- కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం
- ఆ పార్టీకి ఓటేయడమంటే అభివృద్ధిని ఫణంగా పెట్టడమే: మోదీ
- పొరపాటున కూడా కాంగ్రెస్‌కు ఓటేయొద్దు
- హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని
సోనిపట్ (హర్యానా): పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటే యడం అంటే.. రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తెలిపారు. హర్యానా సుస్థిరతను కాంగ్రెస్ దెబ్బతీస్తుందని విమర్శించారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో సోనిపట్ జిల్లా గోహానాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎన్డీఏ పాలనలోనే హర్యానా పారిశ్రామికంగా, వ్యవసాయ రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు.
పరిశ్రమలు వస్తే పేదలు, రైతులు, దళితులకు ఎంతో లాభపడ్తారని వివరించారు. దళితుల సాధికారతలో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని బీఆర్ అంబేద్కర్ నమ్మేవాళ్లని తెలిపారు.
నేడు మహారాష్ట్రకు ప్రధాని
మహారాష్ట్రలో రూ.22,600 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. పుణెలో జిల్లా కోర్టు నుంచి స్వర్గేట్ వరకు పూర్తయిన అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ప్రాజెక్ట్ (ఫేజ్ 1)ను మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారని పుణె మెట్రో రైల్ సెక్షన్ అధికారులు తెలిపారు. రూ.1,810 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు.
అదేవిధంగా, రూ.2,950 కోట్లతో చేపట్టే.. స్వర్గేట్ నుంచి కట్రాజ్ (5.46 కిలో మీటర్లు) మెట్రో విస్తరణ పనులు, భీడ్ వాడలో సావిత్రిబాయి ఫూలే గర్ల్స్ స్కూల్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.130 కోట్లతో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) తయారు చేసిన మూడు పరం రుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేయనున్నారు. సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వీటిని ఉపయోగిస్తారు. పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఇవి ఉంటాయి.
వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు రూ.850 కోట్లతో తయారు చేసిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ) సిస్టమ్‌ను ప్రారంభిస్తారు. రూ.10,400 కోట్ల విలువైన పెట్రోలియం, నేచురల్ గ్యాస్ సెక్టార్‌కు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రక్, క్యాబ్ డ్రైవర్ల సేఫ్టీ, క్లీనర్ మొబిలిటీ కోసం ఉపయోగపడ్తాయి.
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద బిడ్కిన్‌లో 7,855 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియాను మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ కింద డెవలప్ చేయనున్న ఈ ప్రాజెక్ట్.. మరఠ్వాడా రీజియన్ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. దీని కోసం రూ.6,400 కోట్లు కేటాయించారు.