ఖాదీ కళాకారులకు కేవీఐసీ బహుమతులు

  • చేనేత కార్మికుల వేతనాన్ని పెంచుతున్నట్లు కేవీఐసీ కమిషన్‌‌ చైర్మన్‌‌ ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు, మోదీ ప్రభుత్వం3.0  అధికారం చేపట్టి100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖాదీ కళాకారులకు కేంద్ర ప్రభుత్వం బహుమతులు అందజేసింది. ఖాదీ అండ్‌‌ విజిలెన్స్‌‌ ఇండస్ట్రిస్‌‌ కమిషన్‌‌ (కేవీఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, గ్రామీణ పరిశ్రమ కమిషన్‌‌ చైర్మన్‌‌ మనోజ్‌‌ కుమార్‌‌‌‌ బహుమతులు అందించారు.

మహాత్మా గాంధీ జన్మస్థలమైన గుజరాత్‌‌లోని పోర్‌‌‌‌బందర్‌‌‌‌లోని అస్మావతి రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో లక్షల మంది ఖాదీ కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పిన్నర్ల వేతనాన్ని 25%, చేనేత కార్మికుల వేతనాలను 7% పెంచుతున్నట్లు మనోజ్‌‌ కుమార్‌‌‌‌ ప్రకటించారు. పెంచిన వేతనాలను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌‌‌‌ 2 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా అస్మావతి రివర్ ఫ్రంట్‌‌లో ఏర్పాటు చేసిన 26 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు ఉన్న స్టెయిన్‌‌లెస్‌‌ స్టీల్‌‌ ‘మెమోరియల్‌‌ చరఖా’ను ఆవిష్కరించారు.

ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద దేశవ్యాప్తంగా 3,911 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.101 కోట్ల మార్జిన్‌‌ మనీ సబ్సిడీ పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా మనోజ్‌‌ కుమార్‌‌‌‌ ప్రారంభించారు. అలాగే, కొత్తగా 43,021 మందికి ఉపాధి కల్పించామని వెల్లడించారు. అంతేకాకుండా కేవీఐసీ ‘సైలాయి సమృద్ధి యోజన’పథకాన్ని ప్రారంభించామని, రిజిస్ట్రేషన్‌‌ ప్రక్రియ కూడా స్టార్ట్‌‌ అయ్యినట్లు ఆయన తెలిపారు.