తగ్గిన పాల సేకరణ రేటు

  • కొనేది రూ.34.. అమ్మేది రూ.54
  • లీటరు పాలకు రూ.20 లాభం
  •  పెరిగిన దాణా రేట్లు..
  •  నష్టపోతున్న పాడి రైతులు

యాదాద్రి, వెలుగు : పాల సేకరణ ధరను ప్రైవేట్ డెయిరీలు తగ్గిస్తున్నాయి. దీంతో పాడి రైతు నష్టాల పాలవుతున్నాడు. దాణా రేట్లు పెరుగుతూ ఉండడం, పాల రేట్లు తగ్గుతూ ఉండడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి పాలు వస్తున్నాయని సేకరణలో ధర తగ్గిస్తున్న డెయిరీలు మార్కెట్లో మాత్రం మంచి రేటుకే పాలను అమ్ముకుంటున్నాయి. లీటరు పాలకు రూ.20 వరకు లాభం ఆర్జిస్తున్నాయి.వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి వైపునకు దృష్టి సారిస్తున్నారు.

 దీంతో పాడి పరిశ్రమ వృద్ధి చెందుతోంది. ఒక్కో గేదె, ఆవును రూ.70 వేలు అంతకన్నా ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో రైతు పది అంతకంటే ఎక్కువ సంఖ్యలో పాడి పశువులను సాకుతున్నారు. దీనివల్ల తమతోపాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 69 వేల ఆవులు, లక్షకు పైగా గేదెలు ఉన్నాయి. 

వీటి నుంచి ప్రతిరోజూ సుమారు 20 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. ఇందులో 15 లక్షల లీటర్ల పాలను డెయిరీల్లో రైతులు పోస్తున్నారు. వీటిలో ప్రైవేట్ డెయిరీ అయిన హెరిటేజ్, ఇతర ప్రైవేట్​డెయిరీలు ఎక్కువగా పాలను సేకరిస్తాయి. మదర్​డెయిరీ 50 వేల నుంచి 60 వేల లీటర్లు సేకరిస్తోంది. యాదాద్రి జిల్లాలో విజయ డెయిరీ సేకరణ తక్కువగానే ఉంటోంది. 

పాల సేకరణ రేటు తగ్గింపు..

ఈ సమయంలో ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే మదర్ డెయిరీ, విజయ డెయిరీల నుంచి రైతులకు బిల్లులు ఆలస్యంగా వస్తున్నాయి. ఒక్కో రైతుకు నెలకు పైగా బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. పక్క రాష్ట్రాల నుంచి పాల దిగుమతి పెరిగిందని, దీనివల్ల డిమాండ్ తగ్గిందని చెబుతున్నారు. 

ఈ కారణాలను చూపుతూ గతంలో మదర్​ డెయిరీ, విజయ డెయిరీ కంటే లీటరుకు రూ.2 ఎక్కువగా చెల్లించే ప్రైవేట్ డెయిరీలు ఇప్పుడు లీటరుకు రూ.8 నుంచి రూ.10 వరకు రేట్లు తగ్గించాయి. గతంలో 3 శాతం ప్యాట్ ఉన్న ఆవు పాలకు రూ.40 నుంచి రూ.42 చెల్లించే హెరిటేజ్ డెయిరీ ఇప్పుడు రూ.34.50 చెల్లిస్తోంది. 5 శాతం ప్యాట్​వచ్చే గేదె పాలకు గతంలో లీటరుకు రూ.50కి పైగా చెల్లించగా, ఇప్పుడు రూ.41 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మదర్​ డెయిరీ కూడా లీటర్ ఆవు పాలకు రూ.33.35 చెల్లిస్తోంది. 

రూ.34కు కొని.. రూ.54కు అమ్మకం..

పక్క రాష్ట్రాల కారణంగా పాలకు డిమాండ్​తగ్గిందని చెబుతున్న డెయిరీలు తాము మాత్రం మంచి రేటుకే అమ్ముతున్నారు. కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ లీటరు ఆవు పాలను రూ.54కు అమ్ముతోంది. పక్క రాష్ట్రాల డెయిరీల పేరు చెప్పి ధర తగ్గించి రైతుల వద్ద లీటరుకు రూ.34కు కొంటున్న ప్రైవేట్ డెయిరీలు.. అవే​ ఆవు పాలను ప్యాకెట్​లో రూపంలో నందిని తరహాలోనే రూ.54కు అమ్ముతోంది. గుజరాత్​కు చెందిన అమూల్​తరహాలోనే మదర్ డెయిరీ లీటర్ పాలను రూ.58కి అమ్ముతోంది. ఈ లెక్కన లీటర్​పాలకు రూ.20 లాభం ఆర్జిస్తున్నాయి. 

భారీగా పెరిగిన దాణా రేట్లు..

పాడి పశువులకు పత్తి పిట్టు, గోధుమ, తవుడు, పల్లీ, కంది, మక్కలను దాణాగా ఉపయోగిస్తున్నారు. గతంలో పోలిస్తే వీటి ధర ఇప్పుడు భారీగా పెరిగింది. 42 కిలోల పత్తి పిట్టుకు గతంలో రూ.1450 ఉంటే ఇప్పుడు రూ. 1900కు పెరిగింది. 50 కిలోల మక్కలకు గతంలో రూ.1400 ఉండగా, ఇప్పుడు రూ.1650 అవుతోంది. తవుడుకు రూ.1350 ఉంటే ఇప్పుడు రూ.1600కు పెరిగిపోయింది. ఇలా వీటిలో ఏ దాణా కొనుగోలు చేయాలన్న కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు చెల్లించాల్సి వస్తోంది. 8 నుంచి 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవు, గేదెకు ప్రతి రోజు 5 కిలోల దాణా పెట్టాల్సి ఉంటుంది.

 అంతేగాకుండా పశుగ్రాసం అందించడంతోపాటు మందుల ఖర్చు కూడా ఉంటుంది. ఒక్క ఆవు లేదా గేదెను కొనాలంటేరూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టి  ఒకరిద్దరు వర్కర్స్​ను నియమించుకొని డెయిరీల్లో పాలు పోస్తే తగ్గిన ధరల వల్ల ఏమీ మిగలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.