ట్రెయినీ డాక్టర్‌ను నేను చంపలే! పాలిగ్రాఫ్ టెస్ట్‌లో నిందితుడు సంజయ్ రాయ్

న్యూఢిల్లీ: కోల్​కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ట్రెయినీ డాక్టర్​ను తాను చంపలేదని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాలిగ్రాఫ్ టెస్టులో నిందితుడు కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తున్నది. సెమినార్ హాల్​కు వెళ్లేసరికే ట్రెయినీ డాక్టర్ చనిపోయి ఉందని, డెడ్​బాడీ చూశాక భయంతో అక్కడి నుంచి పారిపోయానని చెప్పినట్లు సమాచారం. 

పాలీగ్రాఫ్ టెస్టు చేస్తున్నప్పుడు సంజయ్ రాయ్, డల్​గా.. భయంగా కనిపించాడని సమాచారం. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు, పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తున్నది. క్రైమ్ సీన్​లో దొరికిన ఆధారాలు చూపించి సంజయ్​ను ప్రశ్నించారు. దీంతో, మాట మార్చిన అతను హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్టు చెప్పాడు.

తెల్లవారుజామున హాస్పిటల్​లో నిందితుడు

ఆగస్టు 9 తెల్లవారుజామున 4.03 గంటలకు హాస్పిటల్ నాల్గో ఫ్లోర్​లో ఉన్న ట్రామా సెంటర్​కు వెళ్లాడు. ఇది సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. తర్వాత మూడో ఫ్లోర్​లోని సెమినార్ హాల్ కారిడార్​లోనూ నిందితుడు కనిపించాడు. అప్పుడు, ట్రెయినీ డాక్టర్ సెమినార్ హాల్​లోనే పడుకుని ఉన్నది. కొద్దిసేపటికి నిందితుడు బయటికి వస్తున్న దృశ్యాలు కూడా సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఈ గ్యాప్​లోనే సెమినార్ హాల్​లో పడుకున్న ట్రెయినీ డాక్టర్​పై అత్యాచారం చేసి చంపేశాడని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు.

నేను అమాయకుడిని

‘‘ట్రెయినీ డాక్టర్​పై రేప్, మర్డర్ కేసులో నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నరు. నేను అమాయకుడిని.. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆగస్టు 8న రాత్రి ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్​కు నా ఫ్రెండ్​తో కలిసి వెళ్లాను. అక్కడ నా ఫ్రెండ్ సోదరుడు అడ్మిట్ అయి ఉన్నాడు. అతని హెల్త్ గురించి ఆరా తీశాం. అక్కడి నుంచి బయటికొచ్చాక మందు కొని రోడ్డుపైనే తాగాం. తర్వాత సోనాగాచీ రెడ్‌‌‌‌‌‌‌‌లైట్‌‌‌‌‌‌‌‌ ఏరియాకు వెళ్లాం. అక్కడి నుంచి చెట్లా రెడ్​లైట్ ఏరియాకు బయల్దేరినం. వెళ్తున్నప్పుడే నేను ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించా. 

ఇది అక్కడున్న సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. చెట్లా రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాక.. నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో గది లోపలికి వెళ్లాడు. నేను బయటే ఉన్న.. ఏం చేయాలో తోచక నా గర్ల్ ఫ్రెండ్​కు ఫోన్ చేశా. తన న్యూడ్ పిక్స్ పంపాలని కోరితే సెండ్ చేసింది. తర్వాత ఆర్జీ కర్ హాస్పిటల్​కు వచ్చినం. తర్వాత నేను లోపలి కెళ్లి.. బయటికొచ్చేశా. అటు నుంచి ఇంటికెళ్లి పోయా..’’ అని రాయ్ చెప్పినట్లు సమాచారం.