మోదీకి.. గయానా ‘ది ఆర్డర్ ఆఫ్​ ఎక్సలెన్స్’​ అవార్డు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గయానా దేశం తమ అత్యున్నత జాతీయ పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని రెండు దేశాల ప్రజల మధ్య పెనవేసుకున్న చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నట్టు మోదీ చెప్పారు. ఈ అవార్డు అందుకున్న నాలుగో విదేశీ నేత మోదీ కావడం గమనార్హం. గురువారం గయానాలోని జార్జ్‌‌టౌన్‌‌లోని స్టేట్ హౌస్‌‌లో అవార్డు ప్రదానోత్సవ వేడుక జరిగింది. గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మోదీకి అందజేశారు.

అనంతరం అలీ మాట్లాడుతూ ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కుల కోసం, ప్రపంచ సమాజానికి విశేష సేవలందించినందుకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు చెప్పారు. రెండు దేశాల స్నేహ సంబంధాలు మరింతగా పెంపొందించడం పట్ల ఇండియా నిరంతర నిబద్ధతకు మోదీ చేపట్టిన ఈ గయానా పర్యటనే నిదర్శనమని పేర్కొన్నారు. పెరుగుతున్న టెక్నాలజీ, ఇన్నోవేషన్లు, డిజిటలైజేషన్‌‌ను దేశాల మధ్య అంతరాలు, పేదరికాన్ని తగ్గించి ప్రపంచాన్ని మరింత దగ్గర చేసేందుకు ఉపయోగించాలని అన్నారు.

 “ఇండియా కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్స్​ను ప్రోత్సహిస్తుంది. మిమ్మల్ని ఈ కరికామ్(కరేబియన్ కమ్యూనిటీ అండ్​ కామన్​ మార్కెట్) కుటుంబంలో సభ్యునిగా మేం భావిస్తున్న విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నం’’ అని అలీ అన్నారు. కరికామ్ అనేది 20 కరేబియన్ దేశాలతో కూడి కూటమి. తమ దేశాల అభివృద్ధి సాధనకు ఆర్థిక, రాజకీయ సహకారం కోసం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అవార్డును స్వీకరించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘గయానా యొక్క అత్యున్నత అవార్డు అందజేసినందుకు గయానా, ఇర్ఫాన్ అలీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఇండియాలోని 140 కోట్ల మంది ప్రజల గుర్తింపు. ఈ సంబంధాలను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో గయానా ప్రెసిడెంట్​ఇర్ఫాన్ అలీ ఎంతో దోహదపడ్డారు. గయానాతో భుజం భుజం కలిపి పనిచేయడానికి ఇండియా సిద్ధంగా ఉంది’’ అని మోదీ అన్నారు.