11 ఎయిమ్స్ దవాఖాన్లలో డ్రోన్ ద్వారా మందులు డెలివరీ

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్ తో సహా వివిధ రాష్ట్రాల్లోని11 ఎయిమ్స్ దవాఖాన్లలో డ్రోన్ ద్వారా మందుల డెలివరీ సర్వీస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మంగళవారం 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆయుర్వేద ఇన్నోవేషన్స్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే థీమ్ తో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ఈ మేరకు డ్రోన్ సేవలను వర్చువల్ గా లాంచ్ చేశారు. అనంతరం ఎయిమ్స్‌అధికారులు డ్రోన్ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. 

ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్​లోని ఎయిమ్స్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరిలోని జిల్లా హాస్పిటల్​కు డ్రోన్​ను పంపించారు. అక్కడ ట్రీట్​మెంట్​ పొందుతున్న ఓ టీబీ పేషెంట్ శాంపిల్స్ ను తీసుకొని డ్రోన్ తిరిగి వచ్చింది. అలాగే ఎయిమ్స్ నుంచి కొన్ని మందులను డ్రోన్​లో పెట్టి బీబీ నగర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండమడుగు పీహెచ్​సీకి పంపించగా అక్కడి సిబ్బంది వాటిని అందుకున్నారు. 

ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ.. రోగులకు వేగంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా డ్రోన్ల ఉపయోగంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్​ లీడర్ గూడూరు నారాయణ రెడ్డి, ఎయిమ్స్ డాక్టర్లు, జిల్లా మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. కాగా, ధన్వంతరి జయంతి(ధంతేరాస్) సందర్భంగా 2016 నుంచి ఏటా ఆయుర్వేద దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.