

గ్రామాల్లోకి ఎంటరైన ఇతర రాష్ట్రాల మిల్లర్లు

నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ సెంటర్లలో కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన మిల్లర్లు ఎంటర్‌ అయ్యారు. గ్రామాల్లో కమీషన్‌ ఏజెంట్లను నియమించుకొని తమకు వడ్లు అమ్మేలా రైతులను ఒప్పిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ‘ఏ’ గ్రేడ్‌కు రూ.2,203, ‘బీ’ గ్రేడ్‌కు రూ.2,183గా ఉంది. నాలుగు రోజుల కిందటి వరకు ఇదే రేట్‌తో వడ్లు కొన్న మిల్లర్లు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో వడ్లు కొనాలని ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగా మద్దతు ధరకు అదనంగా రూ. 150 ఇస్తామని రైతులను ఒప్పిస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 50 చొప్పున ఏజెంట్లకు కమీషన్‌ ఇస్తున్నారు.

డబ్బుల చెల్లింపులో ఇబ్బందులు

మద్దతు ధర కంటే అదనంగా ఇస్తూ వడ్లు కొంటున్న ఇతర రాష్ట్రాల మిల్లర్లు డబ్బుల విషయంలో మాత్రం రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారు. వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాక డబ్బుల చెల్లింపులకు సుమారు నెల రోజుల గడువు విధిస్తున్నారు. కమీషన్‌ ఏజెంట్ల మాటలు నమ్మిన రైతులు ఇతర రాష్ట్రాల మిల్లర్లకు వడ్లు అమ్ముతున్నారు. ఇచ్చిన గడువు దాటినా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.

 గతంలో బోధన్‌లో ఈ రకంగానే వడ్లు అమ్మిన రైతులు రూ.5 కోట్ల వరకు నష్టపోయారు. మరో మిల్లర్‌ రేంజల్‌కు చెందిన రైతులకు రూ. 2 కోట్లు ఎగ్గొట్టడంతో ఏజెంట్‌గా వ్యవహరించిన యువకుడు దుబాయ్‌ వెళ్లిపోయాడు. దీంతో రైతులు డబ్బుల కోసం మిల్లర్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. 

కేంద్రాలను ఏర్పాటు చేయాలంటున్న రైతులు

గత అనుభవాల దృష్ట్యా ఏజెంట్ల ద్వారా ఇతర రాష్ట్రాల మిల్లర్లకు వడ్లు అమ్మేందుకు కొందరు రైతులు వెనుకాడుతున్నారు. కానీ ప్రభుత్వ కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో తప్పనిసరై ప్రైవేట్‌ మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్‌లో 7 లక్షల టన్నుల వడ్లు కొనాలని టార్గెట్‌ పెట్టుకున్న ఆఫీసర్లు 3 లక్షల టన్నులు కూడా కొనలేకపోయారు. ప్రస్తుత యాసంగి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, రైతులకు అవగాహన కల్పిస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.